»   » జాతీయ స్థాయిలో రికార్డ్: సుమకు అందించిన రామోజీ

జాతీయ స్థాయిలో రికార్డ్: సుమకు అందించిన రామోజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: టీవీ యాంకర్ గా సుపరిచితురాలైన సుమకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ఈటీవీలో ప్రసారమవుతూ తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందిన 'స్టార్‌ మహిళ' కార్యక్రమం ద్వారా అత్యధిక ఎపిసోడ్లకు వ్యాఖ్యాతగా ఆమె జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పినట్లు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ తెలిపింది. ఈ అవార్డుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని రామోజీ గ్రూఫ్ చైర్మన్ రామోజీరావు యాంకర్ సుమకు అందించారు.

2008లో ప్రారంభమైన 'స్టార్‌ మహిళ' కార్యక్రమం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ప్రసారమవుతోంది. సాధారణ గృహిణుల నుంచి సినీ తారల వరకూ వివిధ రంగాల ప్రముఖులు దీనిలో పాల్గొంటున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఈ కార్యక్రమం ఇప్పటికే 2045 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని జైత్రయాత్ర కొనసాగిస్తోంది.

'స్టార్‌ మహిళ'గా నిలిచేందుకు మహిళలు పోటీపడే ఈ కార్యక్రమాన్ని సుమ తనదైన శైలిలో రక్తికట్టిస్తున్నారు. సమయస్ఫూర్తితో, చక్కటి తెలుగు వ్యాఖ్యానంతో, ఆటపాటలతో అలరిస్తూ అశేష సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకోవడం విశేషం.

RAMOJI RAO presents Limca Book of Records to Suma

సుమ కెరిర్...
ఇరవై మూడేళ్ల కెరీర్‌... వేల కార్యక్రమాలూ, ధారావాహికలూ... ఇలా యాంకర్‌ సుమ గురించి చెప్పడం మొదలు పెడితే చిట్టా చాలా పెద్దదే! ఆ ప్రస్థానంలో హాస్యాన్నీ, నటననూ కలగలిపిన యాంకరింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. అవార్డుల కంటే ఎంతో విలువైన ప్రముఖుల ప్రశంసలతో పాటూ, ప్రేక్షకుల అభిమానాన్నీ సంపాదించుకుంది సుమ.

సుమ మాట్లాడుతూ... నేను చేసిన 'అవాక్కయ్యారా' కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. 'పట్టుకుంటే పట్టు చీర' పెద్ద హిట్టయ్యింది. అది ఎనిమిదిన్నరేళ్లు చేశా. తరవాత 'మహిళలూ మహారాణులూ' గేమ్‌ షో చేశా. అది నాలుగొందల భాగాలు పూర్తయ్యాక 'స్టార్‌ మహిళ'గా మారింది. ప్రస్తుతం పదహారొందల ఎపిసోడ్లకు దగ్గరపడింది. మహిళల కోసం ఉద్దేశించిన డైలీ షో.. ఇన్ని ఎపిసోడ్‌లు పూర్తి చేసుకోవడం నాకు తెలిసి ఇదే ప్రథమం.

నేను గడగడా మాట్లాడతానని మీకు తెలుసుగా! అదే దూకుడులో ఆరొందల ఆడియో విడుదల కార్యక్రమాలకు పని చేశా. నా కెరీర్‌లో మూడేళ్ల పాటు నోటికి విశ్రాంతే ఇవ్వలేదు. దాంతో గొంతుకి ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. వైద్యుల సలహా ఏంటంటే... మూణ్నెళ్లు గప్‌చుప్‌గా ఉండటం. పదిరోజులు మాట్లాడకుండా విశ్రాంతి తీసుకున్నా.

కానీ నేను సైగలు చేస్తుంటే, ఇంట్లో వాళ్లూ సైగలు చేసేవారు. విసుగొచ్చి 'మీ నోరు బాగానే ఉందిగా' అని కోప్పడేదాన్ని. ప్రస్తుతం గొంతుకు సంబంధించి వ్యాయామాలు చేస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ... కార్యక్రమాలు చేస్తున్నా. ఇవన్నీ ఒకెత్తయితే కమల్‌హాసన్‌గారు 'ఈనాడు' ఆడియో విడుదలకు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి అభినందించడం మరొక ఎత్తు అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది.

English summary
RAMOJI RAO presents Limca Book of Records to Suma.
Please Wait while comments are loading...