»   »  చిరుపార్టీ-పెను తుపాన్

చిరుపార్టీ-పెను తుపాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిన్న కుమార్తె ప్రేమ వివాహంతో చిరంజీవి పనైపోయిందని సంకలు కొట్టుకున్నవారికి గుండె దడ మొదలయి ఉండవచ్చు. ఏదో ఒక రోజు చిరంజీవి పార్టీ పెట్టడం ఖాయమని భావించిన వారికి సంక్రాంతికి చిరంజీవి పార్టీ పెట్టనున్నారనే వార్త ఆనందాన్ని కలిగించిఉండవచ్చు. చిన్న కూతురు ప్రేమ వివాహంతో చిరంజీవి కుంగిపోయారని భావించిన వారికి ఈ వార్త చేదును కలిగిస్తుందనడంలో సందేహం లేదు. నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అన్నట్టు చిరంజీవి మంచివాడే కానీ రాజకీయాలు వేరుగా ఉంటాయని చెప్పింది నిజమేననపిస్తుంది. ఆ ఎమ్మెల్యే కోణంలోనే ఇపుడు చిరంజీవి పార్టీ పెట్టడానికి సమాయత్తమవడం రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉండవచ్చు. చిరంజీవి కుమార్తెప్రేమ వివాహం వెనుక ముగ్గురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారన్న వార్తే నిజమైతే వారికి కూడా ఈ చలికాలంలో చెమటలు పట్టడం ఖాయంగా చెప్పవచ్చు. ఎందుకంటే గోడకు కొట్టిన బంతిలాగా చిరంజీవి తన శక్తియుక్తులను కూడదీసుకుని దెబ్బతీయడానికి ప్రయత్నించిన శతృవుల స్టయిల్లోనే రాజకీయ ఆరంగేట్రం చేయడానికి సిద్ధం కావడం నిజంగా గమనించదగ్గ అంశం. కష్టాలే మనిషిని గట్టి నిర్ణాయాలు తీసుకునేలా చేస్తుందనడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చిరంజీవి కూడా వాటినుంచి స్ఫూర్తిని తీసుకున్నట్టు కనిపిస్తోంది. కష్టాలు వచ్చినపుడు వెరవకుండా ఉండి లావా లాగా పైకెగసి వచ్చినట్టుగా చిరంజీవి రంగంలోకి దిగుతున్నారు. రాజకీయ రంగంలో హత్యో ఆత్మహత్యో ఉంటుంది. ఎదుటివాడిని హత్య చేయలేక పోతే మిగిలింది ఆత్మహత్యే. చిరంజీవి రెండోదానికే పరిమితమవుతారని భావించారు. అలాంటి అంచనాలను తలకిందులు చేస్తూ హత్య చేయడానికే చిరంజీవి సిద్ధమయారు. అలా చేయడమే రాజకీయ రంగంలో సరైన మార్గం. లేకుంటే ఇంట్లో కూర్చుని ఈగలు తోలుకుంటూ ఉండాల్సిందే. రాజకీయాలలో సమయానిది కూడా చాలా ముఖ్య భూమిక ఉంటుంది. సమయానికి స్పందించకపోతే ఎదుటివాడు అవకాశాన్ని వినియోగించుకుంటాడు. ఇపుడు సరైన సమయమా కాదా అంటే కచ్చితంగా సరైన సమయమే. బిఎస్పీ రాష్ట్రంలో తన సత్తాను నిరూపించుకోవడానికి ఉత్సుకతతో ఉండడమే కాదు. అందుకు తగినట్టుగా అడుగులు కూడా ఆ పార్టీ వేస్తోంది. ఈ నేపథ్యంలో గట్టి పోటీ ఏర్పడుతుంది. పోటీ ఎక్కువగా ఉంటే నిఖార్సయిన వాడే నిలబడగలడు. పోటీకి బయపడి వెన్ను చూపితే ఓటమిని అంగీకరించినట్టే. ఇపుడు చిరంజీవి పోటీనే కోరుకుంటున్నారు. మంచిచెడు, లాభనష్టాలను ప్రజలు అదే ఓటరు దేవుళ్లు బేరీజు వేసుకుంటారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉండడం ప్రజలకు కూడా మంచిదే. ఎవరు ఏం చేశారనేది విశ్లేషించుకోవడానికి ఈ సమయం చాలు. రాజకీయ యుద్ధ రంగంలో ఎవరు గెలుస్తారనేది తరువాత కానీ ప్రజలకు మేలు చేసే మేలైన నాయకులు గెలవాలి.. మేకవన్నె పులులను ఇంటికే పరిమితం చేయాలి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లు అయినా ప్రజలు ఎ స్థితిలో ఉన్నారో ఆలోచిస్తే ఎవరు గెలవాలి ఎవరు ఓడాలి అనేది కూడా క్లియర్ అవుతుంది. మొత్తానికి రాజకీయం అసలు రంగు బయటపడే రోజు రానే వచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X