»   » కమెడియన్ వేణు మాధవ్ మరీ ఇంతగానా...

కమెడియన్ వేణు మాధవ్ మరీ ఇంతగానా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'నీకు బాగా బలుపు, నోటి దురుసు ఎక్కువ' అంటే ఎవరికైనా కోపం వస్తుంది. అయితే టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్ మాత్రం అస్సలు ఫీలవ్వరు. పైగా ఆయన్ను ఎవరైనా ఇలా అంటే హ్యాపీగా ఫీలవుతారు కూడా. ఇది మేమేదో కామెడీకి అనడం లేదు.... ఈ విషయాన్ని వేణు మాధవ్ స్వయంగా వెల్లడించారు. ఓ పత్రిక ఇంటర్వ్యూలో వేణు మాధవ్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

తాను చనిపోయినట్లు ఇటీవల జరిగిన ప్రచారం చాలా బాధించిందని వేణు మాధవ్ తెలిపారు. "ఆ ప్రచారం జరిగినపుడు నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి సరిపోయింది. నేను ఎక్కడైనా బయట ఉంటే, ఆ సమయంలో నా ఫోన్ కలవకపోతే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంత ఆందోళన చెందుతారో ఒక్కసారి ఆలోచించండి. కొందరైతే నాకు ఫోన్ చేసి మూడో రోజు, పదకొండో రోజు కర్మ ఎప్పుడు అంటూ అడిగారు. ఇలాంటి వార్తలు విన్నపుడు నా భార్య, మా అమ్మ ఒకటే ఏడుపు. ఇలాంటి విని నేను భరించ గలను. కానీ నా కుటుంబ సభ్యులు బాధ పడుతుంటే భరించలేను" అంటూ తన మనసులోని మాట బయట పెట్టారు వేణు మాధవ్.

ఏమిటీ... ఈ మధ్య సినిమాలు చేయడం లేదు? అవకాశాలు రావడం లేదా? మీరు ఇంట్లోనే ఉంటే అవకాశాలు ఎవరిస్తారు? వెళ్లి ప్రయత్నం చేయవచ్చు కదా? అనే ప్రశ్నకు వేణు మాధవ్ తనదైన రీతిలో స్పందించారు. "ఛీ..ఛీ.... వేణు మాధవ్ అలాంటి వాడు కాదు. ఒకరి దగ్గరకు వెళ్లి సినిమా అవకాశాలు అడుక్కునే అవసరం నాకు లేదు. నా జీవితంలో ఎప్పుడూ అవకాశాల కోసం ప్రయత్నించ లేదు. అవకాశాలే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి" అన్నారు.

Venu Madhav interesting comment about film industry

"ఈ మధ్య కావాలనే సినిమాలు చేయడం లేదు. అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్న పాత్రలే వస్తున్నాయి. నేను నాకుటుంబం, బంధువులతో కలిసి చూడదగ్గ మంచి పాత్రలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాలో, బాలయ్య 100వ సినిమాలో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేస్తున్నాను. ఈ సినిమాలో మంచి పాత్రలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి" అని వేణు మాధవ్ తెలిపారు.

మీ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరిని హీరోను చేస్తారు అని అడగ్గా.... "నా పిల్లలను సినిమా పరిశ్రమకు దూరంగా ఉంచుతున్నాను. నాకు ఇంట్రస్టు లేదు. వారిని బాగా చదివిస్తా. వారు ఎంత చదువుతానన్నా చదివించే స్థోమత నాకు ఉంది. ఇన్నాళ్లు సినిమాలు చేయడం ద్వారా కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేంతగా సంపాదించాను. ఇంటర్మీడియట్ వరకు నేను వారిని గైడ్ చేస్తాను. ఆ తర్వాత వారు చదువు పరంగా వారు ఏ రంగంలోకి వెళతానన్నా వారి ఇష్టానికే వదిలేస్తాను. ఒక వేళ వాళ్లు సినిమా రంగంలోకే వస్తానంటే.. అది వాళ్ల ఇష్టం. కాదనను" అన్నారు వేణు మాధవ్.

English summary
Tollywood comedian Venu Madhav interesting comment about film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu