Kathalu Web Series సతీష్ వేగేశ్న ఓటీటీ ఎంట్రీ.. కథలు మీవీ మావీ అంటూ క్రేజీగా!
దేశవ్యాప్తంగా సినీ అభిమానుల నుంచి వెబ్ సిరీస్‌లకు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. లాక్‌డౌన్ కాలంలో వెండి తెరకు ధీటుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఎదిగాయి. ప్రస్తుతం ప్రముఖ దర్శక, నిర్మాతల నుంచి ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ అందరూ వెబ్ సిరీస్‌లపై కన్నేశారు. తమలోని సృజనాత్మకతకు పదునుపెడుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా వెబ్ సిరీస్ చిత్రాలకు ఆదరణ దక్కుతున్నది. ఈ క్రమంలో శతమానం భవతి లాంటి చిత్రంతో జాతీయ అవార్డును అందుకొన్న సతీష్ వేగేశ్న కూడా వెబ్ సిరీస్‌కు శ్రీకారం చుట్టారు.
తెలుగుదనం ఉట్టిపడేలా.. గ్రామీణ నేపథ్యంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు వెబ్ సిరీస్‌ను ప్రారంభించారు. రూరల్ బ్యాక్ డ్రాప్‌తో కథల సమాహారాన్ని (అంథాలజీ)ని రూపొందిస్తున్నారు. బంధాలు, భావోద్వేగాలు కథాంశంగా కథలు.. మీవి.. మావీ అనే ట్యాగ్‌లైన్‌తో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై అడుగుపెట్టారు.

కథలు.. మీవీ మావీ అంథాలజీలో భాగంగా మూడు కథలను ఇప్పటికే సతీష్ వేగేశ్న పూర్తి చేశారు. త్వరలోనే మరికొన్న ఎమోషనల్ స్టోరీస్‌ను తెరకెక్కించడమే కాకుండా.. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత తొందరగా కథలు వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ఛానెల్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
శతమానం భవతి లాంటి చిత్రంతో జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్న సతీష్ వేగెశ్న సినిమాలంటే ఫ్యామిలీ అడియెన్స్‌కు మంచి గురి. కుటుంబ కథా చిత్రాలతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్నారు. అలాంటి దర్శకుడి నుంచి వస్తున్న కథలు వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కథలు వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. త్వరలోనే అధికారికంగా నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను వెల్లడించనున్నట్టు యూనిట్ తెలిపింది. ఈ వెబ్ సిరీస్‌లో ప్రముఖ నటీనటులు నటిస్తున్నట్టు సమాచారం.

ఇక సతీష్ వేగేశ్న విషయానికి వస్తే.. కథలు వెబ్ సిరీస్‌తోపాటు కోతి కొమ్మచ్చి, శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే చిత్రాలను రూపొందిస్తూ బిజీగా ఉన్నారు. మరికొన్ని చిత్రాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











