‘సూపర్ 30’ మూవీ బీహార్‌కు గౌరవం తెస్తుంది: ఆనంద్ కుమార్
పట్నాకు చెందిన గణితశాస్త్ర బోధకుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సూపర్ 30'. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ బయోపిక్ వికాస్ బెహల్ దర్శకత్వంలో తెరకెక్కింది. జులై 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ఓ షాకింగ్ విషయం వెల్లడించారు. తాను ఎకూస్టిక్ న్యూరోమా అనే బ్రెయిన్ ట్యూమర్‌తో బాధ పడుతున్నానని, 2014లో నాకు ఇది ఉన్నట్లు తెలిసింది. చనిపోయేలోపు నా బయోపిక్ చూడాలనుకున్న ఆశ తీరిందని, ఈ సినిమా బీహార్ రాష్ట్రానికి గౌరవం తెస్తుందన్నారు.

బీహార్‌కు సంబంధించిన ఏ సినిమా కథైనా నెగిటివిటీ, దోపిడీల గురించే ఉంటుంది. అయితే 'సూపర్ 30' అందుకు భిన్నంగా ఈ రాష్ట్రానికి గౌరవం తెచ్చే విధంగా ఉంది. బీహార్ అంటే ఏమిటో ఇపుడు ప్రపంచానికి తెలుస్తుంది. కష్టాలు పడి ఉన్నత స్థానానికి ఎదిగిన వారు ఇక్కడ ఉన్నారనే విషయం అందరికీ తెలుస్తుందని ఆనంద్ కుమార్ తెలిపారు.

వికాస్ బెహల్ దర్శకత్వం వహించిన 'సూపర్ 30' కథ విషయానికొస్తే... ఆనంద్ కుమార్ 'సూపర్ 30' అనే ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌ను రన్ చేస్తూ ఏటా 30 మంది పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారికి ఐఐటీలో సీటు దక్కేలా చేస్తున్నాడు. తన కెరీర్లో ఎంతో మంది పేదల ఐఐటి కల సాకారం చేసిన అతడి జీవితాన్నే సినిమాగా తీశారు.
హృతిక్ రోషన్ అనగానే మనకు కండలు తిరిగిన శరీరం, సూపర్ మ్యాన్ లాంటి కటౌట్ గుర్తుకు వస్తుంది. అయితే ఇందులో ఆయన పూర్తి భిన్నమైన లుక్‌తో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











