HBD SS Rajamouli: అసిస్టెంట్ ఎడిటర్ నుంచి దర్శకధీరుడిగా... ఎస్ఎస్ రాజమౌళి ఆస్తులు ఎన్ని కోట్లంటే?
బాహుబలి సిరీస్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌తో దానిని మరో మెట్టు పైకెక్కించి హాలీవుడ్ రేంజ్‌లో నిలబెట్టారు. ఏకంగా ఆస్కార్ అవార్డ్ సాధించి భారతీయ చిత్ర పరిశ్రమలో అరుదైన ఘనతను అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు సహా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం జక్కన్న ప్రతిభను మెచ్చుకున్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ టూ బాలీవుడ్ బడా నిర్మాతలు రెడీగా ఉన్నారు. రాజమౌళి సినిమాలో చిన్న ఛాన్స్ దొరికినా చాలని అనుకునే స్టార్స్ ఎంతో మంది ఉన్నారు. బాలీవుడ్ బిగ్‌స్టార్స్ మొత్తం జక్కన్న గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన రాజమౌళి పుట్టినరోజు . ఈ నేపథ్యంలో జక్కన్న సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, రాజమౌళి ఆస్తులు ఎన్ని కోట్లు అనేది పరిశీలిస్తే..
అసిస్టెంట్ ఎడిటర్‌గా ప్రస్థానం
ఎస్ఎస్ రాజమౌళి పూర్తి పేరు.... కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. 10 అక్టోబర్ 1973న కర్ణాటకలోని హిరే కొట్నెక్కల్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విజయేంద్ర ప్రసాద్, రాజా నందిని. ఆయనకు ఓ అక్క ఉన్నారు. విజయేంద్రప్రసాద్ తన సోదరులతో కలిసి ఇప్పటికీ ఓకే ఇంట్లో నివసిస్తున్నారు. సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, కళ్యాణి మాలిక్, ఎస్ఎస్ కాంచిలు రాజమౌళికి సోదరులు అవుతారు. ఏలూరులో ఇంటర్ వరకు చదువుకున్న రాజమౌళి సినిమాలపై ఆసక్తితో ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర అప్రెంటీస్‌గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత క్రాంతి కుమార్, గుణ్ణం గంగరాజు, కే రాఘవేంద్రరావుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

కెరీర్ మలుపు తిప్పిన శాంతి నివాసం సీరియల్
ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి వాణిజ్య ప్రకటనలు డైరెక్ట్ చేసిన రాజమౌళి ప్రతిభను గమనించిన దర్శకేంద్రుడు.. తను నిర్మాతగా ఈటీవీ కోసం తీస్తోన్న శాంతి నివాసం సీరియల్‌కు రాజమౌళికి దర్శకుడిగా అవకాశం కల్పించారు. ఆ సమయంలో రోజుకు 17 గంటలు పనిచేసినట్లు జక్కన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సీరియల్‌తో తన ప్రతిభను నిరూపించుకున్న రాజమౌళికి తను నిర్మిస్తోన్న సినిమాలో అవకాశం కల్పించారు రాఘవేంద్రరావు. అదే స్టూడెంట్ నెంబర్ వన్. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా.. రాజమౌళికి దర్శకుడిగా తొలి సినిమా. ఆ తర్వాత సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలు తెరకెక్కించారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబీ 29 అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.
పాన్ ఇండియా కల్చర్‌కు శ్రీకారం
తన సినిమాలు, టేకింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీలతో తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతీని తీసుకొచ్చారు రాజమౌళి. టాలీవుడ్ జనాలు కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డ్‌ను సాధించుకొచ్చారు జక్కన్న. కెరీర్‌లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా రాజమౌళి తన పేరిట చరిత్ర లిఖించుకున్నారు. సమీప భవిష్యత్తులో ఆ రికార్డును ఛేదించేవారు కనిపించడం లేదు. బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా కల్చర్‌కు శ్రీకారం చుట్టి బాలీవుడ్ పునాదుల్ని కదలించాడు రాజమౌళి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. రమా రాజమౌళిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు జక్కన్న. రమకు గతంలోనే పెళ్లవ్వగా ఆమెకు మొదటి భర్త ద్వారా కలిగిన కార్తీకేయని దత్తత తీసుకున్నారు రాజమౌళి. అలాగే మయూఖను కూడా ఈ దంపతులు దత్తత తీసుకున్నారు.
రాజమౌళి సంపద ఎంతంటే?
రాజమౌళి ఒక్కో సినిమాకు 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటారని అంచనా. లాభాల్లో వాటా, థియేట్రికల్ బిజినెస్‌లో షేర్ వంటి వాటితో కలిపి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఉంటుందని విశ్లేషకుల అంచనా. తద్వారా భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడిగా రాజమౌళి నిలిచారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో తెరకెక్కిస్తోన్న ఎస్ఎస్ఎంబీ 29లో రాజమౌళి లాభాల్లో 40 శాతం వాటా తీసుకునేలా నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇవి కాక జక్కన్నకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఒక విలాసవంతమైన విల్లాతో పాటు హైదరాబాద్‌లో పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు ఉన్నట్లు టాక్. మొత్తంగా రాజమౌళి ఆస్తులు 270 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల మధ్య ఉంటాయని అంచనా. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటోంది ఫిల్మీబీట్.


Click it and Unblock the Notifications











