twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దేనికైనా రెడీ’వివాదంపై పెదవి విప్పిన మోహన్ బాబు

    By Srikanya
    |

    హైదరాబాద్ : మంచు మోహన్ బాబు నిర్మించిన తాజా చిత్రం 'దేనికైనా రెడీ'చిత్రం వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. చిత్రంలో బ్రాహ్మణ వర్గాన్ని కించపరిచే సంభాషణలు,సన్నివేశాలు ఉన్నాయంటూ వాటిని తొలిగించాలంటూ గత కొద్ది రోజులుగా తీవ్ర వ్యతిరేకత ఎదురౌతోంది. కోర్టుల వరకూ వెళ్లిన ఈ వివాద విషయమై మోహన్ బాబు మీడియాకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఈ విషయమై వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..ఈ చిత్రంలో అన్నాచెల్లెళ్ల అనుబంధం ఉంది. సమగ్రత విలువను చెప్పే కథ ఉంది. ఆ విషయాల్ని వదిలి చిలవలుపలవలుగా ఎవరికి తోచినట్టువారు వివాదాలు సృష్టించారు. ఆ వివాదం ఇప్పుడు కోర్టులో ఉన్నా వివరణ ఇచ్చుకోవడంలో తప్పు లేదు. మా ఇంటి దగ్గర గొడవ చేసినవాళ్లను ఉద్దేశించి అన్న మాటల్ని ఓసారి యూట్యూబ్‌లో చూసుకోవచ్చు అన్నారు.

    అలాగే 'నా ఇంటికి వచ్చింది బ్రాహ్మణోత్తములై ఉండరు. ఎవరో డబ్బు కోసం గొడవ చేయడానికి వచ్చుంటారు. నేను ఊళ్లో లేను. వెళ్లి చందా ఇచ్చి పంపిస్తాను' అని సూళ్లూరుపేటలో చెప్పాను. దాన్ని రకరకాలుగా మార్చుకొని మా ఇంటిపై దాడికి పూనుకొన్నారు. శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థల్ని ఏర్పాటు చేసి అందులోని దరఖాస్తుల్లో కులం అనే మాట కనిపించకుండా చేసినవాణ్ని కులాల్ని కించపరిచేలా వ్యవహరిస్తానా? అన్నారు.

    నిజం చెప్పాలంటే 'దేనికైనా రెడీ' మొదటి షో నుంచే అత్యద్భుతమైన హిట్ టాక్‌తో నడుస్తోంది. అలాంటి సినిమాని ఎవరో ఎందుకో తెలియదు కాని, వారికి తెలుసో తెలియకో... కొంతమంది వ్యక్తుల ప్రోత్సాహంతోనో కావచ్చు... అనవసరంగా నా సినిమా మీదికి, నా కుమారుడు విష్ణుబాబు మీదికి, మా ఇంటిపైకి చెప్పులు, రాళ్లు పట్టుకుని కొంతమంది వచ్చారు. అప్పుడే ఆ వివాదానికి ఆజ్యం మొదలైంది. నిజానికి సినిమాలో ఏ సామాజిక వర్గాన్ని కించపరిచేలా కాని, విమర్శించేలా కాని డైలాగులూ, సీన్సూలేవు. ఇంకా చెప్పాలంటే రెండు మతాలను కలిపే 'జాతీయ సమైక్యత'ను చాటిచెప్పే సినిమాగా తీశాం అన్నారు.

    సినిమా రిలీజైన నాలుగు రోజుల తర్వాత మా ఇంటి ముందుకు కొందరు వచ్చి మోహన్‌బాబుకు, అతని కొడుక్కి చెప్పుల దండలు వెయ్యాలని అరిచారు. నేనప్పుడు హైదరాబాద్‌లో లేను. నా కుమారుడు విష్ణు చాల రోజుల తర్వాత 'దేనికైనా రెడీ'తో మంచి విజయాన్ని చవిచూశాడు అన్న ఆనందంతో సూళ్లూరుపేట చెంగాళమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నాను. అప్పుడు కొందరు విలేకరులు అక్కడికొచ్చి ఓ ప్రశ్న వేశారు. 'హైదరాబాదులో మీ ఇంటి మీదికి బ్రాహ్మణులు వచ్చి గొడవ చేశారు. దీనికి మీ స్పందన ఏమిటి, అని అడిగినప్పుడు, నా సమాధానం చెప్పాను.

    నిజమైన బ్రాహ్మణులు, వేదం తెలిసిన పండితులు, బ్రాహ్మణోత్తములు ఎవరూ అలా చేయరు. ఎవరో సినిమా చూడనివాళ్లు, అల్లరి చేయాలనుకున్నవాళ్లు డబ్బుకోసం, చందాలకోసం వచ్చి అలా బిహేవ్ చేసుంటారు. అరిస్తే డబ్బిస్తాం అన్నది వాళ్ల ఉద్దేశం కావచ్చు. అలాంటి వాళ్లకు నేను అక్కడ ఉంటే ఏదో డబ్బిచ్చి పంపించేవాణ్ని... అని. ఈ మాటలు అన్నది నిజమైన బ్రాహ్మణుల గురించి కాదు. అల్లరి చేసిన వాళ్లను ఉద్దేశించి మాత్రమే.

    అటువంటి సంఘటనను చిలవలు పలవలు చేసి జీవించి ఉండగానే పిండాలు పెట్టారు. వాళ్లు చేసిన అభ్యంతరకర ఘటనకు మేము చేసిన ఆ ప్రతిఘటన ఆత్మరక్షణ కోసమే. విష్ణు మానవహక్కుల సంఘం దగ్గరికెళ్లినప్పుడు చెప్పులు వేశారు. దున్నపోతు మీద దిష్టిబొమ్మలను ఊరేగించారు. అప్పుడు నేను నోరు విప్పానా..? జరిగిన సంఘటనలకు బ్రాహ్మణ సమాజం పెద్దలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే అంగీకరించడానికి అభ్యంతరం లేదని నా కుమారుడు విష్ణు పత్రిక ద్వారా కోరాడు. కానీ ఎవరూ స్పందించలేదు. పరిష్కారం న్యాయస్థానంలోనే అన్నారు.

    నాకు న్యాయస్థానం అంటే ఎనలేని గౌరవం, విశ్వాసం ఉంది. తుది తీర్పు వచ్చాక తప్పక స్పందిస్తా. కాని జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన అని మాత్రం చెప్పదలచుకున్నాను. ఇది అలా జరిగి ఉండవలసింది కాదు. ఏమైనా జరిగిన దానికి బాధపడుతున్నాను. సినిమా ప్రారంభంలోనే సంఘటనలు, పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు కేవలం కల్పితాలు, ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావు అని తొలి కార్డులో వేశాం కూడా.

    చిత్రం వివాదం వల్ల ఒక నిర్మాతగా చాలా నష్టం జరిగింది. థియేటర్‌ దగ్గర గొడవలు జరుగుతున్నాయంటే కుటుంబంతో కలిసి వెళ్లడానికి భయపడతారు. అందుకే చాలామంది మహిళలు సినిమాని చూడలేకపోయారు అని చెప్పుకొచ్చారు. గురువారం నాటికి మోహన్‌బాబు తొలి చిత్రం విడుదలై 37 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.

    English summary
    
 Mohan Babu says that ..." Denikaina Ready is about National Integrity and there is lot of creativity involved in it. Denikaina Ready is a comedy film with an underlying sentiment".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X