Baahubali The Epic Collections: అడ్వాన్స్ బుకింగ్‌లో బాహుబలి సునామీ.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క శెట్టి, రానా, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తదితరులు నటించిన చిత్రం బాహుబలి. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ పేరుతో రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ లెక్కలను మార్చేసింది. ఈ రెండు చిత్రాలు కలిపి 2500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్‌ని రాబట్టి భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ రెండు భాగాలను కలిపేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే బాహుబలి ది ఎపిక్‌కు అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మించగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటిండ్ నిర్వహించారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. బాహుబలి ది బిగినింగ్‌కు 180 కోట్ల రూపాయలు, బాహుబలి ది కన్‌క్లూజన్‌కు 250 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో బాహుబలి సిరీస్‌కు మొత్తంగా 450 కోట్ల బడ్జెట్ అయ్యింది.

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో బాహుబలిని కూడా రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ విషయంలోనూ రాజమౌళి తన ముద్ర చూపించారు. బాహుబలి రెండు భాగాలను కలిపి ఒకేసారి రిలీజ్ చేయాలని నిర్ణయించుకుని సంచలనం సృష్టించారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే దృశ్య కావ్యం అనదగ్గ బాహుబలి మరోసారి రిలీజ్ అవుతుండటంతో ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌తో పాటు యూఎస్ఏలో ప్రీమియర్స్ కోసం బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. యూఎస్ఏలో 401 థియేటర్లు, యూకే అండ్ ఐర్లాండ్‌లలో 210 థియేటర్లు, యూఏఈ అండ్ ఇతర గల్ఫ్ దేశాలలో 152 థియేటర్లు, ఆస్ట్రేలియా- న్యూజిలాండ్‌లలో 144 థియేటర్లు, రెస్టాఫ్ ది వరల్డ్‌లో మరో 250 థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కానుంది.
నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ విషయంలో బాహుబలి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఒక్క అమెరికాలోనే 129 లోకేషన్స్‌లో, 149 షోలకు గాను.. 2,83,747 డాలర్లు (భారత కరెన్సీలో 2.50 కోట్ల రూపాయలు) రాబట్టింది. నార్త్ అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, గల్ఫ్ తదితర దేశాలలోనూ బాహుబలి ది ఎపిక్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో కలెక్షన్ల పంట పండిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో తొలి రోజు ఓవర్సీస్‌లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబడుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
ఇక ఇండియాలోనూ బాహుబలి అడ్వాన్స్ బుకింగ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం .. తెలుగు వెర్షన్‌లో ఇండియా వైడ్‌గా 1620 షోలకు గాను.. 4.46 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 434 షోలకు గాను 2.02 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్ కలెక్షన్ + ఇండియా వైడ్ వసూళ్లు కలిపి బాహుబలి ది ఎపిక్‌కు తొలి రోజు వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 8.85 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











