»   »  పవన్ పార్టీ కార్యాలయం నుంచి మీడియా ప్రకటన

పవన్ పార్టీ కార్యాలయం నుంచి మీడియా ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : 'జనసేన' పేరుతో తను ప్రారంభించే పార్టీ సిద్ధాంతాలనీ, తన రాజకీయ ఆలోచనల్నీ పవన్ తన అభిమానుల సమక్షంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జనసేన పార్టీ కార్యాలయం నుంచి తొలి మీడియా ప్రకటన వచ్చింది. అందులో ఏముందీ అంటే...

  మీడియా వారికి మనవి

  "జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అథికారికంగా మాట్లాడతారు. వేరెవరూ జనసేన పార్టీకి అథికార ప్రతినిధులు లేరు. మీడియా సంస్ధలు విషయ సేకరణలోనూ, చర్చల్లోనూ ఇతరులు ఎవరైనా పాలు పంచుకున్నచో అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. వాటితో జనసేన పార్టీకి ఎలాంటి సంభంధం లేదని తెలియచేస్తున్నాము. కావున ఈ విషయాన్ని మీడియా సంస్ధలన్నీ దయచేసి గుర్తించవలిసిందిగా మనవి."

  ఇక రెండు రోజుల క్రితం పవన్‌ కల్యాణ్‌ తన కొత్త రాజకీయ పార్టీ పేరును 'జన సేన'గా అధికారికంగా ప్రకటించారు. పలు అంశాలపై తన హృదయాన్ని ఆవిష్కరించారు. 'కాంగ్రెస్‌ కో హఠావ్‌...దేశ్‌ కో బచావ్‌' అని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై విరుచుకుపడ్డ పవన్‌... కాంగ్రెస్‌పై, ఆ పార్టీ అధిష్ఠాన పెద్దలపై నిప్పులు చెరిగారు. అయిదేళ్ల పాటు ఏం చేయకుండా... ఆఖర్లో 23 నిమిషాల్లోనే ప్రత్యక్ష ప్రసారాలను ఆపి మరీ లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలిపారని, ఏ ప్రాంతానికి సంతృప్తి కలిగించలేదని విమర్శించారు. తెలంగాణ ఇవ్వదలుచుకుంటే 2009 లోనే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు రాష్ట్ర ప్రజలను అందుకు సిద్ధం చేసివుంటే తెలంగాణలో ఇంత మంది తల్లులకు గుండెకోత ఉండేది కాదన్నారు.

  తెలంగాణకూ న్యాయం చేయలేదని, హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అన్నారని, ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలను లేకుండా చేశారని ప్రస్తావించారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి చేసిన పీవీ నర్సింహరావు చనిపోతే... ఆయన మృతదేహాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం లోపలికి రానివ్వలేదని, హైదరాబాద్‌కు పంపేస్తే ఇక్కడా కాలీ కాలకుండా సంస్కారం చేశారని చెప్పారు. పీవీ అంటే అధిష్ఠానానికి అంత కోపమన్నారు. ప్రతీ తెలుగువాడూ పీవీ నరసింహారావులా అధిష్ఠానానికి కనిపించాడో ఏమో రాష్ట్రంపై ఇంతటి కోపం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు.

  First Press Release Form Pawan's Jana Sena

  కాంగ్రెస్‌ పార్టీకి ఢిల్లీలో ఒక పవిత్ర నాయకత్వం ఉంటుందని ఎద్దేవా చేసిన పవన్‌ కల్యాణ్‌... కేంద్ర మంత్రులు జైరాం రమేష్‌, సుశీల్‌కుమార్‌ షిండే, చిదంబరం, వీరప్ప మొయిలీ, అధిష్ఠానం పెద్దలు అహ్మద్‌ పటేల్‌, దిగ్విజయ్‌సింగ్‌లను పేరుపేరున ప్రస్తావిస్తూ విమర్శించారు. 'తెలుగు ప్రజలను మోసం చేశారు. గాయపడ్డాం. మా హృదయాలు రక్తమోడుతున్నాయి. మిమ్మల్ని నమ్మాం. వెన్నుపోటు పొడిచారు. జనం తరఫున, జనసేన తరఫున ఒకటే పిలుపునిస్తున్నా. కాంగ్రెస్‌ కో హటావ్‌...దేశ్‌ కో బచావ్‌' అని ఉద్ఘాటించారు. సభకు హాజరైన వారితో 'కాంగ్రెస్‌ కో హటావ్‌...దేశ్‌ కో బచావ్‌' అని రెండుసార్లు చెప్పించారు. కాంగ్రెస్‌ ఒక్క స్థానమూ గెలవదన్నారు. అది గెలవకుండా చేసేందుకు తాను పోరాడతానని ప్రకటించారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, అలాగని సీమాంధ్ర ప్రాంతపు ఆత్మగౌరవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటే వూరుకోబోనని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే సోనియాతో సహా ఎవర్నీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

  జాతి సమగ్రతను చెడగొట్టే వీరిని అంగీకరించ బోనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానా? చేయనా? అన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు. పార్టీ నిర్మాణం చేస్తానని...జంపింగ్స్‌ నేతలను, జోకర్స్‌ను తీసుకోబోనని స్పష్టం చేశారు. జనసేన సిద్ధాంతాలు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు. మతం కోసం జిహాద్‌ చేసి చనిపోయే వారున్నారని, కులంకోసం పోరాడి చనిపోయే వారున్నారని, దేశం కోసం చనిపోయే మొదటి పిచ్చివాడిని తానే అవుతానని ఆవేశపూరితంగా అన్నారు. దేశం కోసం, సమాజం కోసం ప్రాణాలర్పించటానికి సిద్ధంగా ఉన్నానని, సమగ్రత విషయంలో ఎవరైనా పిచ్చి వేషాలేస్తే ఎండగడతానని అన్నారు. ప్రజల్ని విడగొట్టి తుచ్ఛమైన రాజకీయాలు చేసే వారినెవరినైనా తాట ఒలుస్తానని హెచ్చరించారు. హైటెక్స్‌లోని నోవాటెల్‌ హోటల్‌లోని సమావేశ హాలులో వేలమంది అభిమానుల నడుమ ఆయన తన నూతన పార్టీ ఏర్పాటును ప్రకటించారు. కాంగ్రెస్‌తో తప్ప ఏ పార్టీతోనైనా చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించారు. దీనికి ప్రజలు సిద్ధంగా ఉండాలని, బంద్‌లు ఆగిపోవాలని, ప్రజలు బాగుండాలని చెప్పారు.

  చంద్రబాబు సహా అందరు నేతలతోనూ మాట్లాడతానని ప్రకటించారు. తమ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉన్న వారితోనే కలుస్తామన్నారు. రెండు గంటలపాటు ఉద్వేగంగా, ఆవేశపూరితంగా... మధ్యలో చతురోక్తులు విసురుతూ, భావోద్వేగానికి లోనవుతూ, వ్యక్తిగతంగా ఆయన చిన్నతనం నుంచి ఇటీవలి వరకు వివిధ సందర్భాల్లో ఎదురైన అనుభవాలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. రాజకీయాల్లోకి వస్తాననగానే... తనపై వివిధ రూపాల్లో విమర్శలు చేసిన వారందరినీ పేరుపేరునా పేర్కొంటూ వివరణ ఇచ్చినట్లుగానే ఘాటుగా, సూటిగా ప్రతివిమర్శలు గుప్పించారు.

  ప్రధానంగా రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే మాట్లాడారు. దేశ శ్రేయస్సును కాంక్షించే వారిని జనసేనలోకి ఆహ్వానించారు. కొద్ది రోజుల్లోనే అందరి వద్దకు వచ్చి కలుస్తానని తెలిపారు. పార్టీ ఏర్పాటు చేసినా... తక్షణమే ఎన్నికల్లో పోటీ చేసేదీ, లేనిదీ స్పష్టం చేయలేదు. 'పార్టీని నిర్మించాలి. ఎన్నికల్లో పోటీ చేస్తామో, లేదో చెప్పలేను. పోటీ చేస్తే ఇప్పుడా, రెండేళ్ల తరువాతా... అన్నది చెప్పలేను. ఇంకా పార్టీకి భవనమే లేదు. ఉన్న డబ్బులన్నీ పార్టీ కోసమే ఖర్చుపెట్టేశా. అటు ఇటు దూకే వారి కోసం పార్టీ పెట్టలేదు. అలాంటి జోకర్స్‌ అవసరం లేదు. వూరూరా తిరుగుతాను. అందరి దగ్గరికి వస్తాను. మాట్లాడతాను. చర్చిస్తాను' అని వివరించారు. చంద్రబాబు మంచి వ్యక్తని, అందర్నీ ఎలా విమర్శిస్తామని అన్నారు.

  English summary
  "This is to inform that Mr. Pawan Kalyan is the only authorised spokesman of the Jana Sena Party. All media organisations may kindly note that in media interactions and discussions no other person is authorised to represent the Jana Sena Party. If anyone openly taking stand in favour of our party, it is their individual opinion. Jana Sena Party is not responsible for what outsiders say on public forum. Pawan Kalyan is presently busy in party-building work."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more