ప్రశాంత్ వర్మతో ఎలాంటి సంబంధం లేదు.. ఆ రూమర్స్‌పై డీవీవీ దానయ్య క్లారిటీ
టాలీవుడ్‌లో దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పేరు చర్చనీయంగా మారింది. సోషల్ మీడియా వేదికలపై, కొన్ని సినీ పేజీలు, యూట్యూబ్ ఛానెల్స్ "ప్రశాంత్ వర్మ ప్రముఖ నిర్మాతల వద్ద నుంచి భారీ మొత్తంలో అడ్వాన్సులు తీసుకుని, సినిమాలు చేయకుండా ఉన్నాడు" అని వార్తలు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ఆ జాబితాలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya), ఆయన సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ (DVV Entertainment) పేరు వినిపించడం పరిశ్రమలో సంచలనానికి దారితీసింది. ఈ నేపథ్యంలో తాజాగా DVV ఎంటర్టైన్మెంట్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఆ ప్రకటనలో నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ, "దర్శకుడు ప్రశాంత్ వర్మ DVV ఎంటర్టైన్మెంట్ లేదా నా దగ్గర నుంచి ఎటువంటి అడ్వాన్స్ తీసుకోలేదు. మా మధ్య ఎటువంటి ఆర్థిక లావాదేవీ, ఒప్పందం లేదా వృత్తిపరమైన సంబంధం లేదు" అని స్పష్టం చేశారు. ఆయన ఈ ప్రకటనలో రూమర్స్‌ను ఖండిస్తూ, "ఇటీవల మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం తప్పు. దయచేసి ప్రచురించే ముందు వాస్తవాలను ధృవీకరించండి" అని హెచ్చరిక చేశారు.

ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అన్ని రూమర్స్‌కు క్లారిటీ వచ్చింది. గత కొన్ని రోజులుగా యూట్యూబ్ ఛానెల్స్‌లో "ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా హిట్ అయిన తర్వాత టాప్ నిర్మాతల దగ్గర నుంచి అడ్వాన్స్‌లు తీసుకున్నాడు. కానీ ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ ప్రారంభం కాలేదు. కొంతమంది నిర్మాతలు డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు" అంటూ వార్తలు వైరలవుతున్నాయి. అంతేకాకుండా, ఈ రూమర్స్‌లో "డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్, హంబలే ఫిల్మ్స్, సుధాకర్ చెరుకూరి, నిరంజన్ రెడ్డి" వంటి పెద్ద బ్యానర్ల పేర్లు ప్రస్తావించబడ్డాయి.
అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని DVV ఎంటర్టైన్మెంట్ స్పష్టం చేయడం ద్వారా పరిశ్రమలో ఉన్న అనుమానాలకు తెరపడింది. డీవీవీ దానయ్య మాట్లాడుతూ, "మా బ్యానర్ పేరును అప్రజాస్వామ్యంగా వాడి, తప్పుడు వార్తలు సృష్టించడం బాధాకరం. మా సంస్థ తెలుగు సినిమా పరిశ్రమలో విశ్వసనీయతకు చిహ్నం. మా ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఇలాంటి వదంతులు వ్యాప్తి చెందడం బాధాకరం. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము" అని హెచ్చరించారు. టాలీవుడ్ లో డీవీవీ ఎంటర్టైన్మెంట్ అత్యంత ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ బ్యానర్ పై ఆర్ఆర్ఆర్, భారత్ అనే నేను, వినాయ విథేయత రామ, నాయక్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు నిర్మించింది.
మరోవైపు దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే.. ఆయన పేరు హనుమాన్ (HanuMan) సినిమా విజయంతో దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ సినిమా భారతీయ సూపర్‌హీరో కాన్సెప్ట్‌లో తెరకెక్కి, భారీ వసూళ్లు సాధించింది. తేజ సజ్జ నటించిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్, కథనం ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సక్సెస్‌తో ప్రశాంత్ వర్మ టాలీవుడ్‌లో టాప్ యంగ్ డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోయాడు. హనుమాన్ తర్వాత ఆయన "జై హనుమాన్" (Jai Hanuman)పేరుతో సీక్వెల్ ప్రాజెక్ట్ ప్రకటించారు.
ఇది మరింత గ్రాండ్ స్థాయిలో ఉండబోతోందని, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం షూటింగ్ మొదలవుతుందని, భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











