twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జియాఖాన్‌ది హత్యే: హైకోర్టుకెక్కిన తల్లి రబియాఖాన్

    |

    న్యూఢిల్లీ: తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, అది హత్యేనని బాలీవుడ్ నటి జియాఖాన్ తల్లి రబియాఖాన్ అన్నారు. దీనిపై ఆమె అక్టోబర్ 1న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై కోర్టు వచ్చే వారంలో వాదనలు వినే అవకాశం ఉందని రబియాఖాన్ తరపు న్యాయవాది దినేష్ తివారి మీడియాకు తెలిపారు. ఈ ఏడాది జూన్ 3న తన సొంత అపార్ట్‌మెంటులో ఉరివేసుకుని జియాఖాన్ మృతి చెందింది.

    తన కూతురు జియాన్‌ఖాన్‌ను హత్య చేసి ఆ తర్వాత తనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు హంతకులు ఏర్పాట్లు చేశారని రబియాఖాన్ ఆరోపించారు. ఫోరెన్సిక్ నిపుణులు జియాఖాన్‌ది ఆత్మహత్య కాదని, బలవంతంగా హత్య చేసినట్లు ఉందని తమ నివేదికలో తెలిపినట్లు పేర్కొంది. ఫోరెన్సిక్ నివేదికను సైతం రబియాఖాన్ తన పిటిషన్‌కు జత చేసి దాఖలు చేశారు. ఈ మేరకు జాతీయ మీడియాలో శుక్రవారం వార్తలు వచ్చాయి.

    పోలీసులు జియాఖాన్ ప్రియుడు సూరజ్ పంఛోలిని విచారించారని, తన కూతురు హత్య కేసును సిబిఐ దర్యాప్తు సంస్థచే విచారణ జరిపించాలని రబియాఖాన్ పిటిషన్‌లో కోరారు. పోలీసులు సరైన విధంగా విచారణ జరపకుండా తన కూతురిది ఆత్మహత్యగా తేల్చేశారని ఆమె ఆరోపించారు. ఆదిత్య పంఛోలి కుమారుడైన సురజ్ తన కుటుంబ పలుకుబడిని ఉపయోగించి కేసును తప్పుదోవ పట్టించారని ఆమె అన్నారు.

    జియాఖాన్‌ను హత్య చేసిన తర్వాతనే ఉరివేశారని రబియాఖాన్ ఆరోపించారు. ఈ ఆరోపణకు తగిన కారణాలున్నాయని ఆమె తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న వారి కళ్లు తేలిసినట్లు, నాలుక బయటికి వచ్చి ఉండాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో జియా ఆ స్థితిలో లేదని తెలిపారు. ఘటనా స్థలంలో మృతురాలికి ఉరివేసిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. జియాఖాన్ ముఖం, శరీరంపై గాయాలున్నాయని పేర్కొన్నారు. జియా పెదవి కుడి పక్కన గాయమైందని, ఎడమ చేతికి బలవంతంగా తాడుతో కట్టబడినట్లు ఆనవాలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ఓ పలుచని గుడ్డతో తనకు తాను ఉరివేసుకుందని పోలీసులు తమ విచారణలో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక మాత్రం ఇందుకు విరుద్ధంగా పలుచని గుడ్డను ఉపయోగించలేదని తెలిపింది. జియా తనకు తాను ఉరివేసుకున్నట్లుగా ఆనవాళ్లు లేవని నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. సిసిటీవీ ఫుటేజ్‌ను పరిశీలించినట్లయితే ట్రాక్ సూట్ ధరించిన జియా తన ఇంటిలోకి ప్రవేశించిన కొద్ది నిమిషాల్లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. జియా చనిపోయిన తర్వాత నైట్ గౌన్‌లో ఉంది, అయితే ఉరివేసుకోవాలనుకుంటే డ్రెస్ ఎందుకు మార్చుకుంటుందని పిటిషన్‌లో ప్రశ్నించారు.

    అంత ఎత్తులో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకోవాలంటే స్టూల్ లేకుండా సాధ్యం కాదు.. కానీ జియా ఇంట్లో స్టూల్ లేదు. ఘటనా సమయంలో ఏసీ ఆన్‌లో ఉన్నప్పటికీ తన ఇంట్లోని కిటికి తెరిచే ఉంది. ఆ కిటికి నుంచి ఎవరైన తన రూమ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. జియా మరణానికి ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంఛోలియే కారణమని రబియా ఖాన్ భావిస్తోంది. కాగా అమితాబ్ బచ్చన్‌తో నిషద్, అమీర్ ఖాన్‌తో గజిని, హౌస్‌ఫుల్ సినిమాలో అక్షయ్ కుమార్‌తో జియాఖాన్ నటించింది.

    English summary
    
 Rabbiya Khan, mother of actress Jiah Khan, is determined to prove that her daughter was murdered.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X