»   » అంత లేదు: రాజేంద్రుడి విమర్శలపై మురళీమోహన్ కౌంటర్

అంత లేదు: రాజేంద్రుడి విమర్శలపై మురళీమోహన్ కౌంటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘మా' ఎన్నికల్లో ఎలాంటి రాజకీయాలు లేవని.....ఇప్పటి వరకు మా ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ కాలేదని ప్రస్తుత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ స్పష్టం చేసారు. రాజేంద్రప్రసాద్, నాగబాబు చేసిన విమర్శలపై మురళీ మోహన్ ఓ టీవీ కార్యక్రమంలో స్పందించారు. చిరంజీవి, దాసరి వర్గంగా ఎన్నికలు జరుగుతున్నాయనడంలో వాస్తవం లేదన్నారు. చిరంజీవి, దాసరి కొట్టుకునేంత రాజకీయం ఏమీ లేదు. వారెవరూ నిలబడలేదు. మాకు కులం, మతం, ప్రాంతం బేధం లేదు. అందరూ మాకు కావాలి...అందరికీ మేము కావాలి అని వ్యాఖ్యానించారు.

Murali Mohan

ఈ సారి యువకులకు అవకాశం ఇద్దామని అనుకున్నాం. మంచు విష్ణును, అల్లు అర్జున్, మంచు లక్ష్మిని అడిగాము. కానీ వారు ఎవరూ ముందుకు రాలేదు. తర్వాత రాజేంద్రప్రసాద్ తానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత జయసుధ వచ్చి మహిళకు అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకే ఆమెకు మద్దతు ఇచ్చాం అన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం....తాత్కాలికమే. పోటీ వాతావరణం సృష్టించేందుకే ఇదంతా. మేమంతా ఒకటే అని మురళీ మోహన్ వ్యాఖ్యానించారు.

పెన్షన్లు ఇవ్వడం లేదనే విమర్శపై మురళీ మోహన్ మాట్లాడుతూ......పెన్షన్లు ఇపుడు పెద్దగా ఇవ్వడం లేదు. పెన్షన్లు ఇవ్వడం కన్నా ఏదైనా కష్టం వచ్చినపుడు ఆర్థిక సహాయం చేయాలని అక్కినేనిగారు సూచించారు. అందుకే పెన్షన్లు తగ్గించామని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

ఎలక్షన్ కమీషనర్లుగా వ్యవహరించింది... మాజీ అధ్యక్షుడి లాయర్, ఆయన అనుచరుడైన నటుడు, కావాలనే నామినేషన్ల విషయంలో గంట సమయం పెంచారని రాజేంద్రప్రసాద్ చేసిన ఆరోపణలపై స్పందించడానికి మురళీ మోహన్ నిరాకరించారు. ఎన్నికల కమీషనర్లుగా వ్యవహరించిన కృష్ణ మోహన్, నారాయణరావు రూల్స్ గురించి బాగా తెలిసిన వాళ్లు, అనుభవం ఉన్న వాళ్లు. నేను ఆ రోజు ఊర్లో లేను కాబట్టి అందుకు సంబంధించిన విషయాలపై నేను స్పందించను అన్నారు మురళీ మోహన్.

ఒక ఇంగ్లిష్ సినిమాలో నటించినంత మాత్రాన ఇంటర్నేషనల్ యాక్టర్ అయిపోతాడా? తిరుపతి కొండపై కాటేజీ ఉంటే అర్హత వస్తుందా? అంటూ మురళీ మోహన్ రాజేంద్రప్రసాద్ పై ఫైర్ అయ్యాడు. స్టేచర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నాకు మించిన అర్హత ఈ పరిశ్రమలో ఎవరికీ లేదనే రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై మురళీ మోహన్ ఇలా స్పందించారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు కనీసం గూడు కూడా లేదనే రాజేంద్రప్రసాద్ విమర్శలపై మురళీ మోహన్ స్పందిస్తూ.....బిల్డింగ్ కట్టాలంటే, స్థలం కావాలంటే చాలా కష్టం అవుతుంది. దాదాపు 10 కోట్లు కావాలి. అంత ఫండ్ మన వద్ద లేదు అని మురళీ మోహన్ వ్యాఖ్యానించారు.

చివరగా మురళీ మోహన్ మాట్లాడుతూ.....తమ్ముడూ(రాజేంద్రప్రసాద్) నువ్వు గెలిచినా ఆనందమే, మా జయసుధ గెలిచినా ఆనందమే. ఎవరు గెలిచినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధికి పాటు పాటుపడాలనేదే నా కోరిక అని వ్యాఖ్యానించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu