సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని కిడ్నాప్ చేసి.. వెలుగులోకి విశాల్ హీరోయిన్ దారుణం
సినిమాలలో హీరోలు, హీరోయిన్లు ఎంతో మంచివారు ఉంటూ అందరి క్షేమం కోసం పాటుపడతారు. కానీ నిజ జీవితంలోకి వస్తే నటీనటుల ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉంటుంది. హత్యలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, గొడవలు, కొట్లాటలతో అభిమానులే అసహ్యించుకునేలా ప్రవర్తిస్తారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసు, హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లాడు. అదే బాలీవుడ్‌కు చెందిన సంజయ్ దత్ ముంబై బాంబు పేలుళ్లు, అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఇక నిన్నగాక మొన్న కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన దర్శన్ తన వీరాభిమానిని దారుణంగా హత మార్చాడు. తొలుత బెయిల్ తెచ్చుకున్నా సుప్రీంకోర్ట్ జోక్యంతో మరోసారి జైల్లో అడుగుపెట్టాడు. తాజాగా ఓ హీరోయిన్ ఈ లిస్ట్‌లో చేరింది. ఈ వివరాల్లోకి వెళితే..
మలయాళ, తమిళ భాషల్లో సినిమాలు
కేరళకు చెందిన లక్ష్మీమీనన్ భరతనాట్యంలో డిప్లొమా పట్టా అందుకుని ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టింది. 2011లో మలయాళ దర్శకుడు వినయన్ చేతుల మీదుగా ఆమె సినీరంగ ప్రవేశం జరిగింది. ఆ తర్వాత సుందర పాండియన్, కుంకీ, కుట్టి పులి, పాండియనాడు, వెదళం, రెక్కా, పులికుక్కతి పండి, చంద్రముఖి 2, శబ్ధం తదితర చిత్రాల్లో నటించింది. నటిగానే కాకుండా సింగర్‌గానూ లక్ష్మీ మీనన్ గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఈమెకు పలువురు హీరోలతో ఎఫైర్లు ఉన్నాయంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

విశాల్‌తో ప్రేమాయణం?
ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో లక్ష్మీ పీకల్లోతు ప్రేమాయణాన్ని నడిపిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. వీరిద్దరూ పలు చిత్రాల్లో కలిసి నటించగా.. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీంతో విశాల్ ఈ వార్తలను ఘాటుగా ఖండించారు. ఈ రూమర్‌లో ఎలాంటి నిజం లేదని.. సహజంగా ఇలాంటి వాటిని నేను పట్టించుకోనని,కానీ ఓ అమ్మాయికి నాకు లింక్ పెట్టి ఆమెను రోడ్డు మీదకి లాగారని, ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్నారని అందుకే స్పందించాల్సి వచ్చిందని విశాల్ స్పష్టం చేశారు. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, ఒకవేళ అది జరిగితే నేనే అధికారికంగా వెల్లడిస్తానని విశాల్ తేల్చేశారు.
మద్యం మత్తులో రచ్చ
తన సినిమాలు తాను చేసుకుంటూ వస్తున్న లక్ష్మీమీనన్ తాజాగా ఓ వివాదంలో ఇరుక్కుంది. ఆదివారం రాత్రి కొచ్చిలోని ఓ బార్ వద్ద లక్ష్మీమీనన్, ఆమె ఫ్రెండ్స్ పీకలదాకా తాగి ఈలలు, కేకలు వేస్తూ కనిపించారు. ఈ క్రమంలో ఓ యువతి వీరిని వారించే ప్రయత్నం చేయగా .. లక్ష్మీమీనన్ ఆమె ఫ్రెండ్స్ మండిపడ్డారు. ఆమెతో గొడవకు దిగి దాడి చేశారు.. అక్కడితో ఆగకుండా బాధితురాలిని కారులో ఎక్కించుకుని అసభ్యపదజాలంతో దూషిస్తూ హింసించారు. అర్ధరాత్రిపూట ఎక్కడో విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఎలాగోలా తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలు ఎర్నాకుళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పరారీలో లక్ష్మీమీనన్
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను హింసించిన లక్ష్మీమీనన్ స్నేహితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. హీరోయిన్‌ను కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో పోలీసులు లక్ష్మీమీనన్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. లక్ష్మీమీనన్ వ్యవహారం ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారగా.. హీరోయిన్ ఆమె మిత్రులు.. బాధితురాలిని బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











