హైదరాబాద్ :'అత్తారింటికి దారేది' సినిమా చూశాను. బాగా ఎంజాయ్ చేశాను. పవన్ కల్యాణ్ మాత్రమే చేయగలిగే పాత్ర అది. దర్శకుడు త్రివిక్రమ్ పనితనం బాగా నచ్చింది. సంభాషణలు చాలా బాగున్నాయి. 'అత్తారింటికి దారేది' సినిమాను విడుదలకు ముందే పైరసీ చేశారు. ఇంతకంటే అన్యాయం ఎక్కడుంటుంది చెప్పండి?. ఆ సినిమా పైరసీ జరుగకపోతే కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా వుండేవి. సినిమా బాగుంది కాబట్టి పైరసీ కలెక్షన్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.
అలాగే అనుకోని బంద్‌లు ఏ ప్రాంతంలో జరిగినా అవి ప్రేక్షకుడిపై తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రేక్షకుడి ఆలోచనా ధోరణిని మారుస్తాయి. సినిమా చూడటం కొంచెం ఆలస్యంకాగానే ...'ఇక సినిమా ఏం చూస్తాం...మార్కెట్‌లో ఎక్కడో ఓ చోట పైరసీ సీడీ తెచ్చుకొని చూద్దాం' అనే భావన కలుగుతుంది. అనిశ్చిత పరిస్థితుల వల్ల ఒక్క సినిమా రంగమే కాదు..పతి వ్యాపారరంగం...సామాన్య జనజీవితం కూడా కష్టాల్ని ఎదుర్కొంటుంది అన్నారు.
'భాయ్' కథ గురించి చెప్తూ...విదేశాల్లో డాన్‌గా పనిచేసే భాయ్ ఓ లక్ష్యం కోసం హైదరాబాద్ పాతబస్తీలో అడుగుపెడతాడు. ఆ తర్వాత పెళ్లిళ్లు కుదిర్చే వెడ్డింగ్ ప్లానర్ అవతారమెత్తుతాడు. ఈ క్రమంలో అతను తన కుటుంబం గురించి తెలుసుకుంటాడు. అనుబంధాల కోసం పరితపిస్తాడు. తన కుటుంబానికి చేరవయ్యే క్రమంలో భాయ్ ఏం చేశాడనేదే చిత్ర ఇతివృత్తం. సినిమా ద్వితీయార్థం మొత్తం కుటుంబ నేపథ్యంలో నడుస్తుంది. మూడు కోణాల్లో నా పాత్ర చిత్రణ ఆసక్తికరంగా వుంటుంది.
డాన్‌నుంచి ఓ కుటంబవ్యక్తిగా 'భాయ్' పరివర్తన చెందే క్రమం సినిమాలో ఆసక్తికరమైన అంశంగా వుంటుంది. ఈ సినిమాలో నేను తొలిసారిగా హైదరాబాద్ పాతబస్తీ యాసలో మాట్లాడాను. ఆ స్లాంగ్‌లో చెప్పే డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా వుంటాయి. 'భాయ్' రెగ్యులర్ కమర్షియల్ సినిమా. నా ఉద్దేశ్యంలో కమర్షియల్ సినిమాలో కొత్త అంశాలంటూ ఏమీ వుండవు. క్యారెక్టర్స్ డిజైన్ చేసే విధానమే కొత్తగా వుంటుంది. చక్కటి వినోదం...మంచి పాటలు...ఫైట్స్...ఇలా కమర్షియల్ సినిమాలన్నీ దాదాపు ఒకే చట్రంలో వుంటాయి. 'భాయ్' రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా కథను తీర్చిదిద్దిన విధానం మాత్రం సరికొత్తగా పంథాలో వుంటుంది అన్నారు.
''శిరిడిసాయి' 'ఢమరుకం' 'గ్రీకువీరుడు'లాంటి విభిన్న కథా చిత్రాల తర్వాత నేను చేస్తోన్న పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రమిది. 'భాయ్' చిత్రాన్ని ఆద్యంతం వినోద ప్రధానంగా దర్శకుడు వీరభధ్రమ్ అద్భుతంగా తీర్చిదిద్దాడు. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకముంది' అన్నారు నాగార్జున. స్వీయనిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్డూడియోస్ పతాకంపై ఆయన నిర్మించిన 'భాయ్' ఈ నెల 25న ప్రేక్షకులముందుకురానుంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.