OG 13 Days Box Office: కాంతారకు ధీటుగా ఓజీ కలెక్షన్లు.. 13 రోజుల్లో పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
తెలుగు సినిమా అభిమానులందరూ ఊహించినట్టుగానే పవన్ కల్యాణ్ నటించిన ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టించింది. 2025 సంవత్సరంలో రిలీజైన తెలుగు చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ విషయాన్ని స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రం గత 12 రోజులుగా ఎంత వసూలు చేసింది? ఈ చిత్రం 13వ రోజున ఏ రేంజ్ కలెక్షన్లు సాధించింది? అనే వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ OG. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.

ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ నిర్వర్తించారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన పాటలు ఈ సినిమాను భారీ హైప్‌ను ఇచ్చాయి.ఓజీ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 225 కోట్ల రూపాయలుగా నమోదైందని బిజినెస్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 230 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని చేపట్టిన ఈ చిత్రం రికార్డు వసూళ్లను నమోదు చేస్తున్నది.
ఇండియాలో ఈ చిత్రం తొలివారం భారీ వసూళ్లను నమోదు చేసింది. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం 170 కోట్ల రూపాయలు రాబట్టింది. తెలుగులో 188 కోట్ల రూపాయలు, కన్నడలో 20 కోట్ల రూపాయలు, తమిళంలో 4 కోట్ల రూపాయలు, మలయాళంలో 50 లక్షల రూపాయలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 12 రోజుల్లో 223 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం నైజాంలో 50.5 కోట్లు, సీడెడ్‌లో 18 కోట్లు, ఉత్తరాంధ్రలో 16.5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 8.5 కోట్ల రూపాయలు, గుంటూరులో 11 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 10 కోట్లు, నెల్లూరు జిల్లాలో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో 190 కోట్ల రూపాయల గ్రాస్, 130 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఓవర్సీస్‌లో ఓజీ సినిమాకు బ్రహ్మండమైన రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక గత 12 రోజుల్లో ఈ చిత్రం 9 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 310 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ చేరువగా వచ్చింది.
ఇక 13వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్గా వసూళ్లు సాధిస్తున్నది. 12వ రోజ 2 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ చిత్రం.. అదే జోష్‌తో మరో 2 కోట్లు మంగళవారం వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 312 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేశారు.


Click it and Unblock the Notifications











