అల్లు అర్జున్ - అట్లీ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్? రిలీజ్‌కు ముందే AA22కి రికార్డ్ బిజినెస్!
పుష్ప 2 ది రూల్ తర్వాత ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ క్రేజ్, మార్కెట్ ఎంతో పెరిగిన సంగతి తెలిసిందే. ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా.. బన్నీ కెరీర్‌లో 22వ చిత్రం కాగా.. అట్లీ కెరీర్‌లో 6వ చిత్రం. దాంతో AA22xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను పిలుస్తున్నారు. ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఓ క్రేజ్ న్యూస్ వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ - అట్లీ మూవీ బడ్జెట్ ఎంత?
కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమలో కనిపించని సాంకేతిక పరిజ్ఞానం, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారట. సమాంతర ప్రపంచం, పునర్జన్మల కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్సన్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని చెబుతున్నారు.

ముంబైలో ఫస్ట్ షెడ్యూల్
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా.. తొలి షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. దాదాపు 3 నెలల పాటు అల్లు అర్జున్ ఇతర యూనిట్ సభ్యులు అక్కడే ఉంటూ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఆ తర్వాత వీఎఫ్ఎక్స్ పనుల కోసం చిత్ర యూనిట్ అమెరికా వెళ్లనుందని టాక్. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్నందున దేశంలోని అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్స్‌తో పాటు పాటు హాలీవుడ్ నటులు కూడా అల్లు అర్జున్ - అట్లీ మూవీలో నటిస్తున్నారని చెబుతున్నారు.
ఆ టైటిల్ ఫిక్స్ అయినట్లేనా?
ఇక ఈ సినిమా టైటిల్ ఏంటీ అన్నది కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఐకాన్, సూపర్ హీరో తదితర పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గతంలో అల్లు అర్జున్‌తో వకీల్ సాబ్ ఫేమ్, దర్శకుడు వేణు శ్రీరామ్ ఐకాన్ అనే పేరుతో ఓ సినిమా తీయాలని అనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టడంతో ఐకాన్ అన్న టైటిల్‌కు టెక్నికల్‌గా ఎలాంటి ఆటంకాలు లేవు. మరోవైపు.. ప్రతి సినిమాకు వైవిధ్యంగా కనిపించే అల్లు అర్జున్ .. ఈ సినిమాలోనూ కొత్తగా ప్రేక్షకులను పలకరిస్తారని చెబుతున్నారు. పలు విభిన్న గెటప్స్‌లో ఆయన కనిపిస్తారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.
రిలీజ్‌కు ముందే భారీ డీల్
ఇదిలాఉండగా.. సెట్స్ మీదకి వెళ్లకుండానే అల్లు అర్జున్ - అట్లీ మూవీకి రికార్డ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మూవీ ఆడియో, శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకునేందుకు బడా సంస్థలు పోటీ పడుతున్నాయట. ముఖ్యంగా ఈ చిత్రం ఓటీటీ రైట్స్ కోసం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దూకుడుగా ముందుకు వెళ్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్, అట్లీ, అల్లు అరవింద్ తదితరులతో నెట్‌ఫ్లిక్స్ టీమ్ భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. దీంతో కొన్ని వందల కోట్ల రూపాయల డీల్‌తో అల్లు అర్జున్ - అట్లీ మూవీ డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లేనని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ.. బన్నీ మూవీపై అంచనాలను ఇది మరింత పెంచేస్తోంది.


Click it and Unblock the Notifications











