For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సంక్రాంతికి పట్టం కట్టిన తెలుగు సినిమా

  By Srikanya
  |

  తెలుగు వారికి, సంక్రాంతి పండుగకి విడతీయని బంధం. సంక్రాంతి నాటికి పల్లెల్లో పంటలు చేతికి రావడంతో కొత్త అల్లుళ్ళు, బంధుమిత్రులతో అనేక రకాలుగా సంబరాలు చేసుకుంటూ, విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఆ కాలక్షేపాలలో సినిమా ఓ భాగం. అందుకే సంక్రాంతికి తెలగు సినిమాలు విడుదల చేయటానికి నిర్మాతలు ఉత్సాహపడుతూంటారు. కేవలం థియోటర్లో...సంక్రాంతికి సినిమాలు చూపిస్తే సరిపోతుందా..వారు కనెక్టు కావాలంటే సినిమాల్లోనూ సంక్రాంతి సంబరాలు చూపించాలి. అప్పుడే సినిమా వారి జీవితంలో కలిసిపోతుంది. అందుకే దర్శక,నిర్మాతలు ఇంతకుముందు సంక్రాంతిని తమ సినిమాల్లో గ్రాండ్ గా చూపించేవారు. కొన్ని సినిమాలకు అయితే సంక్రాంతి అనే టైటిల్ కూడా పెట్టేసారు.

  'సంక్రాంతి' టైటిల్ తో 1952లో ఒకసారి, 2005 లో సినిమాలు వచ్చాయి. ఇక భోగిమంటలు (1981) పేరుతో ఒక సినిమా 'ఊరంతా సంక్రాంతి' (1983) పేరుతో మరో సినిమా వచ్చాయి. ఇలా సంక్రాంతి టైటిళ్లతో సినిమాలు తీయడమే కాకుండా వివిధ చిత్రాలలో అవకాసం వున్న మేరకు సంక్రాంతి సంబరాల సన్నివేశాలకు, గీతాలకు మన సినీ దర్శక నిర్మాతలు చోటిచ్చారు. ఆయా సందర్భాలకు అనుగుణంగా తెలుగు సినీకవులు సంక్రాంతి ఉత్సాహాన్ని పాటలలో నింపారు.

  సంక్రాంతి సినిమా పాటలలో కొన్ని పూర్తిగా ఆ వేడుకలకు అద్దం పట్టేవయితే - మరికొన్ని పల్లవులకో ఒకటి రెండు చరణాలకో పరిమిత మయ్యేవి. ఇటీవల వచ్చిన పాటలలో శృంగారాన్ని సంక్రాంతి సింగారాలనూ ముడిపెట్టినవి ఎక్కువ. అయితే ఆధునికత కారణంగా జన జీవనంలోనే కాక సినిమాల్లోనూ మార్పులు సంభవించంటంతో నేటి సినిమాల్లో సంక్రాంతి సంబరాలు కనిపించడమూ అరుదైపోయింది. అందుకే అప్పటి సినిమాల్లో సంక్రాంతికి సంభందించిన విషయాలు ఓ సారి గుర్తు చేసుకుందాం.

  Sankranthi

  తెలుగు సినిమాలలో సంక్రాంతికి సంబంధించిన తొలి పాట 'రక్షరేఖ' (1949) చిత్రంలో పెట్టారు. పద్మనాభన్‌ ప్రొడక్షన్స్‌ పతాకాన ఆర్‌. పద్మనాభన్‌ దర్శకత్వంలో రూపొందగా బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన ఈ పాట చిత్ర ప్రారంభంలోనే రాజ్యమంతా సంక్రాంతి వినోదాలతో ఆనందించే సందర్భంగా చిత్రీకరింపబడింది. 'పండుగ పొంగళ్ళు గంగమ్మా! పాలవెల్లి పొంగళ్లు, కమ్మ పాయసాలు పొంగే ఆరగింపు గంగమ్మ తల్లి' అనే పల్లవితో ప్రారంభమయయే ఈ పాట చరణాల్లో చెరుకుతీపి, గోమాత పవిత్రత, రాట్నం విశిష్టత, రంగుల రాట్నం సరదాల వర్ణన వుంది.

  సి. పుల్లయ్య దర్శకత్వం వహించిన 'సంక్రాంతి' 1952 చిత్రానికి బలిజేపల్లి రాసిన 'జేజేలమ్మా జేజేలు - సంక్రాంతిలక్ష్మికి జేజేలు బాజాలు, భజంత్రీలు - సంక్రాంతి లక్ష్మికి జేజేలు' అనే పాట అప్పట్లో మురిపించింది. ఈ పాటతో పాటు చిత్ర ప్రారంభంలో వున్న వీధి భాగవతంలో కూడా సంక్రాంతి ప్రసక్తి వుంది.

  'క్రాంతి, ఈనాడు మకర సంక్రాంతి వెలుగొందు మా నృత్యకాంతి మము జూడ మీకు విభ్రాంతి మా కోరికలకు తచ్ఛాంతి, కలిగితే మీకు విశ్రాంతి...' అనే వాక్యాలు చిత్రం క్లైమాక్స్ లో మళ్లీ వస్తాయి.

  టి. ప్రకాశరావు దర్శకత్వంలో పీపుల్స్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన 'పల్లెటూరు' (1952) చిత్రంలో కూడా సుంకర వాసిరెడ్డి రచించిన ఆరు చరణాలు గల సుదీర్ఘమైన సంక్రాంతి సంబరాల పాట వుంది.

  వచ్చిందోయ్‌ సంక్రాంతి, విచ్చెను నూతనకాంతి.... ధిం తక థిన, తక ధిన, ధిం తక థిన తక ధిన...

  అంటూ రసవత్తరంగా ఈ పాట సాగుతుంది. ఈ పాటలో ఆకాశాన్ని అంటే మంటలు, బంగారపు పంటలు, ముగ్గుల మురిపాలు, కోకిలలు-కొత్తకాంతులు, గొబ్బిళ్లు, కోడిదూడలు, హరిభజనలు.. మొదలైన అనేక అంశాలు తొంగిచూస్తాయి.

  నాగయ్య దర్శకత్వంలో అవరిండియా నిర్మించిన 'నా యిల్లు' (1953)లో దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుంచి వెలువడిన గీతం కూడా పూర్తిగా సంక్రాంతి శోభకు అందంగా రసరమ్యంగా వర్ణిస్తుంది.

  గొబ్బిళ్లో గొబ్బిళ్లో

  వచ్చెనమ్మ సంక్రాంతి, పచ్చని వాకిట చేమంతి

  ముంగిట రంగుల ముగ్గుల్లో, ముద్ద బంతి మొగ్గల్లో

  ముద్దియ లుంచే గొబ్బిళ్ళో... - అంటూ పల్లవితో సాగే ఈ పాట మొదటి చరణంలో జనప చేలు, సెనగ పూలు, కాపుల పొలికేకలు, పైర గాలికి పళ్లిక లెత్తే పడుచుల విలాసాలు వర్ణింపబడితే రెండు మూడు చరణాల్లో గృహ సంబంధమైన వేడుకలు అందంగా కళ్లకు కట్టినట్లు వివరించారు.

  దాసరి నారాయణ రావు ...దర్శకత్వం వహించిన 'ఊరంతా సంక్రాంతి' (1983) చిత్రానికి డా. దాసరి నారాయణరావు సమకూర్చిన పాట కూడా పెద్ద పండుగకు పెద్దపీట వేసిందే.

  'సంబరాల సంకురాతిరి ఊరంతా పిలిచింది

  ముత్యాల ముగ్గుల్లో, ముద్దబంతి గొబ్బిళ్ళో

  ఆడ - మగ ఆడి పాడే పాటల్లో

  ఏడాదికో పండగ

  బ్రతుకంతా తొలి పండుగ' - అంటూ నడిచే ఈ పాట చిత్రంలో హైలెట్ గా నిలిచింది. సంక్రాంతి సంబరాలను పూర్తి స్ధాయిలో ఆవిష్కరిస్తుంది.

  శరత్‌ దర్శకత్వంలో తయారైన 'పండగ' (1998) చిత్రం కోసం చంద్రబోస్‌ రాసిన పాటలో కూడా సంక్రాంతి ప్రస్దావన ఉంటుంది.

  'ముద్దబంతులు మువ్వమోతలు

  నట్టింటి కాలుపెట్టు పాడిపంటలు

  వెండి ముగ్గులు పైడి కాంతులు

  పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు...'

  ఈ పాట రిలీజైన కొత్తలో అంతటా మారుమ్రోగింది

  అంతేగాక...

  విక్రమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకాన బి.ఎస్‌.రంగా నిర్మించి దర్శకత్వం వహించిన 'కుటుంబ గౌరవం' చిత్రంలోని చివరిపాట నాయిక నాయకులపై కోరస్‌తో చిత్రీకరింపబడింది. 'అనిసెట్టి' కలం నుంచి వెలువడిన ఈ పాటలోని

  'పాడవోయి రైతన్నా ఆడవోయి మా యన్నా

  పంటలింటి కొచ్చె నేడు పండుగ

  మన పల్లెలోన సంతసాలు నిండగ' - అనే పల్లవితో పాటు- సంకురాత్రి సమయంలో - చలిమంటలు వేద్దామోయ్‌ - పాటలో సంక్రాతిని రస రమ్యంగా మన కళ్ళ ముందు ఉంచుతారు.

  'గుళ్లోపెళ్లి' చిత్రంలో కూడా అనిసెట్టి రాసిన, పిఠాపురం పార్టీ గానం చేసిన బృందగానం వుంది.

  బృందం: ఒలియొ... ఒలియొ... ఒలియొ పాలకాడ - హేయ్‌య

  యువకులు: ఓ అన్నలార రై తన్నలార

  రతనాల రాజనాల రాశిపోయండి

  ఆట లాడండి - అహ... పాట పాడండి

  రతనాల రాజనాల రాశిపోయండి - ఇందులో రైతు, ధాన్యలక్ష్మి పాత్రలున్నాయి. ఈ గేయంలో రైతును లోకనేతగాను, ధాన్యలక్ష్మిని దేవతగాను గీత రచయిత అభివర్ణించారు.

  వీటికి తోడు.... సంక్రాతి పాటకు సందేశాన్ని సమకూరుస్తూ...

  వి.ఎన్‌. రెడ్డి దర్శకత్వంలో ఆర్‌.ఆర్‌.పిక్చర్స్‌ వారి 'ఇంటికి దీపం ఇల్లాలే' (1961) చిత్రంలో సంక్రాంతి పాటలకు ఆత్రేయ ఓ విలక్షణమైన పాటను రాశారు.

  ఆడ|| పొంగి పొంగి వచ్చినది సంబరాల సంక్రాంతి

  సంపదలు పెంపు చేయు సంక్రాంతి...

  అహహ.. సంపదలు పెంపు చేయు సంక్రాంతి

  ఆడ-మగ|| పాటుబడి రాటుబడి పండించే రైతులంతా

  పండుగ నాడు ప్రమాణాలు చేయాలి - అహ పాడుగుణ మొకటైనా విడవాలి ||పొంగి||

  'ఉండమ్మా బొట్టుపెడతా' (1968) చిత్రంలో దేవులపల్లి రచన సంక్రాంతి సినీ గీతాలకే మకుటాయమానమైనది.

  'రావమ్మా మహలక్ష్మి రావమ్మా

  రావమ్మా మహలక్ష్మి రావమ్మా

  నీ కోవెల ఈ యిల్లు కొలువై ఉందువుగాని

  కొలువై వుందువుగాని - కలముల రాణి ||రావమ్మా||' - ఈ పాట ఇప్పటికీ మారు మ్రోగుతూంటుంది.

  ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన 'సోగ్గాడి పెళ్ళాం' (1996) చిత్రంలో భువనచంద్ర రాసిన-

  'సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా

  కొత్త ధాన్యాలతో కోడి పందాలతో, ఊరే ఉప్పొంగుతుంటే

  ఇంటింటా.. ఆ... ఆ... పేరంటం, ఊరంతా... ఆ... ఆ... ఉల్లాసం

  కొత్త అల్లుళ్లతో కొంటె మరదళ్లతో, పొంగే హేమంత సిరులు..' - అంటూ సాగే ఈ పాటలో పల్లెల్లోని నైర్మల్యం గురించి అద్బుతంగా రాసారు.

  పి.సి.రెడ్డి దర్శక్తం వహించిన 'భోగిమంటలు' చిత్రంలో ఎ బావామరదళ్ల ముచ్చట్లను సంక్రాతితో కలిపి.... ఆత్రేయ ఇలా -

  భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో

  భోగిమంటల భోగుల్లో...

  బావల వీపుల తప్పట్లోయ్‌ కాగిన కొద్దీ చప్పట్లోయ్‌-

  మోగిన కొద్దీ ముచ్చట్లోయ్‌ మరదళ్ళ బుగ్గలు బొబ్బట్లోయ్‌ అని

  దొరికేదాకా ఇక్కట్లోయ్‌ - బొబ్బట్లో దిబ్బట్లోయ్‌.

  రాజా చంద్ర దర్శకత్వంలో తయారైన 'ముగ్గురు మిత్రులు' (1985) చిత్రంలో వేటూరి ...

  'సంబరాలు సంబరాలు సంకురాత్రి సంబరాలు

  కోలో కోలో కోలాటము - కోకా రైకా చెలగాటము

  చిన్నా పెద్దా శ్రీమంతము - గుళ్లో గంటల సంగీతము

  మా లచ్చి మొస్తుంటె పేరంటము

  మాగాణి చేలల్లొ పేరంటము.

  ఎ.కోదండరామిరెడ్డి డైరక్ట్‌ చేసిన 'రాముడొచ్చాడు' (96) చిత్రంలోనూ వేటూరి మరోసారి అద్బుతంగా..

  మా పల్లె రేపల్లంట - ఈ పిల్లే రాధమ్మంట

  రేగుతుంటె భోగిమంట - రేగు పళ్ల విందులంట

  ... ... ...

  మంచ మేస్తె సంకురాత్రి తిరునాళ్ళలో

  పల్లె పచ్చగా పిల్ల వెచ్చగా వుండే పండగ.

  వెంకటేష్... 'సంక్రాంతి' (2005) పేరుతో వచ్చిన చిత్రంలో కూడా ఆ సంబరాలకు సంబంధించిన పూర్తి నిడివి పాటలేదు! కుటుంబ సభ్యుల మమతాను రాగాలను చాటే పాటలో ఒక చరణంలో మాత్రం సంక్రాంతి చోటు చేసుకొంది. ఆ బృందగీతాన్ని ఇ.యస్‌. మూర్తి ఇలా రాశారు.

  ఆనందాలె వెల్లువైతే కళ్లలోన

  అనురాగాలె నిండిపోవా గుండెలోన

  మమతల మాలల తెచ్చి ఆ కలతలనే చెరిపేసి

  ముంగిట ముగ్గులు పెట్టి

  గొబ్బెమ్మల కొలువే చేసి

  మనమంతా చేరి ఆడిపాడే కల

  సంక్రాంతి పండగ చేద్దామా?

  సన్నాయి పాటలు విందామా?

  బాపూ...ముత్యాల ముగ్గు సినిమాల్లో...సంక్రాతిపై ప్రత్యేకంగా పాటలు లేకపోయినా....

  గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మడి, గోగులు దులిపే వారెవరమ్మా ఓ లచ్చా గుమ్మడీ, ముంగిట వేసిన ముగ్గులు చూడు, ముత్యాల ముగ్గులు చూడు అంటూ సి నారాయణ రెడ్డి,

  'ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తయిదు కుంకుమ బ్రతుకంత ఛాయ. ఆర నైదో తనము ఏ చోట నుండు, అరుగులలికే వారి అరచేత నుండు, తీరైన సంపద ఎవరింట నుండు, దినదినము ముగ్గున్న లోగిళ్ళనుండు..., గోవు మాలక్ష్మికి కోటి దండాలు, కోరినంతా పాడి నిండు కడవల్లు, మొగుడు మెచ్చిన చాలు కాపురంలోన' అంటూ ఆరుద్ర 'ముత్యాలముగ్గు' కోసం రాసిన పాటల్లో సంక్రాంతి వైభవం దర్శంప చేసారు.

  అలాగే...

  బొబ్బిలియుద్ధం చిత్రంలో జమునతో చిత్రీకరించిన ఆరుద్ర రాసిన 'ముత్యాల చెమ్మచెక్క, రత్నాల చెమ్మచెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా, కలకల కిల నవ్వులతో గాజుల గలగలలాడ, ఒప్పుల కుప్ప వయ్యారిభామ, సన్నబియ్యం చాయపప్పు చిన్నిమువ్వ సన్నగాజు, కొబ్బిరికోరు బెల్లపచ్చు, గూట్లో రూపాయి నీ మొగుడు సిపాయ్‌' సంక్రాంతి సమయంలో కన్నె పిల్లల సందడిని గుర్తు చేస్తుంది.

  ఇలా తెలుగు సినిమా పాటల్లో సంక్రాంతి అప్పుడప్పుడూ తొంగి చూస్తే తెలుగు జాతికి గత వైభవాన్ని గుర్తు చేస్తూ ఉత్సాహపరుస్తూనే ఉంది.

  English summary
  Telugu film world has given fue importance to Sankranthi festival. Songs in films depicts the importance Sankranthi festival.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X