»   » అక్కినేని చివరి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన వివరాలు మరోసారి!

అక్కినేని చివరి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన వివరాలు మరోసారి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెండితెరపై తన నటనతో దశాబ్దాలపాటు తెలుగువారిని అలరించిన 'నట సామ్రాట్‌'.. 'దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత' అక్కినేని నాగేశ్వరరావు పరమపదించారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆయన వూపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే వైద్యులు ఎమర్జెన్సీకి తరలించి ఆక్సిజన్‌ పెట్టారు. తరువాత పదినిమిషాలకే ఆసుపత్రికి వచ్చిన డా.సోమరాజు వైద్యుల బృందంతో కలసి పరిశీలించారు. అప్పటికే శ్వాస ఆగిపోవటంతో ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులకు తెలిపారు.

కాగా....కొన్ని నెలల క్రితం తనకు క్యాన్సర్ వచ్చిన విషయం తెలియగానే అక్కినేని నాగేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తనకు వచ్చిన వ్యాధిపై అపోహలు తొలగించడంతో పాటు....తన గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. మీడియా ముఖంగా తన జీవితం గురించి, తన సినిమా లైఫ్ గురించి అక్కినేని మాట్లాడిన చివరి సమావేశం అదే. ఈ సందర్భంగా అక్కినేని ఏయే విషయాలు చెప్పుకొచ్చారో మరోసారి ఓ సారి చూద్దాం. అదే విధంగా అక్కినేనికి సంబంధించిన అరుదైన ఫోటోలపై కూడా ఓ లుక్కేయండి.

స్లైడ్ షోలో వివరాలు....

క్యాన్సర్ వచ్చిందని ధైర్యంగా..

క్యాన్సర్ వచ్చిందని ధైర్యంగా..


జబ్బు చేసిందని చాలామంది బయటకు చెప్పుకోరు. కానీ, అపోహలకూ, తావివ్వకుండా, నేను ఈ విషయాన్ని నలుగురికీ చెప్పాలనుకున్నా. నా మీద ప్రేమ, అక్కరతోనైనా ఎవరెవరో ఫోన్లు చేసి డొంకతిరుగుడుగా విషయం అడగడం, దానికి తప్పించుకు తిరుగుతూ నేనేదో జవాబివ్వడం నాకిష్టం లేకపోయింది. అందుకే, నేనే ఈ విషయాన్ని ధైర్యంగా ప్రకటిస్తున్నాను'' అని ఆయన చెప్పుకొచ్చారు.

కెమెరా ముందు మాత్రమే..జీవితంలో కాదు

కెమెరా ముందు మాత్రమే..జీవితంలో కాదు


''జీవితంలో మనందరం నటిస్తాం. కానీ, కెమేరా ముందే తప్ప, జీవితంలో నాటకమాడే ప్రవృత్తి నాకు లేదు. అందుకే, ఈ విషయం ఇప్పటికే కొందరు డాక్టర్ల ద్వారా, ఇతరుల ద్వారా తెలిసినవాళ్ళు నా మీద ప్రేమతో నన్ను నేరుగా అడగడానికీ, నేను వాళ్ళకు చెప్పడానికీ ఇబ్బంది పడుతున్నాం. ఏవేవో అబద్ధాలు చెప్పే ఇబ్బంది వాళ్ళకూ, నాకూ లేకుండా ఉండాలనే ఇప్పుడీ విషయం బయటపెడుతున్నా'' అన్నారు

నిజానికి, అబద్దానికీ..

నిజానికి, అబద్దానికీ..


అబద్ధం మాట్లాడడానికి తెలివితేటలు కావాలి. కానీ, నిజం మాట్లాడడానికి ధైర్యం కావాలి. నాకూ, నా పిల్లలకూ ధైర్యం ఉంది. ...అందుకే, మా కుటుంబమంతా కలసి కూర్చొని, నిర్ణయించుకొని మరీ ఈ సంగతి అందరితో చెప్పాలనుకున్నాం. ఎవరూ చెప్పుకోని అనారోగ్యం గురించి కూడా నేను చెప్పేస్తున్నాను'' అని అక్కినేని వ్యాఖ్యానించారు.

అప్పట్లో ఆత్మహత్య ఆలోచన

అప్పట్లో ఆత్మహత్య ఆలోచన


సినిమా కెరీర్‌ తొలి రోజుల్లో, పెళ్ళి కాని వయసులో 1948లో తనపై వచ్చిన అపవాదులతో బాధపడి తాను రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సంగతులను ఆయన చెప్పారు. ''అయితే, చనిపోయి అందరి అపవాదులనూ నిజం చేసే కన్నా, బతికి సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను'' అని అక్కినేని తెలిపారు.

బతికి సాధించు...చనిపోయి జీవించు

బతికి సాధించు...చనిపోయి జీవించు


బ్రతికి జీవితాన్ని సాధించు... చనిపోయి కలకాలం జీవించు..'' అంటూ అప్పట్లో తాను తొలిసారిగా రాసిన 'అ ఆలు' లోని వ్యాఖ్యలను అక్కినేని గుర్తు చేసారు.

ఇంతకాలం బ్రతకడమే అదృష్టం

ఇంతకాలం బ్రతకడమే అదృష్టం


క్యాన్సర్ జబ్బుతో బతుకుతున్నవాళ్ళు చాలామందే ఉన్నారు. నాకు ఏమీ బాధలు లేవు. ఏ నొప్పీ లేదు. రెండు సార్లు గుండె జబ్బు వచ్చి, ఇంత కాలం నేను బతకడమే అదృష్టం. కాబట్టి, ఎక్కడున్నా మీ ఆశీస్సులిస్తే, అవే నాకు ఆరోగ్యం అందిస్తాయి. దూరంగా ఉండే మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా'' అన్నారు.

తొలి అవకాశం గురించి

తొలి అవకాశం గురించి


పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన 'ధర్మపత్ని' (1941) చిత్రం షూటింగ్‌ నిమిత్తం కొల్హాపూర్‌లోని శాలినీ సినీ స్టూడియోకు వెళ్ళి, తొలిసారిగా కెమేరా ముందు నటించిన 1940 నాటి నుంచి ఇప్పటికి 74 ఏళ్ళుగా సాగుతున్న తన సుదీర్ఘ నట ప్రస్థానాన్ని ఏయన్నార్‌ గుర్తు చేసుకున్నారు.

వారిని మరిచి పోలేదు

వారిని మరిచి పోలేదు


నాటకాలు వేసి తెనాలి నుంచి గుడివాడ వెళుతుండగా రైల్వేస్టేషన్‌లో తనను చూసి, 'శ్రీసీతారామ జననము' (1944) చిత్రంలో హీరోగా అవకాశమిచ్చిన దర్శక - నిర్మాత కీర్తిశేషులు ఘంటసాల బలరామయ్యను స్మరించుకున్నారు. 1944 మే 8న మద్రాసులోని నంబర్‌ 10 - ఆలివర్‌ రోడ్డు నివాసంలో కాలుపెట్టినప్పటి నుంచి వివిధ మనస్తత్త్వాలున్న పాత్రలు ధరించి, అభిమానుల్ని సంపాదించుకున్న తీరును తలుచుకున్నారు.

సినిమా తల్లి వల్లే...

సినిమా తల్లి వల్లే...


కుమారులు, కూతురు నాగ సుశీల నిర్మాతలైతే, కుమారుడితో పాటు మనుమలు నటులయ్యారనీ, మనుమలు, మనుమరాళ్ళు స్టూడియో నిర్వహణ చూసుకుంటున్నారనీ అంటూ, ''నేను, మా కుటుంబం సినిమాలకు అంకితమయ్యాం. మాకిన్ని పేరు ప్రతిష్ఠలు సినిమాతల్లి వల్లే వచ్చాయి అన్నారు.

ఇన్ని అవార్డులు వస్తాయనుకోలేదు

ఇన్ని అవార్డులు వస్తాయనుకోలేదు


కేంద్రం నుంచి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులూ వచ్చాయి. ఇవన్నీ వస్తాయని నేను ఊహించలేదు. 90 ఏళ్ళ జీవితంలో 74 ఏళ్ళుగా సినీ రంగంలో పని చేయడం, ఇప్పటికీ పనిచేస్తూ ఉండడం ఓ పెద్ద రికార్డు...తెలిసింది అన్నారు.

ఆరోగ్యం కాపాడుకోవడం రికార్డే

ఆరోగ్యం కాపాడుకోవడం రికార్డే


గతంలో రెండుసార్లు గుండె పోటు నుంచి గట్టెక్కి, అనుకున్న దాని కన్నా దీర్ఘకాలం ఆరోగ్యం కాపాడుకోవడం రికార్డులే అన్నారు.

అభిమానం, ఆశీర్వాద బలమే

అభిమానం, ఆశీర్వాద బలమే


1974లో హై కొలెస్ట్రాల్‌ వల్ల గుండె పోటు వచ్చింది. దాంతో, 1974 అక్టోబర్‌ 18న నా గుండెకు ఆపరేషన్‌ చేశారు. అప్పటికి ఆ ఆపరేషన్‌ కొత్త. ఆ ప్రక్రియ వచ్చి ఏడేళ్ళే అయింది. అయినా, ఆ పరేషన్‌ చేశారు. ఓ పధ్నాలుగేళ్ళు ఫరవాలేదన్నారు. ఆ తరువాత 1988లో మళ్ళీ హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. కానీ, డాక్టర్లు నా గుండె ఆపరేషన్‌కు చేయదగిన స్థితిలో లేదన్నారు. 'కావాలంటే ఆపరేట్‌ చేస్తాం. కానీ, ఆయన బతకకపోవచ్చు' అని చెప్పారు. మా పిల్లలు అధైర్యపడినా నేను ధైర్యంగా ఉన్నాను. అప్పటి నుంచి మందులేమీ లేవు, డయలేటర్స్‌ వాడుతున్నా. అది జరిగి పాతికేళ్ళు అయింది. ఇదంతా నా మనోబలం, మీ లాంటి ప్రేక్షకుల అభిమానం, ఆశీర్వాదబలంతో సాధ్యమైంది అన్నారు.

క్యాన్సర్ గురించి

క్యాన్సర్ గురించి


నా జీవితంలో ఇప్పుడిది ఓ కొత్త మలుపు... ఈ ఘట్టం ఏ రికార్డు సృష్టిస్తుందో నాకు తెలియదు. క్యాన్సర్‌ వస్తే చాలు, ఆ మనిషి చనిపోతాడన్నట్లు సినిమాల్లో మేము ఎంతో నాటకీయంగా మార్చి చూపిస్తుంటాం. అలాంటి చాలా సినిమాల్లో నేనూ నటించాను. ఆ అభిప్రాయం ప్రజలకు కలిగించాను. కానీ, ఇప్పుడు క్యాన్సర్‌ వస్తే బతకరన్న పాత మాట మారిపోయింది. ఎందరో క్యాన్సర్‌ను జయించారు అన్నారు.

సెంచరీ గురించి..

సెంచరీ గురించి..


కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వెంకట రాఘవాపురంలో 1924లో వెంకట రత్నం, పున్నమ్మ దంపతులకు తొమ్మిదో సంతానంగా జన్మించిన ఏయన్నార్‌ తన కుటుంబంలోని వాళ్ళది సామాన్యంగా దీర్ఘాయుష్షు అంటూ చెప్పుకొచ్చారు. ''మా కుటుంబంలో అందరి కన్నా ఎక్కువ కాలం 96 ఏళ్ళు బతికింది మా అమ్మ. కాబట్టి, 96 ఏళ్ళు బతుకుతానని నాకెప్పుడూ గట్టి నమ్మకం. అది నా టార్గెట్‌'' అన్నారు. ''ప్రజలందరూ అభిమానిస్తే, ఆశీర్వదిస్తే, సహకరిస్తే 96 ఏళ్ళు దాటి, సెంచరీ కొడతా అన్నారు.

ఊపిరి ఉన్నంత వరకు..

ఊపిరి ఉన్నంత వరకు..


ఆఖరు ఊపిరి ఉన్నంత వరకు నటిస్తాను. అయితే, ఏ పాత్ర పడితే ఆ పాత్ర పోషించను. చిన్న పాత్రలైనా, నా వయస్సుకు తగిన మంచి పాత్రలైతే చేస్తాను అన్నారు.


Photos Courtesy from AKKINENI ABHINAYA VEDAM BOOK

English summary
Akkineni Nageswara Rao last press meet details. The 90 year old actor himself announced last year October about his cancer and expressed confidence that it will not spread fast during old age. But fate got something else in store for the Akkineni legend and it has finally spread its claws and spit its venom to take him away from this world.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X