Vishwambhara Mega Blast Glimpse Review: విశ్వంభర మెగా బ్లాస్ట్ గింప్స్.. వశిష్ట మాయాజాలం, యోధుడిలా చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా విశ్వంభర. సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీపై బజ్ కూడా లేకపోవడంతో మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దీని కంటే వెనుక మొదలైన అనిల్ రావిపూడి- చిరంజీవిల మెగా 157పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో విశ్వంభర యూనిట్‌పై నానాటికీ ఒత్తిడి పెరిగిపోతోంది. విశ్వంభరపై హైప్ క్రియేట్ చేసేందుకు గతంలో టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అందులో కనిపించిన వీఎఫ్ఎక్స్ వర్క్, చిరంజీవి లుక్‌పై బోల్డెంత నెగిటివిటీ, ట్రోలింగ్ నడిచింది. దీంతో చిత్ర యూనిట్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది.

విశ్వంభర బడ్జెట్ ఎంత?
చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయల వ్యయంతో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వీ వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. విశ్వంభరలో త్రిషా కృష్ణన్, అషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి పురానిక్, కునాల్ కపూర్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్‌లో అలరించనున్నారు.
విశ్వంభర రిలీజ్ ఎప్పుడంటే?
ఇంతలో విశ్వంభర రిలీజ్ డేట్‌పై రకరకాల రూమర్స్ వచ్చాయి. దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలోని సెకండాఫ్ చాలావరకు గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్స్‌పై ఆధారపడి ఉంది. బెస్ట్ క్వాలిటీ, అత్యున్నత ప్రమాణాలతో సినిమాను అందించాలనే ప్రయత్నం వల్లే విశ్వంభర ఆలస్యమవుతోందని చిరు తెలిపారు. చందమామ కథలా ఈ చిత్రం ఉంటుందని, పెద్దవారి నుంచి పిల్లల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారని మెగాస్టార్ పేర్కొన్నారు. 2026 వేసవిలో విశ్వంభర రిలీజ్ అవుతుందని చిరంజీవి వెల్లడించారు.
మెగాస్టార్‌కు బర్త్ డే గిఫ్ట్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. గతంలో వచ్చిన టీజర్‌లో సీజీ వర్క్స్‌లో జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 1.14 నిమిషాల నిడివి ఉన్న ఈ మెగా బ్లాస్ట్ గ్లింప్స్ విషయానికి వస్తే.. 'అసలు ఈ విశ్వంభరలో ఏం జరిగిందో ఈరోజైనా చెబుతావా అని ఓ చిన్న పిల్ల వాయిస్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఒక సంహారం, దాని తాలుకూ యుద్ధం అని ఓ బేస్ వాయిస్ వస్తుంది.
మరో లోకంలోకి తీసుకెళ్లిన వశిష్ట
ఒకడి స్వార్ధం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అంతకుమించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతుకున్న ఓ సమూహం తాలుకూ నమ్మకం.. అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు ఒకడొస్తాడని.. ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించేలా చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురుచూస్తోంది. ఎవరతను అని చిన్నారి అడగ్గా.. చిరంజీవి ఎంట్రీ ఇచ్చి రౌడీలను కత్తికొక కండగా నరికిపారేస్తాడు. చివరిలో దుమ్మును కత్తితో నరికిన తెర చాటు నుంచి చిరంజీవి కనిపిస్తారు. అలాగే ఏదో జీవి కనుగుడ్డుని మెగాస్టార్ చేతితో నలిపేస్తుంటాడు. మొత్తం మీద చిరంజీవిని ఓ యోధుడిగా, జగదేక వీరుడిగా చూపించాడు వశిష్ట. గ్రాఫిక్స్ వర్క్ ఎలాంటి వంక పెట్టుకుండా ఉండగా.. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తేలు లాంటి పెద్ద జంతువులు, చిరంజీవి చేతిలో ఏదో జీవి కన్ను చూస్తుంటే ప్రేక్షకులను వశిష్ట మరో లోకానికి తీసుకెళ్తున్నాడని అనిపిస్తోంది. ఓవరాల్‌గా ఈ మెగా బ్లాస్టింగ్ గ్లింప్స్.. విశ్వంభర మీద అంచనాలను పెంచేసింది.


Click it and Unblock the Notifications











