twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సహనంపై బ్రహ్మాస్త్రం

    By Staff
    |

    Brahmastram
    జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: బ్రహ్మాస్త్రం
    విడుదల తేదీ: 11-08-2006
    నటీనటులు: జగపతిబాబు, నేహా ఓబెరాయ్‌, కళాభవన్‌ మణి,
    ఆశిష్‌ విద్యార్థి, కుసుమ, బ్రహ్మానందం, వేణుమాధవ్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు తదితరులు.
    కెమెరా: శరత్‌
    సంగీతం: వైభవ
    మాటలు - పాటలు: భాస్కరభట్ల
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సూర్యకిరణ్‌
    నిర్మాణం: నూకారపు సూర్యప్రకాశరావు

    విచిత్రమైన క్యారెక్టర్‌ని సృష్టిస్తే సరిపోదు... ఎంచుకున్న కథలో దాన్ని సమర్థంగా ప్రవేశపెట్టి సంఘర్షణకు తెర లేపడం తెలియాలి. లేకపోతే 'బ్రహ్మాస్త్రం'లు బూమరాంగులై వెనక్కి వస్తాయి. సత్యం ఫేమ్‌ సూర్యకిరణ్‌ మరోసారి మాస్‌కి దగ్గరవ్వాలని చేసిన ప్రయత్నమిది. జెట్‌లీ 'అన్‌లీష్డ్‌' సినిమా స్ఫూర్తిలో ఎనభైల నాటి ట్విస్టులతో ప్రేక్షక సహనంపై దాడి చేసిందీ సినిమా.

    అనగనగా రుద్ర (ఆశిష్‌ విద్యార్థి) అనే విలన్‌. అతని దగ్గర చిన్నతనం నుండి మోటుగా పెరిగి, చివరికి పేరు కూడా లేని ఓ మొరటోడు (జగపతిబాబు). రుద్ర చీకటి కార్యకలాపాలకి అతనే బలం. ఎప్పుడూ చేతికి కడియంలా మంగళసూత్రం (తల్లిది) కట్టుకుని తిరిగే జగపతిబాబుకి దానిపై ఎవరైనా చెయ్యేస్తే మృగంగా మారి ఎదుటి వాళ్లను చావచితక్కొడతాడు. ఓసారి ప్రత్యర్థి వర్గం కుట్రతో రుద్రకి దూరమవుతాడు జగపతి. గాయత్రి (నేహా ఒబెరాయ్‌) కుటుంబానికి దగ్గరవుతాడు. ఆమె తండ్రి (కళాభవన్‌ మణి) అంధుడు. గాయత్రితో ప్రేమలో పడి, పనిలో పనిగా గురు అనే పేరు పెట్టుకుని మామూలు మనిషవుతాడు. కృతజ్ఞతగా ఆమె తండ్రికి కళ్లు తెప్పిస్తాడు. హీరోయిన్‌ అండతో తన తల్లి (కుసుమ) తండ్రి చేతిలోనే చనిపోయిందని తెలుసుకుంటాడు. ఈలోగా మరో ట్విస్టు. ఆ హంతకుడు ఎవరో కాదు. హీరోయిన్‌ తండ్రి. ఇద్దరు తండ్రులూ ఒకరేనా? చివరికి ఈ కథ ఈ ట్విస్టులని దాటి క్లయిమాక్స్‌కి ఎలా చేరిందనేది తెరపై చూడాల్సిందే!

    అండర్‌ డాగ్‌ కథలు మనకి కొత్తేమి కాదు. కానీ ఇలాంటి సినిమాలో హీరో పాత్ర మారుతున్న క్రమంలో వచ్చే సమస్యల్నుంచి ఎలా తప్పించుకుంటుదనేది ఆసక్తికరమైన అంశం. విచిత్రంగా ఈ కథలో హీరో పాత్ర ఒక ట్రాకులా, జరిగే కథకు సంబంధం లేకుండా దూరంగా ఉండిపోతుంది. కథలో ప్రవేశించదు. సమస్యలో పడదు. మిగతా క్యారెక్టర్లన్నీ సంఘర్షణకు లోనవుతాయి. కథను కదిలిస్తాయి. దాంతో హీరో పాత్ర పూర్థిస్థాయి పాసివ్‌గా ఉంటుంది. ప్రధాన పాత్రకు ఓ లక్ష్యం, దృక్పథం లేకపోవడంతో అది జీవంలేని బొమ్మయిపోయింది. అంతేగాక కామెడీ కావాల్సినప్పుడల్లా అమాయకంగా మాట్లాడటం మరో విచిత్రం. అలాగే అల్లుకున్న కథలో ట్విస్టు హీరో తండ్రి, హీరోయిన్‌ తండ్రి ఒక్కరే కావడం. కొద్దిసేపయినా యాంటీ సెంటిమెంట్‌. అంతేగాక, ఫస్టాఫ్‌లో విలన్‌ బాంబుకి బలైయ్యాడని చూపటంతో సమస్య లేక సంఘర్షణ పుట్టక తర్వాత సీనులు తేలిపోయాయి. ఇవన్నీ స్క్రీప్లే సమస్యలే.

    ఇక సంగీతపరంగా పాటలు యావరేజ్‌గా ఉన్నాయి. రీరికార్డింగ్‌ మరో మైనస్‌. జగపతిబాబు నటన కష్టపడినా వర్కవుట్‌ అయ్యే వాతావరణం లేదు. నేహా ఒబెరాయ్‌ తెలుగు అమ్మాయిలా లేదు. పూర్తి నార్త్‌ స్టయిల్‌. దర్శకత్వం కథకి తగినట్టే ఉంది. కెమెరా ఉన్నంతలో ఫర్వాలేదు. ఎడిటింగ్‌ కొంతవరకూ సినిమాకు ఓదార్పు. కామెడీ కొంత నవ్వించినా కథలో కలవకపోవడం మైనస్‌.

    ఏదేమయినా బిసి సెంటర్లని దృష్టిలో పెట్టుకుని ఫైట్స్‌, బూతు కామెడీ దట్టించి తీసిన ఈ సినిమా వారినైనా ఆకట్టుకుంటుందా అంటే సందేహమే. అయినా జెట్‌లీ అన్‌లీష్డ్‌ తెలుగులో డబ్బింగయి వస్తోంది. సై అంటే సైగా వస్తోంది. అప్పుడు వారి పరిస్థితి ఏంటో - పాపం!

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X