నానిని చూసి భయపడటం ఖాయం.. ఆయన నాకు నచ్చిన క్లాస్ టీచర్.. V గురించి సుధీర్ బాబు
విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న నటుడు సుధీర్ బాబు తాజాగా V చిత్రంతో ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా థియేటర్లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రంలోని తన పాత్ర గురించి, తన భవిష్యత్ ఆలోచనల గురించి ఫిల్మీబీట్ తెలుగుతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పంచుకొన్నారు. సుధీర్ బాబు చెప్పిన విషయాలు ఏమిటంటే..

క్యారెక్టర్లకు బలమైన కథా నేపథ్యం
సాధారణంగా మల్టీస్టారర్ మూవీ అంటే హీరోయిజం నేపథ్యంగా తెరకెక్కుతుంటాయి. V మూవీ విషయానికి వస్తే హీరోయిజం కాకుండా, సినిమాలోని పాత్రలే డామినేట్ చేస్తాయి. ఈ సినిమాలో క్యారెక్టర్లకు బలమైన కథా నేపథ్యం ఉంటుంది. దాంతో ఈ సినిమాలో నటులు కాకుండా క్యారెక్టర్లే కనిపిస్తాయి. ఈ చిత్రంలో హీరో నేనే. నాని విలన్ పాత్రలో కనిపిస్తారు. అయితే ఆయన నటన మరోస్థాయిలో ఉంటుంది అని సుధీర్ బాబు అన్నారు.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో
V మూవీలో నాది పోలీస్ ఆఫీసర్ పాత్ర. ఆ పాత్ర చాలా అగ్రెసివ్ మోడ్‌లో కనిపిస్తుంది. కానీ ఆ పాత్ర యాటిట్యూడ్‌కు తగినట్టుగా జస్టిఫికేషన్, లాజిక్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత థ్రిల్ ఫీల్ అవ్వడం ఖాయం. బాలీవుడ్ మూవీ స్థాయిలో ఈ ట్రైలర్ ఉందనే మాట వినిపించింది. ఈ ట్రైలర్‌ను ఓటీటీ కోసం స్పెషల్‌గా కట్ చేయలేదు. ఏప్రిల్ సినిమా రిలీజ్ అనుకొన్నప్పుడు ట్రైలర్‌ను రెడీ చేశాం. సినిమా వాయిదా పడటంతో ఇప్పుడు రిలీజ్ చేశాం అని సుధీర్ బాబు తెలిపారు.

నానిని ఇలా కూడా చూడొచ్చా
V మూవీలో నాని ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. నానిని ఇలా కూడా చూడొచ్చా అనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్నిసార్లు నానిని చూసి భయపడటం ఖాయం. అలాంటి నటనను తెరపైన మీరు చూస్తారు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమాను నేను పూర్తిగా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది అని సుధీర్ బాబు చెప్పారు.

ఇంద్రగంటి నచ్చిన క్లాస్ టీచర్ మాదిరిగా
ఇంద్రగంటి మోహన్ కృష్ణతో పనిచేయడమంటే మనకు నచ్చిన క్లాస్ టీచర్‌తో ఉన్నట్టు ఉంటుంది. కానీ V మూవీతో కొత్త సబ్జెక్ట్ చెప్పిన టీచర్ అనిపించారు. ఈ సినిమా కోసం కష్టపడిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే స్క్రిప్ట్ రీడింగ్ నుంచి అనేక విషయాలను పక్కా ప్లాన్ చేస్తారు. పాత్రకు తగినట్టుగా యాక్టర్లను రెడీ చేయడం ద్వారా ఇంద్రగంటి నటులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకొంటారు అని సుధీర్ బాబు అన్నారు.
Recommended Video

విలన్ పాత్రల తీరు వేరుగా
నేను భాగీ చిత్రంతో బాలీవుడ్‌లో ప్రవేశించాను. నేను పోషించిన పాత్రకు మంచి ఆదరణ దక్కింది. అయితే నాని పోషించిన పాత్ర అలాంటిది కాదు. ఎందుకంటే ఇది డిఫరెంట్ జోనర్‌లో ఉండే విలన్ పాత్ర. ఒకవేళ చిత్రంలో నాకు ఈ రెండు పాత్రల్లో ఏది ఇష్టమంటే పోలీస్ ఆఫీసర్ పాత్ర అని ఫిక్సవుతాను అని సుధీర్ బాబు అన్నారు.


Click it and Unblock the Notifications











