బాబా సచరిత్ర ఆధారంగా... (శిరిడి సాయి ప్రివ్యూ)
హైదరాబాద్: షిర్డీసాయిగా నాగార్జున నటించిన శిరిడీ సాయి చిత్రం ఈ రోజే విడుదల అవుతోంది. ఈ చిత్రం బాబా సచరిత్ర ఆధారంగా రూపొందించారు. కొన్ని చోట్ల విడుదలకు ముందే థియేటర్లు శుభ్రపరచి, బాబా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారని సమాచారం . ఈ చిత్రాన్ని 801 థియేటర్లలో విడుదలచేస్తున్నామనీ, బాబా భక్తులకు గిఫ్ట్‌గా ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్నాటక, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, దుబాయి, న్యూజిలాండ్, యు.ఎస్. తదిరత ప్రాంతాల్లోకూడా విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం కథ ప్రకారం..దత్తాత్రేయుని రూపంగా సాయిబాబాను కొలుస్తుంటారు భక్తులు. బాబా తన పదహారోయేట శిరిడికి వస్తారు. అక్కడి వేప చెట్టు కింద కూర్చొంటారు. ఆ క్రమంలో బాబా బోధనలు, మహిమలతో ఈ చిత్ర కథ సాగుతుంది. బాబా పాత్రలో నాగార్జున కనిపిస్తారు. దాసగణు (శ్రీకాంత్), వేల్స్ (శ్రీహరి), మహల్సాపతి (శరత్‌బాబు), నానావళి (సాయికుమార్) లాంటి పాత్రలు ఈ కథలో భాగమే.
నాగార్జున ఈ చిత్రం గురించి చెబుతూ ''బాబా జననం నుంచి జీవ సమాధి వరకూ ఉన్న అన్ని దశలనూ స్పృశించాం. నేటి తరంలో ఎంతోమంది సాయిబాబా బోధనలపై విశ్వాసం కలిగి ఉన్నారు. అందరికీ నచ్చేలా రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. కీరవాణి స్వరాలకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది''అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ -''ఈ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ అంతా మేజిక్‌గా జరిగిపోయింది. హేమండ్‌పంత్‌తో బాబా దగ్గరుండి తన సచరిత్రను రాయించుకున్నారట. అలాగే బాబా దగ్గరుండి తనకు కావాల్సిన విధంగా ఈ సినిమా తీయించుకున్నారు. ప్రేక్షకలోకానికి ఆత్మానందాన్ని కలిగించే సినిమా ఇది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి జన్మ ధన్యమైందని నా భావన. రాఘవేంద్రరావు ఓ తపస్సులా ఈ చిత్రాన్ని మలిచారు.
శిరిడిసాయిగా సెట్‌లో నాగార్జున ఆహార్యం, అభినయం చూసిన నా కళ్లలో ఆనందాశ్రువులు చిమ్మాయి. రేపు థియేటర్లలో ప్రేక్షకులు కూడా అదే అనుభూతికి లోనవుతారు. ఈ రోజు నుంచి 'శిరిడిసాయి' విడుదలైన ప్రతి థియేటర్ శిరిడిని తలపిస్తుంది'' అని తెలిపారు.
సంస్థ: సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.
తారాగణం: నాగార్జున, శ్రీకాంత్, శ్రీహరి, సాయికుమార్, కమలిని ముఖర్జీ, తనికెళ్ల భరణి, శరత్ బాబు, రోహిణి హట్టంగడి, వినయప్రసాద్, సాయాజీ షిండే, దేవేంద్ర దోడ్కే, బ్రహ్మానందం, కౌశిక్‌బాబు తదితరులు
సంభాషణలు: పరుచూరి బ్రదర్స్
సంగీతం: కీరవాణి
కళ: భాస్కరరాజు, శ్రీకాంత్
నిర్మాత: ఎ.మహేష్ రెడ్డి
కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
విడుదల: గురువారం.


Click it and Unblock the Notifications











