»   » పవన్ 'ఇజం' పై 'సాక్షి' ఘాటు విసుర్లు

పవన్ 'ఇజం' పై 'సాక్షి' ఘాటు విసుర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి, రీసెంట్ గా ఈనాడు దినపత్రికలో వైయస్ జగన్ ని టార్గెట్ చేస్తూ ఇంటర్వూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వైయస్ జగన్ పత్రిక 'సాక్షి' ..పవనిజం పై ప్రహసనం అంటూ విమర్శలు చేసింది. ఏబీకే ప్రసాద్
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఈ ఆర్టికల్ రాసారు.

పవన్ కళ్యాణ్ తన మిత్రుడు రవితేజతో కలిపి రాసిన ఇజం పుస్తకాన్ని ఇందులో విమర్శించారు. పుస్తకం మొదటి నుంచి చివరి వరకు పరస్పర వైరుధ్యాల పుట్ట అని విశ్లేషించారు.

పాడిందే పాడరా అన్నట్టు చెప్పిందే చెప్పడం, ఆ చెప్పిన అంశానికీ స్పష్టత లేకపోవడం- ఇలా సాగింది. కాకపోతే అల్లికలోనూ, పేనుడులోనూ రాటుతేలిన ఓ 'మాటల పోగు' ఎవరో పదాల పోహళింపుతో చేతివాటంగా గిలికిన సరుకులా ఉన్నది అని అన్నారు.

'సాక్షి' లో ప్రచురించిన ఆర్టికల్ యధాతథంగా...

" 'సామాజిక జీవనం యావత్తూ ప్రధానంగా మానవుడి సదాచరణతో ముడిపడి ఉన్న కార్యం' మార్క్స్ ఇజాలు మారిపోతున్నాయట. అందుకే అన్నిదారులు అహ్మదాబాద్ వైపు సాగుతున్నాయట. అన్నిరకాల వక్రవతుండాలూ కూడా ఆ వైపే సాగుతున్నాయట. అందులో భాగమే కాబోలు ఇద్దరు హీరోలు కూడా అటు వెళ్లి వచ్చారు. ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ నేతల ప్రోద్బలంతోనే జాతరలు జరుగుతున్నాయన్నది చిదంబర రహస్య మేమీ కాదు.

సినీనటుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో చేసిన ప్రసంగం అసలే పస లేనిదనుకుంటే, అంతకన్నా పసలేనిది - అతడు రచించాడని, అతని పేరిట వెలువడిన 'ఇజం' పుస్తకం. ఈ పుస్తకాన్ని ఆయన ఒక సైద్ధాంతిక ప్రణాళికగా చెప్పుకుంటున్నాడు. పవన్ ఏం చెబుతున్నాడో, చెప్పిన దాంట్లో సారాంశం ఏమిటో హైదరాబాద్ సభలో ప్రేక్షకులకు అర్థం కానట్టే, ఈ 'ఇజం' రచన కూడా అయోమయంగా కొనసాగింది.

Saakshi in an attempt to attack Pawan Kalyan

అవగాహనకు ఆమడ దూరంలో.. సామాజిక రాజకీయార్థిక, సాంస్కృతికపరమైన ఏ ఒక్క అంశం పైనా అవగాహన గానీ, స్పష్టత గానీ పవన్‌కు ఉన్నట్టు కనిపించదు. అన్నీ కప్పదాట్లే. బహుశా అందుకే పవన్‌కు ఇష్టుడైన ప్రసిద్ధ దర్శక నిర్మాత రామ్‌గోపాల్ వర్మ సైతం ట్వీట్‌లో ఇదే అభిప్రాయం వెలిబుచ్చవలసి వచ్చింది. 'ఇజం' పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించాను గానీ, ఏమీ అర్థం కాలేదనీ, అసలు పుస్తకం రాసినవాళ్లకైనా అది అర్థమైందా? అని వర్మ ప్రశ్నిం చడం పవన్ సైద్ధాంతిక శూన్యతకి లేదా అయోమయానికి ప్రబల నిదర్శనం.

పుస్తకం మొదటి నుంచి చివరి వరకు పరస్పర వైరుధ్యాల పుట్ట. పాడిందే పాడరా అన్నట్టు చెప్పిందే చెప్పడం, ఆ చెప్పిన అంశానికీ స్పష్టత లేకపోవడం- ఇలా సాగింది. కాకపోతే అల్లికలోనూ, పేనుడులోనూ రాటుతేలిన ఓ 'మాటల పోగు' ఎవరో పదాల పోహళింపుతో చేతివాటంగా గిలికిన సరుకులా ఉన్నదేగానీ సమాజ పరిణామక్రమం పట్ల తన దృష్టి ఏమిటో, 'ఆదర్శ సమాజం' ఎలా ఉండాలని ఊహిస్తున్నాడో పవన్ ఆలోచనల వైపు నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఇందుకు ప్రధాన కారణం- సమాజ పరిణామం గురించి, దానిని తీర్చిదిద్దడంలో రాజకీయ, వైజ్ఞానిక, సామాజిక, ఆర్థికాంశాలు నిర్వహించే పాత్ర గురించి ఉండవలసిన స్పృహ, అవగాహన పవన్‌కు లేకపోవడమే.

ఎన్నో ఇజాలు ఉన్నాయి (సోషలిజం, కమ్యూనిజం, నాజీయిజం, ఫాసిజం, నామోయిజం వగైరా). కాబట్టి తానూ ఒక ఇజాన్ని ప్రచారం చేసుకుందామనుకున్నాడేగానీ, ఆ ఇజం కోసం ఒక దిశను నిర్దేశించగల శక్తి అతనికి లేదని ఈ పుస్తకాన్ని చదివినవారు ఎవరైనా అభిప్రాయపడక తప్పదు. తనది పవనిజం అని ఏదో బులబాటంతో, పేరు బలంతో నెట్టుకు వెళ్లవచ్చునని నమ్మినట్టే కనిపిస్తున్నది తప్ప, అది సమాజం ముందు, సామాజికవేత్తల ముందు నిలబడుతుందా లేదా అన్న ఆలోచన మాత్రం మృగ్యం.

పవన్ తన రచనలో ఆదర్శవాదం అంటే ఏమిటో నిర్వచించలేకపోయాడు. 'సమాజాభ్యున్నతికి సైద్ధాంతిక పునాది' అవసరమని అందరూ పదే పదే రొడ్డకొట్టుడు కొట్టినట్టే ఆ పుస్తకంలో వల్లించాడేగానీ, ఆ పునాది ఏమిటో ఎలా ఉండాలో స్పష్టం చేయలేకపోయాడు. ఒకవేళ ఈ అంశం గురించి తెలిసి ఉన్నా చెప్పకపోవడం మభ్యపెట్టేందుకే.

అదెలాగంటే, శాస్త్రీయ సోషలిజానికి బద్ధ శత్రువులైన సంపన్న వర్గాలూ, వీరిని అంటిపెట్టుకుని ఎదిగే దోపిడీవర్గాలు, సమసమాజం గురించీ వర్గ రహిత సమాజం గురించీ కూడా తెలిసిన కొందరు కుహనా మేధావులు తమ ఉనికికి ఎసరు తెచ్చుకోరు. అలాంటి వారి భావజాలమంతా ఆకుకు అందని, పోకకు పొందని సిద్ధాంతాలకి పరిమితమయ్యేది ఇందువలనేనని మరచిపోరాదు. ఇంకా, ఆ భావజాలం తమ ఉనికిని ప్రశ్నించని సూత్రాలకే పరిమితమవుతుందని కూడా విస్మరించరాదు.

'సమాజాభ్యుదయం', 'సామాజిక న్యాయం' అంటూ నినాదం అందుకోని వాళ్లు ఈ రోజుల్లో బహు అరుదు. అవినీతి, లంచగొండితనం, ఆశ్రీత పక్షపాతం వంటి వాటితో పాటు, కింది వర్గాల వారి జీవితాలతో చెలగాటమాడడానికి అవకాశం కల్పిస్తున్న దోపిడీ వ్యవస్థతో కూడా రాజీపడకుండా పోరాడే వారి సంఖ్య కూడా ఈ రోజుల్లో అరుదే. ఈ అవలక్షణాలు ఉన్న ఈ వ్యవస్థను కూకటివేళ్లతో తొలగించడం నిజానికి అంత సులువైన పని కాదు.

ఇలాంటి వ్యవస్థకు స్వస్తిపలకడం అనేది వ్యాసాలతో, ఉపన్యాసాలతో, ప్రకటనలతో, లేదా అస్పష్టమైన సైద్ధాంతిక ప్రవచనాలతో స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఊదరతో జరిగే పని కాదని పవన్ పెందరాళే తెలుసుకోవడం మంచిది. నూతన వ్యవస్థ నిర్మాణానికి సకల వృత్తులకు చెందిన శ్రమ జీవులను చైతన్యవంతులను చేసి, సమాయత్త పరచగల శక్తులు మాత్రమే... అలాంటి త్యాగశీల రాజకీయ వాతావరణంలో ఆవిర్భవించే శక్తులు మాత్రమే దోపిడీ రహిత వ్యవస్థను నెలకొల్పగలరు. నెలకొల్పి కాపాడుకోగలరు. అంతేగానీ, గాలిలో పెట్టిన దీపాలు నిలవవు. కొడిగట్టుకు పోతాయి.

'పవనిజం' అంటే గాలివాటపు 'ఇజం'గా ఉండకూడదు. వ్యక్తిగత విషయాల్లో తనపై లేచిన దుమారానికి సమాధానం కోస మన్నట్టు ఎవడికి వాడు ఒక పార్టీని పెట్టడాన్ని సమాజం సహించదు! ''పైపై మార్పులకు ప్రయత్నించేకన్నా తన పునాది బలంగా ఉండాలని సమాజ పరిణామం కోరుకుంటుందని'' సాధారణీకరించుకున్నంత మాత్రాన పవన్ సైద్ధాంతిక పునాది నిలవదు. దానికి ముక్కూ, మోహం లేదు.

తనే ఒక మాటపై నిలవడు. తన 'జనసేన' పార్టీకీ తన ఈ పుస్తకానికీ సంబంధం లేదని ఒక చోట అంటాడు. ఆ వెంటనే 'ఇజం' తన పార్టీ ప్రాణాళికంటాడు! ఉదాహరణకుః 'ఆదర్శవాదమనే చెట్టుకు వేళ్లు ఆదర్శ భావ'నట.'సమాజనికి వేళ్లుగా పనిచేయటం ఆదర్శవాద సారాంశ'మట.


'మన భావాలు, ఆదర్శాలు ఇతరులకు వ్యాప్తి చేసి పంచుకోవా'లట! ఇదా, పవన్ ప్రపంచించే సమాజం, ప్రాపంచిక వ్యవస్థాను? ఇంతకూ 'ఆదర్శవాద వృక్షానికి పునాది వేరు' ఏదై ఉండా లట? ఇక్కడ దాచుకోలేకపోయాడు పాపం. ఆ పునాది వేరు, ఆ సిద్ధాం తం వేరు 'కాషాయం'గా (శాఫ్రాన్) ఉండాలట, అదే పవిత్రతకు చిహ్న మట ('ది రూట్ ఈజ్ డెపిక్టెడ్ బై శాఫ్రాన్ ఫర్ ఇట్స్ ప్యూరిటీ')! కానీ ఆ వేరు కనపడేదికాదట, దాని ప్రభావం మాత్రం బయటికి తెలుస్తూనే ఉంటుందట!

అంతేగాదు 'ఆదర్శ శూన్యులయిన వారి చేతుల్లో మతం అనేది ఎలాంటి నియంత్రణకు లొంగని క్రూరజంతువుగా' (అన్ కంట్రోలబుల్ మాన్ స్టర్) భావించిన పవన్, 2002 నాటి సుమారు రెండువందల మంది మైనారిటీల ఊచకోతకు బాధ్యుడైన నరేంద్ర మోడీకి ఎందుకు, ఎలా, ఏమాశించి 'జై' కొట్టవలసివచ్చిందో 145 పేజీల్లో తన ''ఇజం''గురించి రాసిన పుస్తకంలో వివ రించలేకపోయాడు!

వేలాది మంది రైతులను బాధ్యుల్ని చేసి ఆ భూముల్ని ఆదానీలకు, అంబానీ(రిలయన్స్) లాంటి బడాబడా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసి, రైతుల ఆత్మహత్యలకు దారితీసిన 'అభివృద్ధి'మంత్రం మోడీది అని పవన్‌కు తెలియకపోవటం దురదృష్టకరం! దేశ, విదేశ బహుళ జాతి గుత్త పెట్టుబడి వర్గాలకు సమస్థాయిలో చేతలు బారలు చూపి ఆర్థిక వ్యవస్థ నవనాడుల్ని పిం డుకునే అవకాశం కల్పించిన కాంగ్రెస్ - బీజేపీ - 'దేశం' పాలనా వ్యవస్థల్ని ఏ ముఖం పెట్టుకొని పవన్ సమర్థించడానికి సాహసించాడు? ఏ రంగంలోనైనా సరే కోట్లకు పడగలెత్తిన వారికి 'ఇజం'ల గురించి మాట్లాడే హక్కు లేదు!

'పవనం' అంటే గాలి. పవనిజం అంటే 'గాలి'సిద్ధాంతం! బహుశా ఇలాంటి వారిని. వారి మాటల్ని చూసే ప్రసిద్ధ ఫ్రెంచి కవి పాల్ ఎలార్డ్ ఇలా అని ఉంటాడు: 'ఔను మరి ధనిక వర్గాలన్నా/పోలీసు రాజ్యం అన్నా/నాకు విపరీతమైన ద్వేషం/అయితే వీటిని నేను/ద్వేషిస్తున్నంత తీవ్రంగా/ద్వేషించనివాణ్ని మరీ తీవ్రంగా ద్వేషిస్తాను...'! క్యాపిటలిజానికీ - క్రోనీ క్యాపిటలిజానికీ (పెట్టుబడిదారీ విధానానికీ, దానిపై ఆధారపడే వందిమాగధ పెట్టుబడి వ్యవస్థకు) మధ్య తేడా కూడా తెలీని బాపతు తలలెత్తటం ప్రజాస్వామ్యానికే చేటు. "

English summary
Saakshi is obviously feeling lot more irritated on Pawan Kalyan especially after the interview he gave to Eenadu questioning Jagan which has been recorded as one of the highest ever read article online on .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu