Kantara Chapter 1 Day 3 Collections: 200 కోట్లకు చేరువగా కాంతార చాప్టర్ 1.. 3వ రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి స్వయంగా హీరోగా, దర్శకుడిగా రెండు రకాల పాత్రలు పోషించారు. గతంలో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. రుక్మిణీ వసంత్ ఈ చిత్రంలో రిషబ్ శెట్టి సరసన హీరోయిన్‌గా నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ 1 సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు కాంతార చాప్టర్ 1 ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లుగా చెబుతున్నారు. కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

కాంతార చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారీ అంచనాల మధ్య కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.
కాంతార చాప్టర్ 1 రెండు రోజుల కలెక్షన్స్
రిషబ్ శెట్టి మూవీకి పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్ తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 46 కోట్ల చొప్పున 108 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 1.2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 10.65 కోట్ల రూపాయలు), యూకే, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలలో 4 కోట్ల రూపాయల చొప్పున ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి కాంతార చాప్టర్ 1 వరల్డ్ వైడ్‌గా రెండ్రోజుల్లో 150 కోట్లకు చేరువైనట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కాంతార తొలి రోజు కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1పై తొలి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే ఈ సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. తొలి రోజున ఈ చిత్రానికి పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 12 కోట్ల రూపాయలు చొప్పున కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వారీగా వసూళ్లు పరిశీలిస్తే.. నైజాంలో 4.45 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.91 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 1.37 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 67 లక్షల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 44 లక్షల రూపాయలు, గుంటూరులో 65 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 90 లక్షల రూపాయలు, నెల్లూరులో 41 లక్షల రూపాయలు చొప్పున 25 కోట్ల రూపాయల గ్రాస్.. 16 కోట్ల రూపాయల షేర్ అందుకుంది కాంతారా చాప్టర్ 1.
ఇండియాలోని ప్రాంతాల వారీగా కాంతార కలెక్షన్స్ పరిశీలిస్తే.. కర్ణాటకలో 34 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల రూపాయలు, హిందీలో 31 కోట్ల రూపాయలు, తమిళనాడులో 11 కోట్ల రూపాయలు, మలయాళంలో 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది.
కాంతార చాప్టర్ 1 మూడో రోజు కలెక్షన్స్
వీకెండ్ కావడంతో కాంతార చాప్టర్ 1కు సాలీడ్‌గా టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. మూడో రోజు సాయంత్రం 5 గంటల వరకు ఈ సినిమాకు కన్నడ వెర్షన్‌లో 70 శాతం, తెలుగు వెర్షన్‌లో 37 శాతం, హిందీ వెర్షన్‌లో 14 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. మూడో రోజు కాంతార చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. కన్నడంలో 17 కోట్ల రూపాయలు, హిందీలో 15 కోట్ల రూపాయలు, తెలుగులో 10 కోట్ల రూపాయలు, తమిళంలో కోటి రూపాయలు, మలయాళంలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయల చొప్పున 45 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో రిషబ్ శెట్టి మూవీ 3 రోజుల్లోనే 200 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది.


Click it and Unblock the Notifications











