twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పౌర్ణమి' వెలుగు ఎంత?

    By Staff
    |

    Pournami
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: పౌర్ణమి
    విడుదల తేదీ: 20-04-2006
    నటీనటులు: ప్రభాస్‌, త్రిష, చార్మి, సింధూ తలాని,
    మధుశర్మ, అర్చన, చంద్రమోహన్‌, కోట శ్రీనివాసరావు,
    ధర్మవరం సుబ్రహ్మణ్యం, రాహుల్‌ దేవ్‌, ముఖేష్‌ రుషి, తనికెళ్ల భరణి,
    పరుచూరి వెంకటేశ్వరరావు, సునీల్‌, సుబ్బరాజు, నర్సింగరావు, గీత తదితరులు
    సంగీతం: దేవిశ్రీ స్రసాద్‌
    పాటలు: సిరివెన్నెల
    మాటలు: పరుచూరి బ్రదర్స్‌
    కెమెరా: వెంకటప్రసాద్‌
    ఎడిటర్‌: కె.వి.కృష్ణారెడ్డి
    కథా సహకారం: శోభన్‌
    దర్శకత్వం: ప్రభుదేవా
    కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత: ఎం.ఎస్‌.రాజు

    తీసే ప్రతి ఫ్రేమ్‌లో ప్రతిభను చూపే ఎమ్మెస్‌ రాజు, వేసే ప్రతి అడుగులో వెరైటీ చేసే ప్రభుదేవా మళ్లీ కలిసి చేసిన ప్రయత్నం 'పౌర్ణమి'. కథా నేపథ్య కాలం పాత రోజులకి తీసికెళ్లి ప్రత్యేకంగా కనిపించినా కథనం మాత్రం ఎన్నో సార్లు వాడిన 'భాషా మూస'లోకి వెళ్లి ప్రమాదం తెచ్చి పెట్టింది. ఫస్టాఫ్‌ బోర్‌ కొట్టకుండా నడపటం, క్లైమాక్స్‌ పాట బాగుండటం కొంత వరకు ఊరట.

    1953లో ప్రారంభమయ్యే కథ పౌర్ణమి (త్రిష) అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె కుటుంబ వారసత్వంగా ఓ పెద్ద బాధ్యత భవిష్యత్తులో నిర్వహించాల్సి వుంటుంది. అది ప్రతీ పుష్కర పౌర్ణమికి ఆ ఊరి శివాలయంలో నాట్యం నివేదన చేయడం. దాంతో ