»   » తూచ్ ఇది రెడ్('గ్రీన్‌ సిగ్నల్‌' రివ్యూ)

తూచ్ ఇది రెడ్('గ్రీన్‌ సిగ్నల్‌' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.0/5
ఓ నలుగురు కుర్రాళ్లు..వాళ్లు లవ్ స్టోరీలు...బూతు తిరగమోత పెట్టి ...చివర్లో ఓ రెండు నీతి వాక్యాలు... ఇలాంటి ఆణిముత్యం లాంటి స్టోరీలైన్ తో తయారైన సినిమాలు ఆ మధ్య చాలా కాలం తెలుగు తెరపై కుప్పలు తెప్పలుగా వచ్చాయి. లో బడ్జెట్ లో నిర్మాణమయ్యే ఈ చిత్రాలు...థియోటర్స్ ఫీడింగ్ గా పనికివచ్చి కొద్దో గొప్పో సంపాదించుకునేవి. అప్పట్లో అవి చూసి ప్రేరణ పొంది రాసుకున్న కథో లేక, వాటిని మళ్లీ గుర్తు చేద్దామనుకున్నాడో ఏమో కానీ దర్శకుడు అలాంటి కథని తీసుకుని, ఈ మధ్య కాలంలో గుండె జారి గల్లంతైంది చిత్రంలో వచ్చిన గే ట్రాక్ ని కలిపి ఈ కాలం ప్రేక్షకులకు అందించాడు. ఎందుకైనా మంచిదని పనిలో పనిగా కాస్త బూతుని కూడా దట్టించాడు.ఈ రోజుల్లో టైప్ లో ఒకటి రెండు డైలాగులుతో టీజర్ ని రెడీ చేసి వదిలాడు. ఇలా ఎంత కష్టపడినా... ఈ అవుట్ డేటెడ్ వ్యవహారాన్ని చూసి కష్టపడటానికి జనం సిద్దంగా లేరనే విషయం ఎందుకో మరిచాడు. ఇప్పుడు హిట్ అవుతున్న సినిమా కథలు ఏమన్నా కొత్తవా అంటే చెప్పలేం కాని కామెడీ పండినా ఈ సినిమా ఓకే అనిపించేది...అదీ జరగలేదు.


జిమ్ ట్రైనర్ ...శాండి అలియాస్ సందీప్ రెడ్డి(మానస్) కి అమ్మాయిలని పడేసి...వారి డబ్బుతో ఎంజాయ్ చెయ్యాలన్నది జీవితాశయం. మరొకడు గొపాల్ (గోపాల్) తను సాఫ్ట్ వేర్ క్లాసులు తీసుకునే చోటుకు వచ్చే అమ్మాయిలని ఎలాగైనా ప్రేమలో దింపాలన్న కోరిక. నాయుడు(రేవంత్)కి అనుకోకండా రెస్టారెంట్ లో పరిచయమైన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని కోరికతో ప్రయత్నాలు. మరొకడు ప్రేమ్(అశుతోష్) కి అమ్మాయిలంటే పడదు. వాడు ఓ అబ్బాయిని ఎలాగైనా లైన్ లో పెట్టాలని ప్రయత్నాలు చేస్తూంటారు. ఒకే రూమ్ లో ఉండే వీరందరూ తాము కోరుకునే వారినుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారా.. వీరి ఆశలను నెరవేర్చుకున్నారా...ఆ క్రమంలో ఏం జరిగింది అనేదే తెలుసుకోవాలంటే చిత్రం చివరి వరకూ చూడాల్సిందే.

Maruthi's Green Signal Review

స్క్రిప్టు దగ్గరనుంచి అన్ని చూసుకునే మారుతి...తను సమర్పించే చిత్రం స్క్రిప్టు చూడకుండానే,కథ వినకుండానే, డైలాగులు తెలుసుకోకుండానే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడా...లేక తను డైరక్ట్ చేసే సినిమాల్లో బూతు లేకుండా ఉంటే చాలు..తన పేరుతో వచ్చేవి సొమ్ము చేసుకోవాలంటే బూతు మంత్రం వల్లించాల్సిందే అని నిర్ణయించుకున్నాడా అనే సందేహం ఈ చిత్రం చూస్తే కలుగుతుంది. కొత్త జంట ద్వారా ఆయన బూతు ముద్ర నుంచి దూరమవుదామనుకున్నా...ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ని సమర్పించి...బూతుకి మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయినా ఈ బూతు ...భాక్సీఫీస్ వద్ద కాసులు పండించేటట్లు కనపడటం లేదు. అదేంటో కానీ..కేవలం మారుతి రాసి,డైరక్ట్ చేస్తేనే ఆ బూతు కూడా పండుతోంది...ఆయన నిర్మించినా, సమర్పించినా బూతు వర్కవుట్ కావటం లేదు.

