చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్‌లో మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి లీక్ చేసిందేమిటంటే?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా ఆగస్టు 22వ తేదీన ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సుస్మిత, సాహు, సంగీత దర్శకుడు భీమ్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ..
చిరంజీవి గారు నటించిన ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు నాకు ఇష్టం. ఆయన రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి గారిలో ఉండే స్వాగ్‌ను చూడాలని ఎదురు చూశాను. ఆ అవకాశం ఈ సినిమా రూపంలో వచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవి మీరు ఎలా చూడాలనుకొంటున్నారో.. సంక్రాంతికి రెండితలు చూస్తారు. పాటలు, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఈ రోజు ప్రకటించారు. ఆయన పేరులోని శివశంకర వరప్రసాద్ నుంచి మన శంకర వరప్రసాద్ అనే టైటిల్‌ను పెట్టాం అని అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అంటే ఒక కల అంటారు. ఆయన పోస్టర్ చూస్తేనే సినిమా చూడాలనిపించేంత అట్రాక్షన్ ఆయన సొంతం. వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, చిరంజీవితో సినిమా చేయడం ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ మూమెంట్. దానిని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ షాట్ తీసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను అని అనిల్ రావిపూడి చెప్పారు.
ఈ సినిమా కోసం వెంకటేష్ గారిని అడగ్గానే.. హ్యాపీగా వచ్చి.. ఆయన వాయిస్ కూడా ఇచ్చారు. ఈ సినిమా గ్లింప్స్‌కు వాయిస్ ఇచ్చిన ఆయన త్వరలోనే షూటింగులో పాల్గొంటారు. ఈ సంక్రాంతి పండుగకు చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు మ్యాజిక్ చేస్తారు. చిరంజీవి, వెంకటేష్ మంచి స్నేహితులు, వారిద్దరూ కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని ఎదురు చూసిన అభిమానులకు పండగే అని అనిల్ రావిపూడి అన్నారు.

అయితే బాలకృష్ణ, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. చిరంజీవి, వెంకటేష్ ప్రయాణం మొదలైంది. బాలయ్య 50 ఏళ్ల వేడుకలో చిరంజీవి గారే స్వయంగా చెప్పారు.. మేమిద్దరం కలిసి నటించాలని ఉంది అని. వారిద్దరికి సరిపోయే కథ సెట్ కావాలి. ఇద్దరు వేర్వేరు ఇమేజ్ ఉన్న స్టార్స్. నేను వారిద్దరితో కలిసి పనిచేశాను. ఒక మంచి కథ కుదిరితే తప్పకుండా వారిద్దరితో సినిమా చేస్తాను. ప్రస్తుతం తన దగ్గర అలాంటి కథ ఏదీ లేదు అని అనిల్ రావిపూడి తెలిపారు.
మన శంకర వరప్రసాద్ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో, ప్రొడక్షన్ డిజైనర్‌గా ఏఎస్ ప్రకాశ్ తదితరులు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి 2026 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.


Click it and Unblock the Notifications











