కాంతార బాయ్‌కాట్‌పై పవన్ కల్యాణ్ స్పందన, రిషబ్ మూవీకి లైన్ క్లియర్.. కన్నడలో తెలుగుపై వివక్షను పట్టించుకోవద్దు
కర్ణాటకలో తెలుగు సినిమాలపై స్థానికులు చూపిస్తున్న వివక్షపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా, స్నేహపూర్వకంగా స్పందించింది. స్థానికులు తెలుగు సినిమాల ప్రదర్శనలను అడ్డుకొన్నప్పటికీ.. తెలుగు ప్రజలు శాంతంగా ఉండాలి. విద్వేషాలు రెచ్చగొట్టి కన్నడ సినిమా కాంతారను అడ్డుకోవద్దు అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు సందేశం ఇచ్చారు. అయితే కాంతార సినిమాకు ఆటంకం కలిగించ వద్దు అని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు ఇచ్చిన సందేశం ఏమిటంటే?
కర్ణాటకలో స్థానికంగా కొన్ని సంస్థల నేతలు తెలుగు సినిమాల ప్రదర్శనలు నిలిపివేస్తూ ఆటంకం కలిగిస్తున్నారు. తెలుగు సినిమాల టికెట్ రేట్లు పెంచడంలో అక్కడి ప్రభుత్వం సహకారం అందించడం లేదు. తెలుగు సినిమా పోస్టర్లు, బ్యానర్లను బెదిరింపులకు పాల్పడి తొలగిస్తున్నారు. ఈ విషయంలో కన్నడ పరిశ్రమ నుంచి సరైన స్పందన రావడం లేదు అనే అభిప్రాయం తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వ్యక్తమైంది.

గతంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన RRR సినిమా విషయంలో కూడా వివక్ష చూపించారు. అలాగే గేమ్ ఛేంజర్, పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను అడ్డుకొనేందుకు కొందరు ప్రయత్నించిన పరిణామాలను ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తెలుగు సినిమాల టికెట్ రేట్ల పెంపు విషయంలో కొందరు ఆ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాంతారా ఛాప్టర్ 1 సినిమాతోపాటు కన్నడ చిత్రాలకు టికెట్ ధర పెంపుపై నిర్ణయం తీసుకొనే విషయంలో పునరాలోచన చేయాలని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంను కోరారు.
కళ అనేది మనసుల్నీ హత్తుకొని మనుషల్ని కలిపేది. అంతేగానీ భాష, ప్రాంతం పేరుతో విడదీసి మనుషుల్నీ దూరం చేసేది కాదు. సినిమా అనేది భిన్న కళల సమాహారం. పరభాష చిత్రం అనే పేరుత ఏపీలో వేరుగా చూడాల్సిన అవసరం లేదనే దృక్పథాన్ని కాంతారా చాప్టర్ 1 సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం కనబరుస్తున్నది. రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమాకు అన్ని సినిమాల మాదిరిగానే టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ సానుకూలంగా నిర్ణయం తీసుకొన్నాం అని అధికారులకు సీఎం, డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
కర్ణాటకలో తెలుగు సినిమాలకు ఆటంకం కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి సినిమాలకు ఇక్కడ టికెట్ ధరలు పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అక్కడి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇబ్బంది పెట్టడం సరికాదు. పెద్ద మనసుతో ముందుకు వెళ్లాలి అని సినిమాటోగ్రఫి, హోంశాఖ అధికారులకు స్పష్టం చేశారు. టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కాంతార చాప్టర్ 1 సినిమాను బాయ్‌కాట్ చేయాలని వచ్చిన డిమాండ్, నెలకొన్న వివాదంపై సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్, సంబంధిత అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించారు. కర్ణాటకలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం అందించడం ఆపోద్దు. కళ అనేది మనసుల్ని కలపాలి... విడదీయకూడదు అనేది వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుందాం. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలి. కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ గారి కాలం నుంచి ఇప్పటి కిచ్చా సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకూ అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సోదరభావంతో ఉన్నాము. మన సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు ప్రభుత్వపరంగా మనమూ మాట్లాడదాము. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళతాను. కర్ణాటకలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంతారా ఛాప్టర్ 1 కి ఆటంకాలు కల్పించవద్దు అని పవన్ కల్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











