For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గణేష్‌ పాత్రో తో అనుబంధం గురించి గొల్లపూడి మారుతీరావు

  By Srikanya
  |

  హైదరాబాద్ :చాలాకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న గణేష్ పాత్రో చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తొలుత నోటి కేన్సర్‌కు గురైన పాత్రో దాన్నుంచి బయటపడినా తర్వాత అది ఎముకలు, కాలేయానికి కూడా వ్యాపించడంతో కొన్ని రోజుల క్రితం స్థానిక నందనంలోని వెంకటేశ్వర ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నేపధ్యంలో ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గొల్లపూడి మారుతీ రావు ప్రముఖ తెలుగు దిన పత్రిక ఈనాడులో గుర్తు చేసుకున్నారు. అది యధాతథంగా మీకు అందిస్తున్నాం.

  https://www.facebook.com/TeluguFilmibeat

  సరిగ్గా 19 రోజుల కిందట గణేష్‌ పాత్రో నాకో ఎస్సెమ్మెస్‌ పంపాడు.

  ''డియర్‌ మారుతీ! (నన్ను 'ఒరేయ్‌' అని పిలిచే అతి తక్కువ మందిలో పాత్రో ఒకడు), నోటికి ఆపరేషన్‌ కోసం ఆసుపత్రిలో చేరాను. నువ్వు నా గురువువి. నువ్వెప్పుడూ గుంటూరు లంక పొగాకు చుట్ట కాల్చి ఆనందించడానికి వెనకాడలేదు. కాశ్మీరీ కిమామ్‌తో కలకత్తా పత్తాతో కట్టిన జర్దా కిళ్లీ సర్దాని కాదనలేదు. మంచీ చెడూ ఎప్పుడూ కలిసే వస్తాయి. చెడు అలవాటుని నువ్వు గుర్తించి దూరం చేసుకున్నప్పుడు దేవుడు నీకు వరమవుతాడు. చెడుని వదులుకోలేనినాడు నిన్ను తన దగ్గరికి తీసుకుంటాడు. ఈ విపర్యాయాన్ని నువ్వు నీ కొడుకులకు చెప్పు - పాత్రో''. ఇదీ అక్షరాలా ఆ సందేశం.

  నేను నిర్ఘాంతపోయాను. వెంటనే ఫోన్‌ చేశాను. మళ్లీ వెంటనే సమాధానం.

  ''ఓ నెలరోజులు మాట్లాడలేను. సారీ మారుతీ''.

  ఇక ఏం మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో తెలీదు. పాత్రో భార్య లక్ష్మి నాకు చిన్నపిల్లగా తెలుసు. అతని మామ - నటరాజు కె.వేంకటేశ్వరరావూ నేను ''ఒరేయ్‌'' అని పిలుచుకునేంత సన్నిహితులం. విలవిలలాడిపోయాను.

  మరో ఆరు రోజుల తర్వాత కె.బాలచందర్‌ గారు కన్నుమూశారు. బాలచందర్‌కి 'తెలుగు ముఖం' పాత్రో. సందేశం కోసం నన్ను పలకరించిన వారందరికీ చెప్పాను. బాలచందర్‌గారి అన్ని చిత్రాలకీ రాసిన గణేష్‌ పాత్రో చాలా గొప్ప విషయాలు చెప్పగలడనీ- అతనే రాయగలడనీ. అయితే ఆ రెండు పనులూ చేసే స్థితిలో లేడు పాత్రో. విషాదానికి కలం కదలకపోవడం, కన్నీరు కార్చడానికి కళ్లు కలిసిరాకపోవడం దురదృష్టం.

   Gollapudi Maruthi rao about Ganesh Patro

  ఈ పన్నెండు రోజులూ పాత్రో నా మనస్సులో కదులుతూనే ఉన్నాడు. ఉండబట్టలేక జనవరి రెండున ఒక మెసేజ్‌ పంపాను. 'కోలుకుంటున్నావా?' అని. అప్పటికి సమాధానాన్ని పంపే స్థితిలో లేడట పాత్రో. కేన్సర్‌ శరీరంలో చాలా భాగాలకి వ్యాపించింది. మాత్రలతో బాధనుంచి అతన్ని మభ్యపెడుతూ వచ్చారు.

  దాదాపు 54 సంవత్సరాల కిందట నన్ను పరిచయం చేసుకోడానికి - మా తమ్ముడి ద్వారా ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా స్టేషన్‌కి వచ్చేవాడు. అప్పుడు పోస్టల్‌ డిపార్టుమెంటులో ఉద్యోగం. అలా వచ్చిన వ్యక్తులు ఇద్దరు - గణేష్‌పాత్రో, కె.వివేకానంద మూర్తి. విశాఖలో రైలు దిగినప్పటినుంచి మళ్లీ రైలు ఎక్కేదాకా నాతోనే ఉండేవారు. వాక్యరచన, శిల్పం, ఉక్తి చమత్కృతి, సంభాషణ చాతుర్యం - అన్నీ ఇద్దరితో చర్చించేవాడిని. ఇద్దరూ జీవితమంతా గర్వంగా 'నా గురువు' అని చెప్పుకున్నారు. ఇద్దరూ నన్ను ఏకవచనతో పిలిచేంత సన్నిహితులయిపోయారు.

  ఆంధ్ర నాటకకళా పరిషత్తు, విజయవాడ పోటీలలో (1970 సెప్టెంబరు 8) నా నాటిక 'కళ్లు'కి దీటుగా గొప్ప రచన చేశాడు పాత్రో. పేరు 'పావలా'. ఆనాడు 'కళ్లు' ఉత్తమ రచన కాగా, మిగతా బహుమతులనన్నింటినీ మేమిద్దరం పంచుకున్నాం. 'పావలా' నాటికను మిశ్రో అద్భుతంగా ప్రదర్శించాడు.

  సినీమా రంగంలో ఎన్నో గొప్ప చిత్రాలకు బాలచందర్‌గారికి 'తెలుగు ముఖ'మయి నిలబడ్డాడు. కమల్‌హాసన్‌కి శ్రీశ్రీని అలవాటు చేశాడు. శ్రీశ్రీ కవితల్ని అలవోకగా చదువుతాడు కమల్‌. అతని 'మరో చరిత్ర', 'ఆకలి రాజ్యం' వంటి చిత్రాలు ఏ రచయితనయినా ఈర్ష్య పడేటట్టుచేసే గొప్ప చిత్రాలు. పాత్రో యింటినిండా నందుల పంట. సినీ నటుడిగా నేను నటించిన అన్ని గొప్ప పాత్రలనూ పాత్రోయే రాశాడు.

  'సంసారం ఒక చదరంగం', 'మనిషికో చరిత్ర', 'డబ్బు భలే జబ్బు', 'రామాయణంలో భాగవతం', 'పుణ్యస్త్రీ', 'పద్మావతీ కళ్యాణం' - యిలాగ. రచయితగా పాత్రో నా శిష్యుడు. నటుడిగా వెండితెర మీద పాత్రో నా వూపిరి. కావాలని, పిలిచి ఆయా సినిమాలకు పాత్రోయే రాయాలని నేను పట్టుబట్టిన సందర్భాలున్నాయి. నాటకీయత, విసురూ, మాటల్లో పదునూ, తనదయిన భావ దారుఢ్యం- యిన్నిటిని సాధించగల రచయిత పాత్రో. తణుకులో 'సీతారామయ్యగారి మనుమరాలు' చూస్తూ మొదటి ఫ్రేమ్‌ నుంచీ కంటతడిపెడుతూనే ఉన్నాను. అప్పుడు పాత్రో తణుకులోనే ఉన్నాడు. రూంకి పిలిచి మరీ కావలించుకున్నాను.

  ఓ భయంకరమైన ఆపరేషన్‌ కలిసిరాకపోగా, చాలా యిబ్బందులతో జీవించాడు పాత్రో. సంవత్సరం కింద ప్రపంచ తెలుగు మహాసభలకు కౌలాలంపూర్‌ వెళ్లినప్పుడు ఇద్దరం ఒకే గదిలో గడిపాం. కౌలాలంపూర్‌లో నా పుట్టిన రోజు జరిపాడు.

  బాలచందర్‌గారిని ఎప్పుడు కలవాలన్నా మా రూటు పాత్రో ద్వారానే. పాత్రో అంటే అమితమైన గౌరవం, గురి, అభిమానం బాలచందర్‌గారికి. బాలచందర్‌గారి సాన్నిహిత్యం ఓ వ్యసనం. లభిస్తే దానినుంచి ఎవరూ తప్పుకోలేరు. బాలచందర్‌గారితో కలిసి పన్నెండో రోజునే నిష్క్రమించాడు పాత్రో.

  నాకే కాదు - నా భార్యని 'శివానీ' అని ఆత్మీయంగా పిలిచే రెండో మిత్రుడు (మొదటి మిత్రుడు బీ.వీ.రామారావు). నా పిల్లలకి సన్నిహితుడు. రొటీన్‌గా 'మెలోడ్రామా'ని పూసుకుని, రాసుకుని తెరమీద వ్యాపారం చేసే చిల్లర వ్యాపారులలాగ కాక - కొత్తదనాన్నీ, కొత్త ధనాన్నీ, కొత్త నుడికారాన్నీ యివ్వగల గొప్ప దర్శకులు - బాలచందర్‌, క్రాంతికుమార్‌ వంటివారి సాంగత్యం లభించిన అదృష్టవంతుడు. ఆ సాంగత్యాన్ని సార్ధకం చేసిన ప్రతిభాశాలి. 'మారుతీ' అన్న పిలుపుని ఆప్యాయంగా పిలిచే అతి కొద్దిమందిలో నేను నష్టపోయిన ఆత్మీయుడు. తెలుగుమాటకి కవిత్వపు చెమ్కీని అద్ది కొత్తరకం కన్నీటికి కొత్త అర్థం చెప్పిన కవి.

  నాటకంలో, సినీమాలో అద్భుతమయిన టైమింగ్‌ని ఒడిసిపట్టుకున్న రచయిత - పాత్రో, తన జీవితానికి వచ్చేసరికి సెలవు తీసుకోడానికి - ఒకే ఒక్కసారి టైమింగ్‌ మిస్సయాడు!

  - గొల్లపూడి మారుతీరావు (రచయిత, నటుడు)

  English summary
  Gollapudi Maruti Rao pays tribute To Dialogue Writer Ganesh Patro.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X