Mahesh Babu brother no more: నటుడు, నిర్మాత రమేష్ బాబు అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడంటే?
తెలుగు సినిమా పరిశ్రమ దిగ్గజ నటుడు కృష్ణ కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు ఇక లేరు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మరణంతో సినీ ప్రముఖులు, సినీ, సూపర్ స్టార్ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఘట్టమనేని కుటుంబంలో నెలకొన్న విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఘట్టమనేని ఫ్యామిలీ భావోద్వేగంతో ఓ ప్రకటనను అభిమానుల కోసం విడుదల చేశారు.
నటుడు, నిర్మాత రమేష్ బాబు మరణించారనే విషాద వార్తను తెలియజేయడానికి బాధతో ఉన్నాం. ఆయన భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉదయం 11 గంటలకు పెడుతున్నారు. అనంతరం అంతిమ యాత్రను ప్రారంభించి 12 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తాం అని ఘట్టమనేని ఫ్యామిలీ ఓ ప్రకటనలో తెలిపారు.
అంతేకాకుండా ప్రస్తుత కరోనావైరస్ పరిస్థితుల్లో ప్రభుత్వం విధించిన ఆంక్షలను, సలహాలను, సూచనలను పాటించండి. వీలైనంత వరకు అంత్యక్రియలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. మాస్క్ ధరించి, సురక్షిత ప్రమాణాలను పాటించండి అంటూ ఘట్టమనేని ఫ్యామిలీ తమ ప్రకటనలో వెల్లడించారు.

రమేష్ బాబు సినీ కెరీర్ విషయానికి వస్తే.. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా రమేష్ బాబు తన చిన్నతనంలోనే సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. తన 12వ ఏటనే తండ్రి కృష్ణతో కలిసి మనుషులు చేసిన దొంగలు చిత్రంలో నటించడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు రూపొందించిన నీడ చిత్రంలో కీలక పాత్రతో ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత 1987 సమ్రాట్ అనే చిత్రంతో పూర్తిస్థాయి హీరోగా పరిచయం అయ్యారు.
హిందీలో ఘన విజయం సాధించిన బేతాబ్ చిత్రం రీమేక్‌గా రూపొందిన సామ్రాట్ చిత్రం ద్వారా రమేష్ బాబు హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. హిందీలో సన్నీడియోల్, అమృతా సింగ్ నటించగా, తెలుగులో రమేష్ బాబు, సోనమ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వం వహించిన చిన్ని కృష్ణుడు చిత్రంలో నటించారు. హీరోయిన్‌గా పరిచయమైన ప్రస్తుత సీనియర్ నటి నదియాతో కలిసి నటించిన బజార్ రౌడీ చిత్రం రమేష్ బాబు భారీ విజయాన్ని అందించింది. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆయన తన కెరీర్‌లో నటించిన చివరి చిత్రం ఎన్‌కౌంటర్. 1997లో చివరిసారిగా స్క్రీన్‌పై కనిపించారు.


Click it and Unblock the Notifications











