బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పసిడిప్రియులు కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం నిల్వలకు సంబంధించిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో రాబోయే 15 రోజులు అత్యంత ముఖ్యమైనవిగా తెలిపింది. కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా తగ్గించాయని నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక పరిస్థితుల రాబోయే రోజుల్లో Gold ధరలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని WGC తెలిపింది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026 ప్రారంభంలో కేంద్ర బ్యాంకుల Gold కొనుగోళ్ల వేగం గణనీయంగా తగ్గింది. గత 12 నెలల్లో సగటున నెలకు 27 టన్నుల బంగారం కొనుగోలు జరగగా.. జనవరి నెలలో నికర కొనుగోళ్లు కేవలం 5 టన్నులకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇది దాదాపు 80 శాతం తగ్గుదలగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ మందగమనానికి ప్రధాన కారణాలుగా Gold ధరల్లో తీవ్ర అస్తిరత, సెలవుల సీజన్ ప్రభావంను నిపుణులు పేర్కొంటున్నారు. ధరలు ఎప్పటికప్పుడు మారుతుండటంతో, కొన్ని కేంద్ర బ్యాంకులు తాత్కాలికంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది. అయినప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం వల్ల, మధ్యకాలం నుంచి దీర్ఘకాలంలో బంగారం ప్రాధాన్యం మరింత పెరుగుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల 2026లోనూ ఆ తర్వాత కూడా కేంద్ర బ్యాంకుల బంగారం సేకరణ కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జనవరిలో నమోదైన బంగారం కొనుగోళ్లు కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఈ జాబితాలో ఉజ్బెకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ కీలక పాత్ర పోషించింది. ఈ దేశం ఒక్క జనవరిలోనే 9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అక్టోబర్ 2025 నుంచి ప్రారంభమైన కొనుగోళ్ల శ్రేణిని కొనసాగిస్తూ.. ఉజ్బెకిస్తాన్ తన బంగారు నిల్వలను 399 టన్నులకు పెంచుకుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 2020లో ఉజ్బెకిస్తాన్ మొత్తం విదేశీ నిల్వల్లో బంగారం వాటా 57 శాతం కాగా.. 2026 జనవరి నాటికి ఇది 86 శాతానికి చేరుకుంది. ఇది ఆ దేశం బంగారాన్ని ఎంత వ్యూహాత్మకంగా చూస్తుందో స్పష్టంగా చూపిస్తోంది.
బంగారం, వెండి కొనకపోయినా మీ జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. ధరలు పెరిగితే తడిసి మోపేడే మీకు..
జనవరిలో బ్యాంక్ నెగరా మలేషియా 3 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది 2018 తర్వాత ఆ దేశం చేసిన మొదటి బంగారం కొనుగోలు కావడం విశేషం. దీని ద్వారా మలేషియా బంగారు నిల్వలు 42 టన్నులకు చేరుకున్నాయి. ఇది మొత్తం నిల్వల్లో దాదాపు 5 శాతంగా చెప్పవచ్చు. ఇక చెక్ రిపబ్లిక్, ఇండోనేషియా ఒక్కొక్కటి 2 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా.. చైనా, సెర్బియా ఒక్కొక్క టన్ను చొప్పున బంగారాన్ని సేకరించాయి. చైనా వరుసగా 15 నెలలుగా బంగారం కొనుగోలు చేస్తూ.. తన మొత్తం నిల్వల్లో బంగారం వాటాను దాదాపు 10 శాతానికి పెంచుకుంది.
మరోవైపు జనవరిలో రష్యా అతిపెద్ద నికర విక్రేతగా నిలిచింది. బ్యాంక్ ఆఫ్ రష్యా ఈ నెలలో 9 టన్నుల బంగారాన్ని విక్రయించింది. అలాగే బల్గేరియన్ నేషనల్ బ్యాంక్ యూరోను స్వీకరించే ప్రక్రియలో భాగంగా.. 2 టన్నుల బంగారాన్ని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌కు బదిలీ చేసింది. కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ కూడా తమ బంగారు నిల్వలను ఒక్కొక్క టన్ను చొప్పున తగ్గించుకున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాబోయే 10 నుంచి 15 రోజులు చాలా కీలకమైనవిగా చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం, దౌత్యపరమైన పరిష్కారానికి స్పష్టమైన సంకేతాలు లేకపోవడం వల్ల.. భౌగోళిక రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశముందని చెబుతున్నారు.
2022 నుంచి కేంద్ర బ్యాంకులు వేగంగా బంగారం సేకరించడం.. మారుతున్న ప్రపంచ ఆర్థిక, రాజకీయ దృశ్యానికి సంకేతంగా నిపుణులు చూస్తున్నారు. కరెన్సీలపై నమ్మకం తగ్గినప్పుడు బంగారం మళ్లీ అత్యంత భద్రమైన ఆస్తిగా కేంద్ర బ్యాంకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అందువల్ల, తాత్కాలిక మందగమనమైనా, దీర్ఘకాలంలో కేంద్ర బ్యాంకుల బంగారం డిమాండ్ బలంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
Credit: Goodreturns


Click it and Unblock the Notifications











