For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రొటీన్ వి‘నాయక్’ (రివ్యూ)

  By Srikanya
  |

  ----సూర్య ప్రకాష్ జోశ్యుల

  Rating:
  2.5/5
  బ్యానర్ : యూనివర్శల్ మీడియా సంస్థ
  నటీనటలు: రామ్ చరణ్, కాజల్, అమలపాల్ , బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎంఎస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, రాహుల్ దేవ్, రఘుబాబు, సుధ తదితరులు
  సంగీతం: తమన్,
  కెమెరా: చోటా కె. నాయుడు,
  ఎడిటింగ్: గౌతంరాజు,
  ఆర్ట్: ఆనంద్‌ సాయి
  కథ, మాటలు: ఆకుల శివ,
  సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ.
  నిర్మాత: డివివి దానయ్య,
  దర్శకత్వం: వివి వినాయక్.

  "నా జోలికి వస్తే క్షమిస్తాను కానీ...నా వాళ్ల జోలికి వస్తే నరికేస్తాను..." అంటూ రామ్ చరణ్ ఈ సంక్రాంతి పండక్కి ...'నాయక్' గా ముస్తాబై థియోటర్ లలో దూకేసాడు. ఎంతో ఎనర్జీతో పాటలు,ఫైట్స్ చేసుకుంటూ పోయినా కథ,కథనంలో ఎక్కడా మచ్చుకు కూడా ప్రెష్ నెస్ లేకుండా జాగ్రత్తపడటంతో అతని శ్రమకు తగ్గ సినిమాగా కనపడటం లేదు. ఈ సినిమాలో తన తండ్రి చిరంజీవి 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్నా' అనే గీతాన్ని మాత్రమే రీమిక్స్‌ చేసారనుకుని చూస్తే... దాదాపు ప్రతీ సీనూ అంతకు ముందు వచ్చిన చిత్రాల మిక్స్ లా అనిపించి ఉసూరుమనిపిస్తుంది. దానికి తోడు రామ్ చరణ్ కూడా చాలా చోట్ల చిరంజీవి అనుక(స)రిస్తున్నట్లు స్పష్టమవుతుంది. అయితే ఫస్టాఫ్ లో బ్రహ్మానందం, సెకండాఫ్ లో ఎమ్.ఎస్ నారాయణ కామెడీ సినిమాను కాపు కాసి,నిలబెట్టే ప్రయత్నం చేసింది. మెగా ఫ్యాన్స్ కు నచ్చే ఈ చిత్రం మిగతా సంక్రాంతి చిత్రాల పరిస్ధితిని బట్టి విజయావకాశాలు ఏ రేంజిలో ఉన్నాయో అంచనా వేయాలి.

  చెర్రీ (రామ్ చరణ్) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన అంకుల్ జిలేబి(బ్రహ్మానందం) అత్యుత్సాహంతో నోరు జారి,ఇరుక్కోవటంతో లోకల్ డాన్ గండిపేట బాబ్జి (రాహుల్ దేవ్) దగ్గరకు సెటిల్ మెంట్ కు వెళ్లాళ్సి వస్తుంది. అయితే బాబ్జిని కలిసిన చెర్రికి అక్కడ బాబ్జీ చెల్లెలు మధు (కాజల్) తో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. దాంతో బాబ్జీని మాటలతో మభ్యపెట్టి ప్రస్తుతానికి ఆ గండం నుండి గట్టెక్కి, మధుని లైన్ లో పెట్టడానికి ప్రయత్నిస్తూంటాడు. మరోప్రక్క కలకత్తాలో,హైదరాబాద్ లలో చెర్రి పోలికలతో ఉన్న ఓ వ్యక్తి హత్యలు చేస్తూంటాడు. అతని కోసం సిబిఐ (ఆశిష్ విధ్యార్ధి)టీం వెతుకుతూంటుంది. ఇంతలో ఆ చెర్రి పోలికలతో ఉన్న మరో వ్యక్తి...నెక్ట్స్ మర్డర్ చేయబోయేది మినిస్టర్ రావత్ (ప్రదీప్ రావత్)అని తెలుస్తుంది. కుంభమేళాలో అతన్ని చంపబోతున్నాడని తెలుసుకున్న సీబీఐ అక్కడకి చేరుకుంటుంది. సరిగ్గా అదే సమయానకి చెర్రీ కూడా అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు సీబీఐ వారు చెర్రీని చూసి ఆరెస్టు చేయటానికి సిద్దమవుతారు....అసలు ఆ మరో వ్యక్తి ఎవరు...లేక చెర్రీనే ...ఆ హత్యలన్ని చేస్తున్నాడా...మరి నాయక్ కథేంటి, అమలాపాల్ కి ఈ చిత్రంలో పాత్ర ఏమిటి... వంటి విషయాలు తెలియాలంటే...సినిమా చూడాల్సిందే.

  ద్విపాత్రాభినయం కథలు తెలుగు తెరకు కొత్తేంకాదు.. .దర్శకుడు వివి వినాయిక్ కి అంతకన్నా కాదు.. ఆయన గతంలో చెన్నకేశవరెడ్డి,అదుర్స్ చిత్రాలు ఇదే పాట్రన్ లో చేసారు. ఇలాంటి చిత్రాలకు కథ కన్నా కథనంపైనే ఎక్కువ ఆధారపడాలి..ఇంకా చెప్పాలంటే ట్రీట్ మెంటే ఈ తరహా చిత్రాలకు ప్రాణం. అయితే 'నాయక్' లో స్క్రీన్ ప్లే నే పెద్ద మైనస్ గా నిలిచింది. ద్విపాత్రాభినయం ఉన్నప్పుడు ఆ ద్విపాత్రాభినయం వల్ల కథకు కలిసి వచ్చే ఉపకారం అంటే... మామూలు కథకూ, ద్విపాత్రాభినయం కథకూ తేడా కనపడాలి. అంతేగానీ..రెండూ పాత్రలు ఉన్నాయి అని ఇద్దరని రెండు కథలలుగా చూపించుకుంటూ పోతూ ఉంటే ఉపయోగం ఉండదు. ద్విపాత్రాభినయం చిత్రాల్లో ఆ రెండు పాత్రలూ కలిసినతర్వాత ఏం జరుగుతుంది అనేదే కీలకం.

  'నాయక్' విషయానికి వచ్చేసరికి..రెండు పాత్రలూ అసలు ఎవరు..వారి నేపధ్యాలు...ఆ పాత్రలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటీ అని చూపించేసరికే...ప్రీ క్లైమాక్స్ కు వచ్చేసింది. ఫస్టాఫ్ మొత్తం...మొదటి పాత్ర చెర్రీ,అతని లవ్ స్టోరీ చూపెడితే,సెకండాఫ్ రెండవపాత్ర సిద్దూ నాయక్ అంటూ అతని కథ ప్లాష్ బ్యాక్ రూపంలో చెప్పారు. ఇలా స్కీన్ టైం మొత్తం ఆ రెండు పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ కే సరిపోయింది. దాంతో ద్విపాత్రాభినయం పాత్రలు రెండు కలిపి విలన్ ని ఎలా ముప్పు తిప్పలు పెట్టారు..అనేది చూపెట్టటానికి టైం సరిపోలేదు. అలాగే హీరోలు ఒకరు కాదు..ఇద్దరు అని విలన్ తెలిసే సరికి క్లైమాక్స్ కి వచ్చేసింది. అలా లేటు చేసుకుంటూపోయారు. ఆ లేటుకి కారణం ...ఇంటర్వెల్ బ్యాంగ్...రెండవపాత్ర ఉన్నాడని ప్రేక్షకులకు తెలియటమే...ట్విస్ట్ గా భావించారు. ఈ అంశం పెడితే..ద్విపాత్రాభినయంలో రెండు పాత్రలకూ వైరుధ్యం ఉంటేనే బావుంటాయనేది సినీ సత్యం. కానీ ఈ చిత్రంలో చెర్రీ,'నాయక్' పాత్రలు రెండూ ఆవేశంతో ప్రజలుకోసం పాటుపడుతూ, మధ్యమధ్యలో హీరోయిన్స్ తో డాన్స్ చేసే పాత్రలు... రెండూ శారీరకంగానే కాక...వ్యక్తిగతంగానూ ఒకే పోలిక కావటంతో.... కాంప్లిక్ట్ జనరేట్ కాలేదు.

  అయితే దర్శకుడు ఎన్నో కమర్షియల్ చిత్రాలు చేసిన అనుభవంతో.. పైన చెప్పుకున్న లోటుని కనపడనీయకుండా కామెడీతో నడపాలని ప్రయత్నించి కొంతవరకూ సఫలికృతుడు అయ్యాడు. ఫస్టాప్ లో వచ్చే బ్రహ్మానందం జిలేబీ పాత్ర ..గతంలో వినాయిక్ చిత్రం కృష్ణ ని గుర్తు చేసినా ఉన్నంతలో బాగానే నవ్వించింది. ఇక సెకండాఫ్ లో వచ్చే లిప్ మూవెమెంట్ లు చదివే సిబిఐ ఉద్యోగి పాత్రలో ఎమ్.ఎస్ నారాయణ కూడా నవ్వించారు. అయితే అదుర్స్ చిత్రంలా అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రం కాకపోవటంతో...హీరోని మర్డర్ కేసులో విలన్ ఇరికించటం వంటి కొన్ని కీలకమైన సీన్స్ తేలిపోయాయి. హీరోయిన్స్ కాజల్, అమలాపాల్ ఇద్దరూ గ్లామర్ కే పరిమితం అయ్యారు. ఫక్తు కమర్షియల్ సినిమా కాబట్టి అంతకుమించి ఆశించలేము. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఉంటూ హీరోయిన్ ని ప్రేమించే పాత్రలో వేణు మాధవ్ ఓకే అనిపిస్తాడు. విలన్స్ గా ప్రదీప్ రావత్,రాహూల్ దేవ్ ఫరవాలేదనిపిస్తే, కోట శ్రీనివాసరావు, తణికెళ్ల వంటి నటులను సరిగ్గా వినియోగించుకోలేదనిపిస్తుంది. జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు మాత్రం తన రెగ్యులర్ డైలాగ్ డెలవరీలతో బాగనే నవ్వించారు.

  ఈ భారీ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులంతా సీనియర్సే కాబట్టి వారి ప్రతిభ సినిమాలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఎడిటింగ్ విషయంలో... ఫస్టాఫ్ ని ఇంకా ట్రిమ్ చేసి లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది అనిపిస్తుంది. కెమెరా వర్క్ ..రామ్ చరణ్ ని బాగా హైలెట్ చేసింది. తమన్ పాటలు మాత్రం అంత కిక్ ఇవ్వలేదు. ఆ పాటలకు రామ్ చరణ్ వేసిన స్టెప్స్ మాత్రం బాగున్నాయి. ఛార్మి ఐటం సాంగ్ రొటీన్ గా ఉంది. టైటిల్ సాంగ్ నాయక్ కి, శుభలేఖ రాసుకున్నా పాటకు బాగా రెస్పాన్స్ వచ్చింది. రచయిత ఆకుల శివ కథ పరమ రొటీన్ గా చేసినా డైలాగులు బాగానే పేల్చాడు. దర్శకుడుగా వినాయిక్ మాత్రం తన గత చిత్రాల రేంజిలో మాత్రం చేయలేనిపిస్తుంది. వినాయిక్ అంటే యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా ఉంటాయి. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి.

  ఫైనల్ గా ఏ విధమైన ఎక్సపెక్టేషన్స్ లేకుండా, కథతో సంభందం లేకుండా రామ్ చరణ్ పాటలకు వేసే స్టెప్స్, బ్రహ్మానందం, ఎమ్.ఎస్ నారాయణ కామెడీ వంటివి ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ చిత్రం మంచి ఆప్షన్. ఈ సంక్రాంతికి మిగతా సినిమాలేవి వర్కవుట్ కాకపోతే ఇదే ఏకైక ఆప్షన్.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Naayak is an action romantic movie relesed today with average talk. The most anticipated Tollywood movie of 2013, Naayak is directed by VV Vinayak, which features Ram Charan Teja, Kajal Aggarwal and Amala Paul in the lead roles. “Nayyak” is promoted with a tag line ‘The Leader’ by the makers of the film to prove that Ram Charan Teja is the leader in Tollywood among the present day heroes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X