నానికి కంగ్రాట్స్ చెబుతూనే పంచ్ వేసిన పోలీసులు: యువ దర్శకుడి కామెంట్ వైరల్
నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం 'జెర్సీ'. యూనివర్శల్ సబ్జెక్ట్ అయిన క్రికెట్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. తద్వారా 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి ఫ్లాపుల తర్వాత నానిని హిట్ ట్రాక్ ఎక్కించడంతో పాటు కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక, ఈ సినిమా ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో రెండు విభాగాల్లో ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తాజాగా వినూత్న పోస్టర్‌ను విడుదల చేశారు.
ప్రజలను చైతన్య పరిచేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో వినూత్నమైన కామెంట్లను పెడుతుంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సినిమాలను, హీరోలను వాడి కొన్ని సందేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా జాతీయ అవార్డును దక్కించుకున్న 'జెర్సీ' మూవీ పోస్టర్‌తో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మీమ్ క్రియేట్ చేశారు.

ఇందులో నాని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దిగిన ఫొటోను ఉంచి.. అతడి కొడుకు పాత్రను పోషించిన బాలుడు 'నాన్న నువ్వు హెల్మెట్ పెటుకుంటే బాగుంటావ్' అని చెప్పిన డైలాగ్‌ను ఉంచారు. అలాగే, దాని కిందే నేచురల్ స్టార్ బైక్ నడుపుతున్న ఫొటోను కూడా పెట్టారు. దానికి 'బండి నడిపేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకో నాన్న' అని ఆ బాలుడు చెబుతున్నట్లు క్రియేట్ చేశారు.

ఇక, ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 'జాతీయ అవార్డును అందుకున్న జెర్సీ చిత్రానికి హృదయపూర్వక శుభాకాంక్షలు' అని విషెస్ తెలియజేశారు. ఇక, ఈ పోస్టుకు 'జెర్సీ' సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి స్పందిస్తూ.. 'థ్యాంక్యూ.. మీ మెసేజ్‌కు నేను కూడా ఒప్పుకుంటున్నాను' అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











