Home
కథా రచయిత జనార్దన మహర్షి దర్శకుడిగా మారి రూపొందిస్తున్న గోపి - గోడ మీద పిల్లి - చిత్రంలో ఇప్పుడొక ప్రధాన ఆకర్షణ వచ్చి చేరింది. అదీ రంభ రూపంలో. చాలాకాలంగా తెలుగులో బేరాల్లేక భోజ్‌పురి చిత్రసీమలో బిజీ అయిపోయిన రంభకు దర్శకుడు మహర్షి నుంచి ఫోన్ రావడంతో ఆమె పాత్ర ఏమిటి? ఎందుకు? అని కూడా అడక్కుండానే ఓకె చెప్పేశారు.
గోపి చిత్రంలో అల్లరి నరేశ్ హీరో కాగా, ఒక ముఖ్యమైన పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. కథానుసారం ఈ చిత్రంలో గోపి క్షణానికో అవతారం మార్చేస్తూ, జనాన్ని ఏమారుస్తూ బతికేస్తుంటాడు. ఇది చూసి వైకుంఠంలో మహాలక్ష్మి విష్ణుమూర్తితో - మీరూ ఉన్నారు.. ఒక్కో అవతారం ఎత్తాలంటే ఒక్కో యుగం పడుతుంది. అక్కడ గోపి చూడండి.. నిమిషానికో అవతారం ఎత్తేస్తున్నాడు.. అని ఎత్తిపొడుస్తుంది. విష్ణుమూర్తి కూడా అవాక్కయి గోపి అవతారాల్ని ఎలా ఆసక్తిగా చూశాడనేది ఇతివృత్తం.
ఇందులో విష్ణుమూర్తిగా సురేశ్, లక్ష్మీదేవిగా రంభ నటిస్తున్నారు. ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా ఉంటుందని దర్శకుడు జనార్దన మహర్షి చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











