»   » ఇది మామూలు స్కామ్ కాదు బాబోయ్

ఇది మామూలు స్కామ్ కాదు బాబోయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హిందీ, తెలుగు, తమిళ వినోద ఛానెళ్ల ప్రసారాలను హైదరాబాద్‌ కేంద్రంగా ఓ వ్యాపారి హైజాక్‌ చేస్తున్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రసారాలను ఆరు సెకన్ల తేడాతో ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్‌, అరబ్‌దేశాలు సహా 125 దేశాల్లో ప్రసారం చేస్తున్నారు. అంటే... హైదరాబాద్‌లో మా, జెమినీ టీవీల్లో ప్రసారమవుతున్న కార్యక్రమం ఆరు సెకన్ల తేడాతో విదేశాల్లో అనధికారికంగా ప్రసారమతువుంది. నాలుగైదేళ్లుగా అత్యంత గోప్యంగా ఈ వ్యవహారం కొనసాగుతోంది.

తమ అనుమతి లేకుండా అక్కడ ప్రసారాలు అవుతుండడంతో అనుమానం వచ్చిన టీవీ ఛానెళ్ల యాజమాన్యాలు అమెరికాలో ఫిర్యాదు చేయగా... ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. సైబర్‌ విభాగం పోలీసులు వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని తిరుమలగిరిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇదంతా జరుగుతోందని గుర్తించారు. అక్కడున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన నిందితుడు సుమిత్‌ అహుజా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. టీవీ సంస్థల యాజమాన్యాలు ఫిర్యాదు మేరకు ప్రాథమికంగా రూ.1500 కోట్ల నష్టం ఉంటుందని ఒక పోలీస్‌ ఉన్నతాధికారి వివరించారు.

జాదూటీవీ పేరుతో సుమిత్‌ అహుజా ఏడేళ్ల క్రితం ఒక కేబుల్‌ నెట్‌వర్క్‌ను ప్రారంభించాడు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ముఖ్యంగా తెలుగు, హిందీ, మరాఠీ, తమిళులను లక్ష్యంగా చేసుకుని దీన్ని ఆరంభించాడు. అమెరికా, దుబాయి, సౌదీ అరేబియా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సహా సుమారు 125 దేశాల్లో ఉన్న భారతీయులకు సెట్‌టాప్‌ బాక్స్‌ ద్వారా 150 ఛానెళ్లను ప్రసారం చేస్తానంటూ చెప్పాడు. తొలుత దుబాయి, సౌదీఅరేబియా దేశాల్లోని నగరాల్లో సెట్‌టాప్‌ బాక్సులను విక్రయించాడు. ఒక్కో బాక్సు అప్పట్లో 200 అమెరికన్‌ డాలర్లకు విక్రయించాడు. దీంతో అక్కడి భారతీయులు జాదూ టీవీకి ఆకర్షితులయ్యారు.

Telugu tv Channels compliant on Jaadu Tv

అనంతరం యూరప్‌, అమెరికాను లక్ష్యంగా చేసుకుని అక్కడ సెట్‌టాప్‌ బాక్స్‌లను జాదూ1 పేరుతో 250 అమెరికన్‌ డాలర్లకు విక్రయించాడు. అక్కడా ఆదరణ లభించడంతో సుమారు లక్షకుపైగా సెట్‌టాప్‌ బాక్సులను అమ్మేశాడు. అనంతరం న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, జపాన్‌, దక్షిణ, ఉత్తర కొరియాలకు వెళ్లి అక్కడ జాదూ2 టీవీ పేరుతో యాభైవేలకుపైగా బాక్సులను 300 అమెరికన్‌ డాలర్లకు విక్రయించాడు. టీవీ ఛానెళ్ల యాజమాన్యాలకు ప్రసార హక్కుల కోసం కేబుల్‌ నెట్‌వర్క్‌, డిష్‌టీవీలు రాయల్టీ ఇస్తున్నాయి.

అంతర్జాలంలో యూట్యూబ్‌ లేదా ఇతర వెబ్‌సైట్‌లో టీవీ ప్రసారాలు వచ్చినా... వైయూపీ(యుప్‌) అనే సంస్థ ద్వారా వస్తున్నాయి. యుప్‌ సంస్థ రాయల్టీ చెల్లిస్తోంది. జాదూ టీవీ పేరుతో టీవీ ప్రసారాలు చేస్తున్న అహుజా టీవీ యాజమాన్యాలకు ఒక్క పైసా చెల్లించడం లేదు. మూడేళ్ల క్రితమే జీటీవీ నెట్‌వర్క్‌ ఈ విషయమై అమెరికాలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే తమ వద్ద నుంచి అధికారికంగా ప్రసారం కావడం లేదంటూ న్యాయస్థానం తెలిపింది. ఎలాగైనా ప్రసారాలు ఆపాలంటూ జీ నెట్‌వర్క్‌ సంస్థ కోరగా... ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

కంప్యూటర్లు, అంతర్జాలం, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా టీవీ ఛానెళ్లను హైజాక్‌ చేస్తున్న సుమిత్‌ అహుజా... జాదూ టీవీ సెట్‌టాప్‌ బాక్సులను విక్రయించేందుకు విదేశాల్లో డిపార్ట్‌మెంట్‌ స్టోర్లు, స్థానిక టెలిఫోన్‌ నెట్‌వర్క్‌ను ఎంచుకున్నాడు. హైదరాబాద్‌, ఢిల్లీలో బాక్సులను తయారు చేసి ఎంపిక చేసుకున్న నగరాల్లో డిపార్ట్‌మెంట్‌ స్టోర్లకు పంపాక... వారికి ఒక్కో బాక్స్‌కు 20 అమెరికన్‌ డాలర్ల నుంచి 40 అమెరికన్‌ డాలర్ల వరకూ కమిషన్‌ ఇస్తున్నాడు. అనంతరం స్థానిక టెలిఫోన్‌ నెట్‌వర్క్‌ ద్వారా ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు. ఇందుకోసం సుమిత్‌ అహుజా నలుగురు వ్యక్తులను నియమించుకున్నాడు.

ఇదంతా గుట్టుగా కొనసాగుతుండగా... మాటీవీ, జెమినీ టీవీ ప్రతినిధులు శుక్రవారం ఫిర్యాదు చేయడంతో... పోలీసులు తీగ లాగగా... డొంకంతా బయటపడింది. ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల బృందం వెళ్లి సుమిత్‌ అహుజా కార్యాలయాన్ని సీజ్‌ చేసింది. అక్కడున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... తాము చేస్తున్న మోసాన్ని వివరించాడు. మరింత లోతుగా పరిశీలించాలన్న భావనతో పోలీస్‌ అధికారులు వివరాలను వెల్లడించలేదు. ఆదివారం ఈ భారీ జాదూకు సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతమయ్యే అవకాశాలున్నాయి.

English summary
Maatv and Gemini tv made a compliant on Sumith Ahuja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu