twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పల్లకీలో పెళ్ళికూతురు - సమీక్ష

    By Staff
    |

    Pallakilo Pellikuturu
    -జలపతి గూడెల్లి
    చిత్రం: పల్లకీలో పెళ్ళికూతురు
    నటీనటులు: గౌతమ్‌, రతి, బ్రహ్మనందం, సునీల్‌,
    గిరిబాబు, ధర్మవరపు సుబ్రమణ్యం, వేణుమాధవ్‌, షకీల, తదితరులు
    సంగీతం: ఎం.ఎం.కీరవాణి
    నిర్మాతలు: దేవినేని స్రపాద్‌, సుంకర మధుమురళి
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ: కె.రాఘవేంద్రరావు
    కథ, దర్శకత్వం: సుచిత్రా చంద్రబోస్‌

    నృత్యదర్శకురాలు సుచిత్రాచంద్రబోస్‌ దర్శకురాలిగా, బ్రహ్మనందం కుమారుడు హీరోగా తెలుగు సినిమా తెరకు పరిచయం అవుతూ రూపొందించిన చిత్రం ఇది. సినిమా ప్రముఖుల 'కొడుకు'లు నటించిన తొలి చిత్రాల్లన్నింటిని మాదిరిగానే ఇది కూడా సాగుతుందని ముందే ఊహించినప్పిటికీ, దర్శకురాలు సుచిత్రా చంద్రబోస్‌ ఇలాంటి బుద్దిహీనమైన కథను, అంతే కన్నా బుద్ధిహీనమైన స్క్రీన్‌ప్లేను (రాఘవేంద్రరావు) రూపొందించుకొని ప్రేక్షకులు ప్రాణాలు తీసేందుకు సిద్దపడుతుందని ఊహించలేదు. ఈ చిత్రానికి దర్శకత్వ పర్వవేక్షణ చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దశాబ్దం క్రితం రూపొందించిన 'పెళ్ళిసందడి' చిత్రానికి ఇది పదో, ఇరవో, జిరాక్స్‌ కాపీ. ఆ చిత్రం తరహాలో రూపొందించాలనుకొని, కీరవాణితో హిట్‌ ట్యూన్స్‌ రూపొందించుకొన్నప్పటికీ, 'ప్రేక్షకులు' ఈ పదేళ్ళల్లో చాలా తెలివిమీరిపోయారని, ఇలాంటి 'ట్రాష్‌'కు కాలం చెల్లిందని ఇంకా సుచిత్ర, ఆమె గురువు రాఘవేంద్రరావు గ్రహించకపోవడం దురదృష్టకరం.

    రాణి (రతి) పల్లెటూరులో పెరిగిన 'పల్లెటూరు మొద్దు'. ఆమెకు అమెరికాలో ఉండే యువకుడితో పెళ్ళి నిశ్చయం అవుతుంది. ఈ అమెరికా అబ్బాయి తల్లితండ్రులు తమ కుమారుడి టేస్ట్‌కనుగుణంగా హీరోయిన్‌ను మార్చుకుంటామని..పెళ్ళికి, నిశ్చితార్థానికి ముందే, తమ ఇంటికి తీసుకెళుతారు(ఇలా జరుగుతుందా? కనీసం ఎంగేజ్‌మెంట్‌ కూడా కాకముందే, అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తారా, అదీ ఏ బంధుత్వం వారికి, వీరికి లేకుండా?). సో..హీరోయిన్‌ 'పల్లకీ' అనే గ్రూమింగ్‌ కాలేజ్‌(పెళ్ళి అయ్యాక ఎలా ప్రవర్తించాలో నేర్పే పాఠశాల)లో చేర్పిస్తారు. మరోవైపు, గౌతమ్‌ (గౌతమ్‌) ఈ పల్లెటూరి రాణిని ఓ సారి టీవీలో చూసి మనసు పారేసుకుంటాడు. ఎలా ఈ అమ్మాయిని పట్టుకోవడం అనుకునేలోపే, త మ బామ్మ నడిపే గ్రూమింగ్‌ కాలేజ్‌లోనే తారసపడడంతో కుర్రాడికి పాటలు పాడుకునే ఛాన్స్‌ దొరుకుతుంది.

    'రాణి'కి ఐలవ్యూ అని అంటే అర్థం ఏమిటో కూడా తెలియదన్నమాట. హీరోగారు మీకు ఎవరైనా ఇష్టమైతే, 'ఐలవ్యూ స్వీట్‌హార్ట్‌' అని చెప్పాలని చెప్పడంతో, అమెరికా అబ్బాయి ఫోన్‌ చేస్తాడని భావించి, ఓ సారి ఫోన్‌ రాగానే, 'ఐలవ్యూ స్వీట్‌హార్ట్‌' అని అనేస్తుంది. కానీ ఫోన్‌ చేసింది హీరో. సో..హీరోగారు మరో పాట పాడుకుంటాడు. పాట అయిపోయిన తర్వాత, హీరోయిన్‌ ' ఐలవ్యూ' అని చెప్పింది, తన కాబోయే మొగుడికి అని చెప్పడంతో హీరోకి గిర్రున కళ్ళు తిరుగుతాయి.

    ఐనప్పటికీ తన ప్రేమను త్యాగం చేస్తాడు. ఈ లోపు అమెరికా కుర్రాడు వస్తాడు. పెళ్ళి నిశ్చయం అవుతుంది. కుర్రాడు అమ్మాయి నడుం గిల్లుతాడు, చీకట్లో ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు.. ఇవన్నీ హీరోపైన హీరోయిన్‌ మనసు మల్లేలా దర్శకురాలి ట్రిక్స్‌ అన్నమాట. క్లైమాక్స్‌లో హీరోయిన్‌కు తన 'అసలు ప్రేమ' గుర్తొచ్చి (బలవంతంగా దర్శకురాలు రుద్దడం వల్ల) గౌతమ్‌ను చేసుకోవడంతో ముగుస్తుంది.

    ఈ అర్థరహితమైన కథను, వేణుమాధవ్‌, ధర్మవరపు సుబ్రమణ్యం, సునీల్‌, షకీలాలతో అరిగిపోయిన కామెడినీ మిక్స్‌ చేయాలని ప్రయత్నించారు. రెండు, మూడు సార్లు షకీలా లావు మీద సెటైరు వంటి దృశ్యాల వల్ల నవ్వు తప్ప సినిమా అంతా బోరే. కీరవాణి తన పాటలను తనే రీమీక్స్‌ చేసి వదలినప్పటికీ, వినడానికి బాగానే ఉన్నాయి. హీరోయిన్‌ రతి చూడడానికి బాగానే ఉన్నా, అమాయకంగా ఆమె నటించిన తీరు, ఆమెకు చెప్పిన డబ్బింగ్‌ తీరు వల్ల చాలా ఇరిటేటింగ్‌ అన్పిస్తుంది. హీరోయిన్‌ నడుం మీద, నాభి మీద పూలు వేయడమే గౌతమ్‌ చేసిన నటన. బ్రహ్మనందం కుమారుడైన గౌతమ్‌ మరీ చూడడానికి అసహ్యంగా లేకపోవడం కొంచెం రిలీఫే. సుచిత్రా దర్శకత్వం చేశారు అనడం కన్నా, రాఘవేంద్రరావే అధికంగా 'పర్యవేక్షించార'నడం సబబు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X