twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జమున’కు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం!

    By Sindhu
    |

    నటనలో చాతుర్యం, నడకలో సౌందర్యం, పెదవిపై చిరు మందహాసం జమున సొంతం. చిలిపి భామగా, వగరు, పొగరుల ఒయ్యారిగా నటించి.. నటనకే భాష్యం చెప్పిన అద్భుత నటి జమున. పలు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో కూడా నటించి అశేషాంధ్ర ప్రేక్షకుల మన్ననల్ని పొందారు. ఈ మహానటికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రకటించిన సందర్భంగా స్పెషల్ స్టోరీ.

    సరస సమ్మోహన తారగా, ప్రేక్షకుల హృదయరాణిగా సినీ సామ్రాజ్యాన్ని ఏలిన మేటి నటీమణి జమున. వాచకంలో దర్పం, అందంలో సత్యభామను మైమరిపించే సొగసు జమున సొంతం. ఆమె పలు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. శ్రీకృష్ణ తులాభారం, గులేబకావళి కథ, భాగ్యరేఖ, పూలరంగడు, ఇల్లరికం తదితర చిత్రాల్లో ఆమె నటన ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంది.నటనలో చాతుర్యం, నడకలో సౌందర్యం, పెదవిపై మందహాసంతో ఏపాత్రనైనా అవలీలగా పోషించగలగడం జమున స్పెషాలిటీ. చిలిపి సొగసుల భామ అయినా, వగరు పొగరుల ఒయ్యారి అయినా నటనకే భాష్యం చెప్పి నటిగా విజృంభించిన జమున పలు పౌరాణిక చిత్రాల్లో కూడా నటించి అశేషాంధ్ర ప్రేక్షకుల మన్ననల్ని పొందారు. ఎన్.టి.ఆర్, ఏఎన్నార్ సరసన సరిసమానమైన నటనా వైదుష్యాన్ని ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది.

    చలనచిత్ర రంగంలో స్వర్ణయుగం లాంటింది ఒకప్పటి కాలం. ఆకాలంలో హీరోకి ఎంత ప్రాధాన్యం ఉండేదో హీరోయిన్ కి కూడా అంతే ప్రాముఖ్యత ఉండేది. తన వలపు చూపులతో మత్తెక్కించి, చిలిపి చేష్టలతో మైమరపించి, కథానాయకుడ్ని ఆటపట్టిస్తూ ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది. భార్యగా, ప్రేమికురాలుగా, తల్లిగా, చెల్లిగా అనేక చిత్రాల్లో నటించి ఆయా సినిమాల విజయాల్లో తన పాత్రకు అత్యున్నత గౌరవాన్ని ఆపాదించారు జమున. అనేక సాంఘిక చిత్రాల్లో హీరోయిన్ గా తన నటనతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన జమున పలు క్లిష్టమైన పాత్రల్ని సైతం సమర్థవంతంగా పోషించి మెప్పించారు. అహంకారం నిండిన భార్యగా, పల్లెటూరి పిల్లగా ఇలా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగోపోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. జమున కొంత కాలం రాజకీయాల్లోను సేవ చేసారు. కాంగ్రెస్ తరపున పార్లమెంటు సభ్యురాలిగా నెగ్గారు. తర్వాత బీజేపీ లోను కొనసాగారు. సున్నిత మనస్కురాలైన ఆమె రాజకీయాలలో ఇమడలేక తర్వాత పాలిటిక్స్ కు దూరమయ్యారు.

    అలనాటి నట దిగ్గజాలకు దీటుగా నటించి..అద్వితీయ నటనని కనబర్చి కళా భారతిగా మన్ననల్ని అందుకున్న అసమాన నటి జమున గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జువాలజీ ప్రొఫెసర్ రమణారావుతో 1965లో వివాహం చేసుకున్న ఆమెకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. దాదాపు 200 సినిమాలలో నటించిన జమునకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రకటించినది. అలాగే రఘుపతివెంకయ్య చలనచిత్ర అవార్డును ప్రముఖ నటీమణి మహిళా దర్శకురాలు విజయనిర్మలకు ప్రకటించారు. బిఎన్ రెడ్డి జాతీయ చలనచిత్ర అవార్డుకు ప్రముఖ దర్శకుడు కెబి తిలక్‌ ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వీరికి దట్స్ తెలుగు తరపున శుభాకాంక్షలు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X