మారుతి సంగతి వదిలేస్తే... దర్శకుడు సైతం తన తొలి సినిమా కదా ఎలాగైనా గెలివాలి అన్న తపనతో మసాలాలు కలుపుకుంటూ పోయాడే కానీ మారుతున్న ప్రేక్షకుల పల్స్ ని పట్టించుకోలేదు. ప్యార్ కా పంచనామా చిత్రంలో సీన్స్ ని కొన్ని ఎత్తాడు కానీ, ఆ కథనాన్ని పట్టుకోలేకపోయాడు. సీన్స్ పేర్చినట్లు ఉన్నాయి కానీ, నలుగురు హీరోలకు నాలుగు క్యారెక్టరైజేషన్స్, వారి సమస్యలు, వాటి పరిష్కారాలు అనేది సరైన విభజన చేయలేకపోయాడు. దాంతో ఎక్కడా ఆ క్యారక్టర్స్ తో మనం లీనం కాలేని పరిస్ధితి ఏర్పడింది. అలాగే కథని సెటప్ చేయటానికే ఫస్టాఫ్ మొత్తం తీసుకోవటం చాలా బోర్ వచ్చేసింది. అలాగే కథలో కన్లూజన్ పార్ట్ కూడా సరైన సమయంలో ఇవ్వలేకపోయారు. దాంతో చూస్తున్న ప్రేక్షకుడుకి, సినిమాకి సంభంధం తెగిపోయింది. ఇటువంటి కథలకు స్క్రీన్ ప్లే ప్రధానమనే సంగతే మర్చిపోయాడు.

ఇక మిగతా టెక్నికల్ విషయాలకి వస్తే దర్శకుడుగా పెద్దగా ఇంప్రెస్ చేయలేదనే చెప్పాలి. కొత్త దర్శకులు తమకు అంది వచ్చిన అవకాశాన్ని సేఫ్ గేమ్ ఆడదామని ఇలాంటి సినిమాలు తీస్తే కెరీర్ ప్రశ్నార్దకంగా మారుతుంది. మంచి సినిమా తీస్తే...అది జనాలకు ఎక్కకపోయినా ఆ గుర్తింపుతో మరో సినిమా పట్టుకునే అవకాసం ఉంటుంది. అలాగే సంగీతం కూడా సినిమాకు పెద్దగా ప్లస్ కాలేదు. ఎడిటింగ్ చాలా చేయాలి అనే ఫీలింగ్ కలిగింది. అయితే అంత షార్ప్ గా ఎడిటింగ్ చేయాలంటే దర్శకుడు,స్క్రిప్టు సహకరించాలి. ఇక్కడంత సీన్ లేదు. నటీనటులు బాగానే చేసారు కానీ వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా మారింది. మానస్,శిల్పా శర్మ మాత్రం మంచి మార్కులు వేయించుకుంటారు. డైలాగులు యావరేజ్ గా ఉన్నాయి.

ఏదైమైనా ఈ సినిమా ఏ వర్గాన్ని అయితే టార్గెట్ చేసారో వారిని కూడా ఆకట్టుకోవటం కష్టమే అనిపిస్తోంది...మారుతి గత చిత్రం లవ్ యురా బంగారం రూట్ లోనే ఇదీ ప్రయాణం పెట్టుకునేటట్లు ఉంది.

పతాకం: ఎస్ఎల్‌వి సినిమాస్
నటీనటులు: రేవంత్‌, రక్షిత, మానస్‌, మనాలి, అశుతోష్‌, డింపుల్‌ చోపడే, శిల్పి శర్మ తదితరులు
సంగీతం : జె.బి.
ఎడిటింగ్ : ఉద్దవ్
ఛాయాగ్రహణం : ఆర్.ఎం స్వామి
కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం :విజయ్ మద్దాల
సమర్పణ :మారుతి
నిర్మాత : రుద్రపాటి రమణారావు
విడుదల తేదీ: మే 30, 2014

(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Director Vijay Maddala's romantic movie 'Green Signal' released today with divide talk. Starring Revanth, Manas, Ashutosh, Rakshitha, Manali and produced by Rudhrapati Ramana Rao under the banner S.L.V.Cinemas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu