Lilo and Stitch: 9 వేల కోట్ల కలెక్షన్స్‌తో సంచలనం.. సైలెంట్‌గా తెలుగులోకి, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర మంచి గిరాకీ ఉంటుంది. హాలీవుడ్ నుంచి వచ్చే హార్రర్, కామెడీ, సస్పెన్స్, యాక్షన్ సినిమాలను భారతీయ ప్రేక్షకులు ఎంతో ఇష్టపడతారు. ఈ సినిమాలకు భారత్‌లోనూ కోట్లలో వసూళ్లు వస్తుంటాయి. ఒక్కసారి కనుక భారతీయులకు సినిమా నచ్చిందా ఇక కనకవర్షమే. అందుకే దశాబ్ధాలుగా భారత్‌లో హాలీవుడ్ సినిమాలు సందడి చేస్తున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 9 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రం సైలెంట్‌గా తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే.
మే 23న విడుదలైన లిలో అండ్ స్టిచ్
డీన్ ఫ్లెచర్ కాంప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లిలో అండ్ స్టిచ్. వాల్ట్ డిస్నీ పిక్చర్చ్, రైడ్ బ్యాక్ బ్యానర్‌లపై జోనాథన్ ఎల్రిక్, డాన్ లిన్‌లు ఈ సినిమాను నిర్మించారు. దాదాపు 100 మిలియన్ డాలర్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. మే 23న వరల్డ్ వైడ్‌గా లిలో అండ్ స్టిచ్ చిత్రం రిలీజ్ అయ్యింది. సిడ్నీ ఎలిజబెత్ అగుడాంగ్, బిల్లి మాగ్‌న్షున్, అన్నా వాడ్డింగ్ హామ్, క్రిస్ సాండర్స్, వాన్స్ తదితరులు నటించారు. ఈ సినిమాకు నిగెల్ బ్లక్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. ఆడం గెరెస్టెల్, ఫిలిప్ జె బార్టెల్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. డాన్ రోమర్ సంగీత సారథ్యం వహించారు.

లిలో అండ్ స్టిచ్ కథ
ఫ్యామిలీ సమస్యలతో బాధపడుతూ .. ఒంటరితనం అనుభవిస్తున్న లిలో అనే చిన్నారి పాప జీవితంలోకి స్టిచ్ అనే ఓ గ్రహంతరవాసి అడుగుపెడుతుంది. తన చలాకీతనం, సూపర్ పవర్స్‌తో స్టిచ్ ఆకట్టుకుంటుంది. దాంతో స్టిచ్ - లిలో మధ్య ఫ్రెండ్‌షిప్ మొదలవుతుంది. స్టిచ్‌తో పరిచయమైన నాటి నుంచి పాప జీవితం చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతుంది. మరి చివరికి ఏం జరిగింది? స్టిచ్ సాయంతో లిలో తన కుటుంబంలోని సమస్యలు సరిదిద్దుకుందా? లేదా అన్నదే ఈ సినిమా కథ.
లిలో అండ్ స్టిచ్ కలెక్షన్స్
సోషియో ఫాంటసీ, ఫిక్షన్ ఇతివృత్తంతో హాలీవుడ్ మేకర్స్ నిర్మించే సినిమాలకు ఇండియాలో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు తగినట్లుగానే లిలో అండ్ స్టిచ్ మూవీ ఆకట్టుకుంది. భారీ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌తో ఈ సినిమా చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆదరణను దక్కించుకుంది. ప్రతి దేశంలోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి లిలో అండ్ స్టిచ్ మూవీకి అమెరికా అండ్ కెనడాలలో 423.5 మిలియన్ డాలర్లు, ఇతర దేశాలలో 611.7 మిలియన్ డాలర్ల చొప్పున వరల్డ్ వైడ్‌గా 1,035 బిలియన్లు (భారతీయ కరెన్సీలో 9 వేల కోట్లు) వసూళ్లు సాధించింది.
లిలో అండ్ స్టిచ్ ఏ ఓటీటీలో?
థియేటర్‌లో విడుదలైన దాదాపు 5 నెలల తర్వాత ఈ సినిమాను భారతీయ భాషలలో ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురావాలని మేకర్స్ భావించారు. ఓటీటీ దిగ్గజం జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 3 నుంచి లిలో అండ్ స్టిచ్ .. ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ భాషలలో మాత్రమే అందుబాటులో ఉంటుందని తొలుత మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు, టాలీవుడ్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంచుతున్నట్లు జియో హాట్ స్టార్ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











