Baahubali 3: బాహుబలి 3పై రాజమౌళి క్లారిటీ.. ఆ క్రేజీ ప్రాజెక్ట్ బడ్జెట్ ఎన్ని కోట్లంటే?
భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) మరోసారి తన 'బాహుబలి'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకుల మనసును గెలుచుకున్న 'బాహుబలి: ది బిగినింగ్' (2015), 'బాహుబలి: ది కన్‌క్లూజన్' (2017) చిత్రాలను ఇప్పుడు ఒకే సినిమాగా మార్చి, 'బాహుబలి: ది ఎపిక్' అనే టైటిల్‌తో అక్టోబర్ 31న ( నేడు) గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ ప్రత్యేక వెర్షన్‌లో మొత్తం ఐదున్నర గంటల నిడివి ఉన్న రెండు భాగాలను జాగ్రత్తగా ఎడిట్ చేసి, 3 గంటల 43 నిమిషాల నిడివితో విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తం గా విడుదల ఈ సినిమా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో బాహుబలి 3 పై స్పష్టత రాజమౌళి ఇచ్చారు.
'బాహుబలి 3' ఉంటుందా? లేదా? అనే ప్రశ్న చాలా కాలంగా ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. సోషల్ మీడియా వేదికలపై 'బాహుబలి: ది ఎపిక్' మూవీ ఎండింగ్‌లో 'బాహుబలి 3' అనౌన్స్‌మెంట్ ఉండబోతుందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా, ఇంటర్వెల్ లేదా ఎండింగ్ సీన్‌లో "బాహుబలి 3 టీజర్" ప్రదర్శిస్తారనే ప్రచారం కూడా మొదలైంది. ఈ రూమర్లకు స్వయంగా రాజమౌళి పూర్తి క్లారిటీ ఇచ్చారు. 'బాహుబలి: ది ఎపిక్' ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ప్రభాస్, రానా దగ్గుబాటిలతో కలిసి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ "ప్రేక్షకులు ఈ సారి పెద్ద సర్ప్రైజ్ ఉంటుందని అనుకుంటున్నారు. కొందరు 'బాహుబలి 3 టీజర్' వస్తుందని భావిస్తున్నారు. కానీ, అది 'బాహుబలి 3' గురించి కాదు. అది బాహుబలి ఫిల్మీ వరల్డ్ కి కొనసాగింపు. ఇదొక యానిమేషన్ ఫిలిం.గతంలో అమెజాన్ లో రిలీజ్ చేసింది 2D యానిమేషన్. ఇప్పుడు వచ్చేది మాత్రం చాలా చాలా హై.. త్రి డీ యానిమేషన్. బాహుబలి: ది ఎటర్నల్ వార్ 3D యానిమేషన్ మూవీ'' అని రాజమౌళి ప్రకటించారు.
రాజమౌళి వెల్లడించిన ప్రకారం..'నిర్మాత శోభు యార్లగడ్డ గారికి బాహుబలి 3 తీయాలని ఉంది. ఇది అల్టిమేట్ గా బాహుబలి-3 తీసుకురావాలని ఉంది. దాని కంటే ముందు ఏం చేయాలని నిర్మాత శోభు యార్లగడ్డ ఆలోచిస్తూ ఉండేవారు. ఏం చేద్దామనే ప్రయత్నాల్లో ఉండగా.. ఆయన ఇషాన్ శుక్లా అనే ఒక టాలెంటెడ్ యానిమేషన్ డైరెక్టర్ కలిశారు. ఆ వ్యక్తి చాలా టాలెంటెడ్ స్టార్ వార్స్ యానిమేషన్ పోటీలో విన్నర్ నిలిచారని తెలిపారు.
రాజమౌళి ఇంకా మాట్లాడుతూ.. 'బాహుబలి ప్రపంచాన్ని ఎలా విస్తరించవచ్చు, ఇంకా ఏమి చేయొచ్చనే స్టోరీ ఐడియా చెప్పాడు. అలాగే.. బాహుబలి సినిమాలోని పాత్రలతోనే ఎలాంటి కథలను రూపొందించవచ్చనే విభిన్న కథలను సిద్ధం చేశాడు. ఈ విషయాన్ని నాకు నిర్మాత శోభు చెప్పారు. ఆ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. ఆ ప్రాజెక్ట్ పై రెండున్నరేళ్లుగా వర్క్ చేస్తున్నారు. నిర్మాత శోభు దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్ తో 3D యానిమేషన్ మూవీగా చేస్తున్నారు, ప్రపంచంలోని పెద్ద పెద్ద స్టూడియోలు దీని కోసం వర్క్ చేశాయి. అలా రూపొందించిన 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' టీజర్ ని 'బాహుబలి: ది ఎపిక్' ఇంటర్వెల్ లో ప్లే చేయబోతున్నాం'' అని రాజమౌళి ప్రకటించారు.
ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ కూడా నవ్వుతూ స్పందిస్తూ "అరె, 120 కోట్లు ఖర్చు చేశారా? అదీ యానిమేషన్ కోసం?" అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజమౌళి నవ్వుతూ "అది మొదట 'బాహుబలి 1' కోసం ఆలోచించిన బడ్జెట్" అని సరదాగా జవాబిచ్చారు. రానా దగ్గుబాటి కూడా మాట్లాడుతూ, "బాహుబలి ప్రపంచం ఎంత పెద్దదో, దాన్ని కొత్త ఫార్మాట్‌లో చూపించాలనే ప్రయత్నం చాలా ఆసక్తికరంగా ఉంది. యానిమేషన్ ఫార్మాట్‌లో కూడా అదే ఎమోషన్, స్కేల్ మెయింటైన్ చేయగలిగితే అద్భుతం అవుతుంది," అన్నారు.
'బాహుబలి 3'పై ఉన్న ఊహాగానాలకు ముగింపు పలికిన రాజమౌళి ఇప్పుడు యానిమేషన్ రూపంలో బాహుబలి యూనివర్స్‌ను విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాజమౌళి విజన్, శోభు యార్లగడ్డ ప్రొడక్షన్, ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఈ మూడు కలిస్తే, భారత సినిమా కొత్త యుగానికి శ్రీకారం చుడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications











