twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కాంచనమాల కేబుల్‌ టీవీ' కేరాఫ్‌ బీసీ సెంటర్లు

    By Staff
    |

    Kanchanamala cable TV
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: కాంచనమాల కేబుల్‌ టీవీ (కేరాఫ్‌ జువ్వలపాలెం)
    విడుదల తేదీ: జులై 15, 2005
    నటీనటులు: శ్రీకాంత్‌, లక్ష్మీరాయ్‌, సునీల్‌,
    శివాజీరాజా, కృష్ణభగవాన్‌, ఎమ్మెస్‌ నారాయణ,
    వేణుమాధవ్‌, కొండవలస, రీతు, హారిక
    నిర్మాణ సంస్ధ: రమ్య మూవీస్‌
    నిర్మాతలు: పొట్లూరి సత్యనారాయణ, కెవి కృష్ణారావు
    సంగీతం: కెఎం రాధాకృష్ణన్‌
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పార్ధ సారధి

    దర్శకుడు పార్ధ సారధి తొలిప్రయత్నంగా శ్రీకాంత్‌, లక్ష్మీరాయ్‌ జంటగా తీసిన 'కాంచనమాల కేబుల్‌ టీవీ' చిత్రం వంశీ మార్కు హాస్యంలో నడిచింది. కథ కొత్తగా ఉన్నప్పటికీ క్లెయిమాక్స్‌కి వచ్చే ముందే కథ దారి తప్పడంతో చివర్లో నిరుత్సాహ పరిచింది.

    జువ్వలపాలెంలో సుదర్శనం (శ్రీకాంత్‌) ఐదు లక్షలు అప్పు చేసి కేబుల్‌ కనెక్షన్ల వ్యాపారం చేస్తుంటాడు. ఊళ్ళో అందరూ తెలిసిన వారే కావడంతో నెలవారీ బిల్లులు వసూలు కావు. సుదర్శనంకు అప్పు ఇచ్చిన రమణమ్మ వడ్డీ డబ్బులకోసం వత్తిడి తెస్తుంటుంది. సుదర్శనం మేనమామ సత్యనారాయణ ఆయన కూతురు కాంచనమాల ఎప్పుడో చిన్నప్పుడే తప్పిపోయింది. ఆ బెంగతో ఆయన భార్య (అన్నపూర్ణ) మంచం పడుతుంది. సుదర్శనం చిన్ననాటి చెలి స్మృతులతో బతుకుతూ తన వ్యాపారానికి 'కాంచనమాల కేబుల్‌ టీవీ' అని పేరు పెట్టుకుంటాడు.

    సిటీలో చదువుకుని అమెరికా వెళ్ళిపోదామనుకున్న శిరీష (లక్ష్మీరాయ్‌) ఒక కన్సల్టెంట్‌ చేతిలో మోసపోతుంది. మీడియాను పిలిచి ఆ కన్సల్టెంట్‌ సుకుమార్‌ని పోలీసులకు పట్టిస్తుంది. ఆ కన్సల్టెంట్‌ పగబడతాడేమోనన్న భయంతో క్రిమినల్‌ లాయర్‌ తనికెళ్ళ భరణిని ఆశ్రయిస్తుంది. కొంతకాలం పాటు జువ్వలపాలెంలో ఉండమని భరణి సలహా ఇస్తాడు. అక్కడ ఉండే తన బావ, అక్కలకు కూతురుగా నటిస్తే అమెరికా పంపే ఏర్పాటు చేస్తానంటాడు. శిరీష జువ్వలపాలెం వస్తుంది. మరదలు తిరిగి వచ్చిందని సుదర్శనం ఆనందపడిపోతుంటాడు. ఆమె కొంగు పట్టుకుని తిరుగుతుంటాడు. నగరంలోని క్లోజ్డ్‌ సర్క్యూట్‌ టీవీలను చూసి సుదర్శనంకు ఒక ఐడియా వస్తుంది. రాత్రి పదకొండు గంటల తర్వాత ప్రత్యక్ష ప్రసారం అనే ఒక కార్యక్రమాన్ని ప్రకటించి, ప్రసారం చేస్తాడు. ఆ ఊళ్లో పెద్దమనుషులుగా చలామణి అయ్యే కృష్ణభగవాన్‌, కొండవలస, రఘుబాబు వంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మేజువాణిని ప్రత్యక్ష ప్రసారం చేస్తాడు. వారి తప్పుడు పనులను చూసి ఇంట్లో వాళ్ళు వాళ్ళపై తిరగబడతారు. సుదర్శనం వారి మెప్పు చూరగొంటాడు. కానీ దెబ్బతిన్న వాళ్ళు అతడిని ఓ గొడవలో ఇరికిస్తారు. ఊరందరి చేత ఛీకోట్టిస్తారు. హీరోయిన్‌ కూడా ఛీ కొడుతుంది. ఆ ఆపద నుంచి సుదర్శనం ఎలా తప్పించుకున్నాడన్నది తెర మీద చూడాలి.

    ఆహ్లాదకరమైన పల్లె వాతావరణం, వంశీ మార్కు క్యారక్టర్లతో ఫస్టాఫ్‌ జోరుగా నడిచింది. 'చదువుకుంటే బ్రెయిన్‌ అరిగిపోతుంది' అనే మరుధూరి రాజా డైలాగ్స్‌ పేలాయి. శ్రీకాంత్‌, శివాజీ పడుకుని ఉండగా ఎవరో మంచం మోసుకెళ్తూఉంటే గాలిలో తేలుతున్నట్టుంది అని నిద్రలో ఫీలవడం బాగా నవ్వించింది. శ్రీకాంత్‌ కష్టపడి నటించాడు. కృష్ణభగవాన్‌ పంచ్‌లు బాగున్నాయి.

    దర్శకత్వం యావరేజిగా ఉంది. కొన్ని సీన్లు టీవీ సీరియల్‌ను తలపించాయి. ఇంటర్వెల్‌ తర్వాత రెండో మలుపులో శ్రీకాంత్‌ కష్టాల్లో ఇరుక్కు పోయినప్పుడు హీరో సొంత ప్రతిభతో కాకుండా దేవుడి దయ వల్ల బయటపడడంతో ఆసక్తి సన్నగిల్లింది. సాధారణ స్క్రీన్‌ప్లేతో నడిచినా క్లెయిమాక్స్‌ దగ్గర ఒక క్రైమ్‌ ఎలిమెంట్‌ చేర్చడంతో కథను ముగించాలన్న ఆతృత కన్పించింది. రెండు పాటల్లో పాత పాటల ఛాయలున్నాయి. హీరోయిన్‌ లక్ష్మీరాయ్‌ ఈ సినిమాకు మైనస్‌ పాయింట్‌. కథాంశం కొత్తగా ఉన్న హాస్య చిత్రం కాబట్టి హాస్య ప్రియులను అలరిస్తుంది. బి,సి సెంటర్లలో ఆడుతుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X