»   » వెండితెరపై ‘అబ్దుల్‌ కలాం’ఫస్ట్ లుక్: కలాం పైన ఈ వివాదాలు కూడా చూపించనున్నారా?

వెండితెరపై ‘అబ్దుల్‌ కలాం’ఫస్ట్ లుక్: కలాం పైన ఈ వివాదాలు కూడా చూపించనున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవిత విశేషాల నేపథ్యంలో వస్తున్న చిత్రం 'డాక్టర్ అబ్దుల్ కలాం'. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర గత ఫిబ్రవరి లోనే విడుదల చేశారు. మరోసారి తాజాగా ఇస్రో ఛైర్మ‌న్ ఏఎస్ కిర‌ణ్ కుమార్ చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేయించారు. డాక్ట‌ర్ అబ్ధుల్ క‌లాం అనే టైటిల్ తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా హీ డ్రీమ్, హీ కంక‌ర్డ్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అబ్ధుల్ కలాం జీవితంపై రాజ్ చెంగ‌ప్ప రాసిన బుక్ ఆధారంగా ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం. సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

అబ్దుల్ కలాం జీవితం

అబ్దుల్ కలాం జీవితం

ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ లు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్‌ టైన్ మెంట్ పతాకంపై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కలాం సాధించిన విజయాలు,పోక్రాన్ అణు బాంబు ప్రయోగం, సిఐఎని ఎలా ఫూల్ చేసింది, పేపర్ బాయ్ రాష్ట్రపతి స్థాయికి ఎలా ఎదిగింది మొదలైన స్పూర్తి దాయక విషయాలను చూపించనున్నారు. ఈ నేపధ్యంలో అబ్దుల్ కలాం జీవితంలోని కొన్ని విశేషాలు

గవ్వలు, శంఖాల్నీ సేకరించి

గవ్వలు, శంఖాల్నీ సేకరించి

రామేశ్వరంలో పుట్టిన అబ్దుల్ కలాం తండ్రి సముద్రతీరంలోని గవ్వలు, శంఖాల్నీ సేకరించి అమ్మేవారు. పడవ యజమాని. వారికి కొద్దిపాటి కొబ్బరితోట కూడా ఉండేది. మత విశ్వాసాలు, అధ్యాత్మిక అంశాలపై కలాం తండ్రి మక్కువతో ఉండేవారు. కొబ్బరి తోటకు వెళ్లి కొబ్బరి బొండాలతో ఇంటికి చేరుకోవడం ఆయన దినచర్యగా ఉండేది.

పడవ నడుపుతూ

పడవ నడుపుతూ

రామేశ్వరం మసీదు వీధిలోని సున్నం ఇటుకలతో కట్టిన విశాలమైన ఇంట్లో ప్రతిరోజు వారి కుటుంబం సభ్యుల కంటే ఎక్కువగానే అతిథులు భోజనాలు చేస్తుండేవారు. ఓ పడవలో రామేశ్వరం నుంచి ధనుష్కోటికి యాత్రికులను తీసుకువేళ్లే పడవ నడుపుతూ కలాం తండ్రి మంచి వ్యాపారం చేస్తుండేవారు

అహ్మద్‌ జలాలుద్దీన్‌

అహ్మద్‌ జలాలుద్దీన్‌

ఒకసారి వచ్చిన భారీ తుపాన్‌తో ఆ పడవ తునాతునకలు అయ్యింది. అప్పటి నుంచి కలాంకు తన సోదరి భర్త అహ్మద్‌ జలాలుద్దీన్‌తో స్నేహం కుదిరింది. కొద్దిపాటి ఇంగ్లీష్‌ చదువుకున్న అతనే కలాంను బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తు ఉండేవాడు. మరో బంధువు షంషుద్దీన్ కూడా కలాంను ప్రభావితం చేశారు.

సైన్స్‌ ఉపాధ్యాయుడు

సైన్స్‌ ఉపాధ్యాయుడు

కలాంకు చిన్నతనంలో రామనాథశాస్త్రి, అరవిందం, శివప్రకాశన్‌ అనే మిత్రులుండేవారు. వారంతా సనాతన బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారైనప్పటికీ కలాంతో అరమరికలులేని స్నేహం ఉండేది. రామేశ్వరం పాఠశాలలోని సైన్స్‌ ఉపాధ్యాయుడు శివసుబ్రహ్మణ్య అయ్యర్‌ కలాంను ఎంతో అభిమానించేవారు. పలుమార్లు కలాంను తన ఇంటికి తీసుకువెళ్లి ఆయనే స్వయంగా వడ్డించి భోజనం పెట్టేవారు.

కలెక్టరుగా చూడాలనుకునేవారు

కలెక్టరుగా చూడాలనుకునేవారు

శివసుబ్రహ్మణ్య అయ్యర్‌ చెప్పే పాఠాలే కలాంకు పరిశోధనపై ఆసక్తి కలిగించాయి. కలాం ప్రాథమిక విద్యాభ్యాసం రామేశ్వరంలో పూర్తి కావడంతో ఉన్నత చదువు రామనాథపురం జిల్లా కేంద్రంలోని స్క్వారాట్జ్‌ పాఠశాలలో సాగింది. జైనులాబ్దీన్‌ తన కుమారుడిని కలెక్టరుగా చూడాలనుకునేవారు. రామనాథపురం హైస్కూల్‌ ఉపాధ్యాయుడు ఇయదురై సొలొమోన్‌ కలాంకు ఆదర్శ పథ నిర్దేశకుడయ్యారు. ఉన్నత పాఠశాల విద్య తరువాత కలాం 1950లో తిరుచినాపల్లిలోని సెంట్‌ జోసెఫ్‌ కళాశాలలో చేరారు. అక్కడే బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం మద్రాస్‌ ఐఐటీలో చేరారు.

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌

ఆ సమయంలో కలాం సోదరి జొహరా తన బంగారు గాజులు, గొలుసు కుదువపెట్టి సహాయం చేసింది. మొదటి సంవత్సరం పూర్తయ్యాక కలాం ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ను ఎంచుకున్నారు. అక్కడ ప్రొఫెసర్‌ స్పాండర్, ప్రొఫెసర్‌ కేఏవీ పండలై, ప్రొఫెసర్‌ నరసింగరావులు కలాం ఆలోచనలను తీర్చి దిద్దారు. భారత జాతి గర్వించతగ్గ శాస్త్రవేత్తగా కలాంను మలిచారు. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకున్నాక బెంగళూరులో డీఆర్డీవోలో జూనియర్‌ శాస్త్రవేత్తగా కలాం ఉద్యోగ జీవితాన్ని ప్రారరభించారు. ప్రభుత్వ కీలక సలహాదారుగానూ ఉన్నారు.

రాజకీయ వర్గాల్లో సంచలనం

రాజకీయ వర్గాల్లో సంచలనం

రాష్ట్రపతి రబ్బర్ స్టాంపు కాదని తన పదవీకాలంలో రుజువు చేశారు. లాభదాయక పదవుల బిల్లును తిరస్కరించారు. ఊహించని ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌, భాగస్వామ్య వామపక్షాల్లో ఒకింత ఆందోళన కలిగించింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ స్వయంగా వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కొన్ని విషయాల్లో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

విమర్శలున్నాయి

విమర్శలున్నాయి

21 క్షమాభిక్ష పిటిషన్లలో 20ని అపరిష్కృతంగా వదిలేశారన్న విమర్శలున్నాయి. తన పదవీ కాలంలో ఒకే ఒక క్షమాభిక్ష పిటిషన్‌పై చర్య తీసుకున్నారు. అత్యాచారం కేసులో దోషి ధనంజయ ఛటర్జీ దరఖాస్తును తోసిపుచ్చారు. అఫ్జల్‌గురు క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడంపై తలెత్తిన విమర్శలకు ఆయన తర్వాత సమాధానమిస్తూ.. ప్రభుత్వం నుంచి తనకెలాంటి పత్రాలు రాలేదని చెప్పారు. 2005లో బిహార్‌లో రాష్ట్రపతి పాలన నిర్ణయానికి విదేశాల నుంచే సమ్మతి తెలుపడంపైనా విమర్శలు తలెత్తాయి.

మిసైల్ మ్యాన్

మిసైల్ మ్యాన్

కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ పిల్లలకు, యువతకు అబ్దుల్ కలాం స్ఫూర్తినిచ్చారు. మిసైల్ మ్యాన్ కలాం ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. భారతరత్న సహా కలాం ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి.

English summary
ISRO Chairman Shri A.S.Kiran Kumar launched the poster which is titled 'Dr.Abdul Kalam' has been launched at an event in Rameshwaram, the place where the great man was born and grew up.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu