Amazon Prime Video లో రికార్డు సృష్టించిన షేర్షా.. కియారా అద్వానీ అమర ప్రేమకు నీరాజనం!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజైన షేర్షా మూవీ ఓటీటీలో భారీ రికార్డును అందుకొన్నది. బాలీవుడ్ తారలు కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా నటించిన ఈ చిత్రం ఓటీటీలో ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. దేశవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితుల కారణంగా షేర్షా చిత్రం ఆగస్టు 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే షేర్షా అందుకొన్న రికార్డులు ఏమిటంటే..
కార్గిల్ యుద్ధంలో అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా షేర్షా చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి ఐఎమ్‌డీబీలో 88 వేల మంది స్పందించారు. దాంతో షేర్షాకు ఐఎమ్‌డీబీ 8.9 రేటింగ్ ఇచ్చింది. హిందీ సినిమాల రేటింగ్ విషయంలో .. షేర్షా ఐఎమ్‌డీబీలో సరికొత్త మైలురాయిగా నిలిచింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన షేర్షా చిత్రం ఇప్పటి వరకు భారత్‌లో అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ సిందర్భంగా చిత్ర యూనిట్ స్పందిస్తూ.. షేర్షా ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి ఆదరణ చూరగొంటున్నది. దేశవ్యాప్తంగా 4100 పట్టణాల నుంచి యూజర్లు ఈ సినిమాను చూశారు. ప్రపంచంలోని 210 దేశాల్లోని అమెజాన్ యూజర్లు ఈ సినిమాను వీక్షించారు. ఇప్పటి వరకు అమెజాన్ చరిత్రలో ఏ చిత్రాన్ని కూడా ఇంతమంది ప్రేక్షకులు చూడలేదు అని చెప్పారు.
షేర్షా సక్సెస్ గురించి నిర్మాత కరణ్ జోహర్ మాట్లాడుతూ.. షేర్షా చిత్రం నా హృదయానికి దగ్గరైన చిత్రం. ఈ సినిమాకు వస్తున్న ప్రశంసలతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాతో భాగమైన ప్రతీ ఒక్కరికి ఆ ఘనత చెందుతుంది. పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితాన్ని దేశంలో ఏ ఒక్కరు కూడా మరువలేరు. ఆయన ధైర్య సాహాసాలను తెరమీద చూపించే ప్రయత్నం చేశాం. డింపుల్ పాత్రలో కియారా అద్వానీ, విక్రమ్ బాత్రా పాత్రలో సిద్ధార్థ్ మల్హోత్రా చక్కగా నటించారు అని అన్నారు.

దక్షిణాది దర్శకుడు విష్ణువర్ధన్ రూపొందించిన షేర్షా చిత్రంలో విశ్ పండిట్, రాజ్ అర్జున్, ప్రణయ్ పచూరి, హిమాంశు మల్హోత్రా, నిక్తిన్ ధీర్, అనిల్ చరంజీత్, సాహిల్ వేద్, షాతాఫ్ ఫిగర్, పవన్ చోప్రా తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











