కరోనా క్రైసిస్ ఛారిటీ: ముందుకొచ్చిన లావణ్య త్రిపాఠి.. తన వంతుగా!
దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఈ మహామమారి దెబ్బకు యావత్ ప్రపంచం గడగడలాడిపోతోంది. కరోనా వైరస్ నివారణలో భాగంగా ఏ ఒక్క వ్యక్తీ ఇంటి గడపదాటి బయటకు రావొద్దని కేంద్ర, రాష్ట్ర ఆదేశాలు జారీ చేయడంతో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ ఎఫెక్ట్ సినీరంగంపై కూడా పడటంతో రోజూవారి సినీ కార్మికుల పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారైంది.
అయితే ఈ సంక్షోభ సమయంలో అందరికీ మేమున్నాం అంటూ స్వచ్చందంగా ముందుకొస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు. ఇందులో భాగంగా సినిమా రంగాన్ని ఆదుకునేందుకు కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించిన ప్రముఖులు.. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో 'సి.సి.సి. మనకోసం' (కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) అనే సంస్థను ఏర్పాటు చేశారు.

తమ సినిమాలకు సర్వం సమకూర్చే రోజూవారి సినీ కార్మికులను ఈ సంస్థ ద్వారా ఆదుకునేందుకు నడుం బిగించారు. పలువురు నటీనటులు ఈ కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కి తమవంతు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ముందుకొచ్చి లక్ష రూపాయల విరాళం ప్రకటించింది. కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళం ఇచ్చిన తొలి మహిళా నటిగా గుర్తింపు పొందింది.
ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. ''రోజూవారీ వేతనాలపై పనిచేసే సినీ కార్మికులకు సిసిసి ద్వారా నా వంతు సాయం అందిస్తున్నాను. ఇందులో భాగంగా రూ. 1 లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నాను'' అని పేర్కొంది.


Click it and Unblock the Notifications











