For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వేయి స్తంభాల గుడిలో అనుష్క, రానా హంగామా(ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర స్వామి వేయిస్తంభాల దేవాలయంలో గురువారం రుద్రమదేవి చిత్రం యూనిట్‌ సందడి చేసింది. సినీ నటుడు రాణా, నటి అనుష్క అభిమానులతో ఆలయం కిటకిటలాడింది. రాణా, అనుష్కను చూడటానికి అభిమానులు పోటీపడ్డారు. వీరిని అదుపుచేయడానికి పోలీసులకు అవస్థలు తప్పలేదు.

  తెలుగు తెరపైకి కాకతీయ వీరనారి రుద్రమ చరిత్ర రాబోతోంది. 'రుద్రమదేవి' పేరుతో రూపొందే ఈ చిత్రాన్ని గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రధాన పాత్రలో అనుష్క నటిస్తుంది. వీరభద్రుడి పాత్రను రానా పోషిస్తున్నారు. కాకతీయుల చారిత్రాత్మక స్థలమైన ఓరుగల్లులో గురువారం లాంఛనంగా ముహూర్తపు కార్యక్రమాల్ని నిర్వహించారు.

  హన్మకొండలోని వేయిస్తంభాల గుడిలో స్వయంభూ శివలింగంపై క్లాప్‌ కొట్టి ముహూర్తపు షాట్‌ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: అజయ్‌విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, విఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్స్: కమల్‌కణ్ణన్, కాస్ట్యూమ్స్ డిజైనర్: నీతా లుల్లా.

  కాకతీయుల చరిత్ర ఆధారంగా రూపొందుతున్న రుద్రమదేవి చిత్రంలో రుద్రమదేవిగా ప్రధాన పాత్ర పోషించనున్న కథానాయిక అనుష్క, చాళుక్య వీరభద్రుడిగా నటించనున్న కథా నాయకుడు రాణా, చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్న గుణశేఖర్‌ తమ బృందంతో కలిసి వేయిస్తంభాల గుడికి చేరుకున్నారు.

  ముందుగా బస్సులో గుణశేఖర్‌ ఆలయానికి వచ్చారు. తరువాత స్కార్పియో వాహనాలలో రాణా, అనుష్క ఒకరి తరువాత ఒకరు వచ్చారు.

  సరస్వతీదేవి పుట్టినరోజును పురస్కరించుకుని వసంత పంచమి సందర్భంగా సరిగ్గా మధ్యాహ్నం 12.24 గంటల సమయంలో చిత్ర దర్శకుడు గుణశేఖర్‌ కథానాయకుడు రాణా, కథా నాయిక అనుష్కతో కలిసి రుద్రేశ్వరస్వామి సన్నిధిలో రుద్రమదేవి చిత్ర ప్రారంభ పూజలు నిర్వహించారు.

  ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ లఘున్యాసపూర్వక పంచామృత అభిషేకం జరిపారు. రుద్రమదేవి చిత్రం విజయవంతం కావాలని, లక్ష్మిదేవి కటాక్షం లభించాలని మారేడు దళాలతో పూజలు చేశారు. కథానాయకి అనుష్క స్వయంగా రుద్రేశ్వరుడికి హారతి ఇచ్చారు.

  అనంతరం ఆలయ నాట్య మండపంలో సంప్రదాయం ప్రకారం దర్శకుడు గుణశేఖర్‌, కథానాయిక అనుష్క, కథానాయకుడు రాణాకు ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు.

  రుద్రమదేవి చిత్రం ప్రారంభ పూజలకు నటి అనుష్క, నటుడు రాణా, దర్శకుడు గుణశేఖర్‌ వచ్చినట్లు తెలియగానే అభిమానులు పెద్దసంఖ్యలో వేయిస్తంభాల గుడికి తరలివచ్చారు.

  పూజలు చేసిన సమయంలో అనుష్క, రాణాను చూడటానికి ఆలయం లోపలకు చొచ్చుకొచ్చారు. పూజలు చేశాక ఆలయ నాట్య మండపంలోకి వచ్చిన తారల బృందాన్ని తమ సెల్‌ కెమెరాల్లో బంధించడానికి తీవ్రస్థాయిలో పోటీపడ్డారు.

  రాణాతో కరచాలనం కోసం ప్రయత్నించారు. మీడియాతో రాణా మాట్లాడుతున్నపుడు కేరింతలు కొట్టారు. చివరకు వెళ్లిపోతున్న సమయంలో రాణా తన అభిమానులతో కరచాలనం చేశారు.

  చిత్ర బృందం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అభిమానులు ఆలయంలోకి తోసుకునిరావడంతో కొంత తోపులాట జరిగింది.

  రుద్రమదేవిగా నటిస్తుండటం తనకు గర్వంగా ఉందని, అరుంధతి చిత్రం కంటే ఎక్కువగా రుద్రమదేవి చిత్రం ద్వారా తనకు మంచిపేరు వస్తుందని అనుష్క పేర్కొన్న సమయంలో అభిమానుల చప్పట్లు, కేరింతలతో ఆలయం దద్దరిల్లింది.

  దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ రుద్రేశ్వరాలయంలో నిర్మించిన పది సినిమాల్లో ఎనిమిది విజయవంతంగా నడిచాయని, వీటిలో వర్షం సినిమా ఒకటని అన్నారు. వర్షం సినిమా తెలుగు, తమిళం భాషల్లో వంద రోజులు ఆడటం గొప్ప విషయమని చెపుతూ రుద్రమదేవి చిత్రం కూడా విజయవంతం కాగలదని ఆశిస్తున్నట్లు తెలిపారు.

  వేయిస్తంభాల దేవాలయంలో చివరగా ఎనిమిదేళ్ల కిందట వర్షం సినిమా షూటింగ్‌ జరిగింది. తరువాత మళ్లీ ఇన్నాళ్లకు రుద్రమదేవి సినిమా చిత్రీకరణ ప్రారంభ పూజలు ఇక్కడ జరగడం విశేషం.

  అభిమానుల తాకిడి పెరగడంతో కథానాయిక అనుష్క, కథానాయకుడు రాణా ముందుగానే స్కార్పియో వాహనంలో వేయిస్తంభాల గుడి నుంచి వెళ్లిపోయారు.

  తరువాత దర్శకుడు గుణశేఖర్‌ తమ చిత్ర బృందంతో కలిసి బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరారు. రుద్రమదేవి చిత్ర ప్రారంభ పూజలకు ముందు ఆలయ అర్చకులు సుప్రభాత సేవ, మూలగణపతికి పంచామృత అభిషేకం నిర్వహించారు. సరస్వతీదేవి పేర దక్షణమూర్తి మహాశివుడికి ప్రత్యేక రుద్రాభిషేకాలు చేసి విద్యార్థుల పుస్తకాలకు పూజలు జరిపారు.

  రానా మాట్లాడుతూ -‘‘పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలంటే చాలా ఇష్టం. ఈ చిత్రంలో చాళుక్య వీరభద్రునిగా నటించడం చాలా ఆనందంగా ఉంది. నటునిగా ఇది నాకు ఓ ఛాలెంజ్'' అన్నారు.

  గుణశేఖర్‌ మాట్లాడుతూ ''కాకతీయ సామ్రాజ్యంపై ప్రజల్లో ఎన్నో గొప్ప ఊహలున్నాయి. ఆ ఊహలకు తగ్గకుండా సినిమా ఉంటుంది. దాదాపుగా పదేళ్లనుంచి ఈ సినిమా కథ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అన్నీ కుదిరాయి. ఇళయరాజా, తోట తరణి, శ్రీకర్‌ప్రసాద్‌, అజయ్‌ విన్సెంట్‌, కమల్‌కణ్ణన్‌ లాంటి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయడం సంతోషంగా ఉంది. ఏప్రిల్‌ నుంచి ఏకబిగిన చిత్రీకరణ చేస్తాం. మన సినీ చరిత్రలో తొలి స్టీరియోస్కోపిక్‌ త్రీడీ చిత్రమిదే అవుతుంద''న్నారు.

  English summary
  Anushka, Rana starrer Rudrama Devi was launched earlier Feb 14 in Warangal. Gunasekhar is directing and producing the film. Anushka and Gunasekhar attended the opening ceremony and the first shot on the Shiva Lingam in the 1000 pillared temple in Warangal. Rana is playing the role of prince Chalukya Veerabhadra who marries Rudrama Devi. The film is said to be India's first 3D historical film and the shooting will begin soon. Anushka is going to play the role of Rani Rudrama Devi who was one of the most famous rulers of Kakatiya Dynasty. Ilayaraja is scoring the music and Ajayan Vincent is the cinematographer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X