ఓ వ్యక్తిని చంపి.. కుంభమేళాలో స్నానాలా.. హీరో ప్రియురాలిపై దారుణంగా ట్రోలింగ్
ఛాలెంజింగ్ స్టార్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే దర్శన్‌ను హత్య కేసులో అరెస్ట్ చేయడం గతేడాది కన్నడ సీమతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. తన ప్రియురాలిని వేధిస్తోన్న రేణుకా స్వామి అనే తన వీరాభిమానిని అనుచరులతో కలిసి అత్యంత కిరాతకంగా హతమార్చాడు దర్శన్. దీనితో పాటు మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించడం , కేసు నుంచి తప్పించుకోవడానికి చేసిన యత్నాలు క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించాయి. తాజాగా దర్శన్ , అతని ప్రియురాలు మరోసారి వార్తల్లో నిలిచారు.
అసిస్టెంట్ కెమెరామెన్ స్థాయి నుంచి కన్నడ టాప్ హీరో స్థాయికి ఎదిగారు దర్శన్. 2003లో విజయలక్ష్మీ అనే మహిళను ఆయన పెళ్లాడగా.. వీరికో బాబు ఉన్నాడు. దర్శన్ తీరు తొలి నుంచి వివాదాస్పదమే.. నటి నిఖితతో గతంలో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే దర్శన్ తనను వేధిస్తున్నారంటూ ఆయన భార్య విజయలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు హీరోను అరెస్ట్ చేసి 14 రోజులు జైలుకు పంపారు పోలీసులు.

నటిగా, ఫ్యాషన్ డిజైనర్‌గా పేరున్న పవిత్ర గౌడ అనే కు గతంలోనే పెళ్లయి, కుమార్తె కూడా ఉంది. అయితే మనస్పర్ధల కారణంగా ఆమె భర్త నుంచి విడిపోగా.. దర్శన్‌కు దగ్గరై ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అతనితో దిగిన ఫోటోలను పవిత్ర గౌడ తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఈ క్రమంలో రేణుకా స్వామి అనే దర్శన్ అభిమాని ఇది తట్టుకోలేకపోయాడు. పవిత్ర తన అభిమాన హీరో జీవితం నాశనం చేస్తోందని బహిరంగంగా కామెంట్స్ చేసేవాడు.
అక్కడితో ఆగకుండా పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు పంపడం .. వ్యవహారం దర్శన్ వరకు వెళ్లడంతో రేణుకా స్వామిని హత్య చేయాలని పథకం రెడీ అయ్యింది. చిత్రదుర్గలో రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరు పట్టణగెరెలో ఉన్న షెడ్‌లో బంధించి కరెంట్ షాకిచ్చి, చిత్రహింసలు పెట్టారు. రేణుకా స్వామిని చిత్రవధ చేస్తున్న తతంగాన్ని పవిత్ర గౌడ కళ్లారా చూసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. శరీరంపై గాయాలు, మర్మావయవాలు పూర్తిగా దెబ్బతినడం, ఒక చెవి కూడా కనిపించకపోవడాన్ని బట్టి రేణుకా స్వామిని దర్శన్ అతని అనుచరులు ఎంతగా హింసించారో అర్ధం చేసుకోవచ్చు.
చికిత్స నేపథ్యంలో దర్శన్‌కు కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో ఆయన దాదాపు నాలుగు నెలల తర్వాత బయటికి వచ్చారు. ఇంత వివాదానికి మూల కారణంగా దర్శన్ అభిమానుల చేత విమర్శలు ఎదుర్కొంటున్న పవిత్ర గౌడ.. తాజాగా ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాను దర్శించి అక్కడ పుణ్యస్నానం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేయగా.. నెటిజన్లు, దర్శన్ అభిమానులు మండిపడుతున్నారు. మనిషిని చంపేసిన నువ్వు గంగలో మునిగితే పాపం పోతుందా అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











