అమ్మ బంగారం తాకట్టు పెట్టి.. సినిమా కష్టాలను వెల్లడించిన ఓజీ డైరెక్టర్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "ఓజీ" సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ దాహాన్ని తీర్చింది ఓజీ. ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. రికార్డు స్థాయి కలెక్షన్స్ తో అదరగొడుతుంది. ఈ మధ్యకాలంలో ఓజీ సినిమాకు వచ్చినంత హైప్ దేనికి రాలేదు. ఇందుకు కారణం డైరెక్టర్ సుజీత్.(Sujeeth).ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం ఫ్యాన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చింది. గ్యాంగ్ స్టర్ లుక్స్ లో స్టైలిష్ గా కనిపించాడు పవన్. ఇలా ఈ సక్సెస్ తో దర్శకుడు సుజీత్ మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. సాహో తర్వాత, ఓజీతో బ్లాక్‌బస్టర్ కొట్టి మళ్లీ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. అయితే.. డైరెక్టర్ సుజీత్ ఈ స్థాయికి రావడానికి చేసిన పోరాటం, ఎదుర్కొన్న కష్టాలు సాధారణం కావు. ముఖ్యంగా ఆయన తల్లి చేసిన త్యాగం నేడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
డైరెక్టర్ సుజీత్ అనంతపురం అబ్బాయి. 1990 అక్టోబర్ 26న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే తెలివైన కుర్రాడు. అందరితో కలుపుగొలుగా ఉండేవాడు. అయితే.. సినిమాలపై ఆసక్తి ఉండటంతో చెన్నైలోని ఎల్.వి.ప్రసాద్ ఫిలిం & టీవీ అకాడమీలో డిగ్రీ పూర్తిచేశాడు. ఆ తరువాత షార్ట్ ఫిలిమ్స్ తీయాలని భావించారు. అందుకు ఓ మంచి కెమెరా కావాలి. ఆ సమయంలో సోనీ కెమెరా ధర రూ. 44 వేల రూపాయలు. డబ్బులు లేని పరిస్థితి. సుజీత్ పరిస్థితి అర్థం చేసుకున్న ఆయన తల్లి తన బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిందట. అయితే.. షోరూమ్‌కి వెళ్లేసరికి కెమెరా ధర రూ. 50 వేలకు పెరిగింది. మిగతా డబ్బుల కోసం వాళ్ల అమ్మ అప్పు చేసి కెమెరా కొని ఇచ్చింది. ఈ కెమెరానే తర్వాత సుజీత్ కెరీర్‌ను మార్చేసింది. తన తల్లి చేసిన ఈ త్యాగం వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని సుజీత్ గుర్తు చేసుకున్నారు.

షార్ట్ ఫిలిమ్స్‌తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు సుజీత్. ఆ సమయంలో తన ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ వద్దకు వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసే అవకాశం అడిగాడు. కానీ పూరి ఆయన ప్రతిభ చూసి "నువ్వు అసిస్టెంట్‌గా ఎందుకు పని చేయాలి? డైరెక్టర్‌గా సినిమా తీయొచ్చు" అని ప్రోత్సహించారు. ఆ తర్వాత కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసినప్పటికీ, అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలోనే యూవీ క్రియేషన్స్ కొత్త టాలెంట్ కోసం వెతుకుతుండగా, సుజీత్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ వారికి నచ్చాయి. అలా "రన్ రాజా రన్" సినిమా డైరెక్టర్ చేసే అవకాశాన్ని కొట్టేశాడు. ఈ మూవీ కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. ఏకంగా రూ. 20 కోట్లు వసూలు చేసింది.
ఈ సక్సెస్ తో ప్రభాస్ అవకాశాన్ని ఇచ్చాడు. బాహుబలి తర్వాత "సాహో" బాధ్యతలు సుజీత్‌కి ఇచ్చాడు. ఆ సినిమా మిక్స్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, సుజీత్ స్టైలిష్ మేకింగ్‌ను అందరూ గుర్తించారు. చివరికి ఆయన చేతుల్లోకి వచ్చిన ఓజీ బ్లాక్‌బస్టర్ అయ్యి, మళ్లీ టాప్ రేంజ్‌లోకి తీసుకెళ్లింది. సుజీత్ విజయాల వెనుక తన తల్లి త్యాగమే ప్రధాన కారణమని చెబుతారు. బంగారం తాకట్టు పెట్టి కొన్న కెమెరా లేకుంటే ఈరోజు ఓజీ లాంటి భారీ ప్రాజెక్ట్ ఆయన చేతుల్లోకి వచ్చేది కాదు. మొత్తానికి, తల్లి త్యాగం- కొడుకు పట్టుదల కలిసి.. నేడు సుజీత్‌ను టాలీవుడ్ అగ్ర దర్శకుల సరసన నిలిపాయి.


Click it and Unblock the Notifications











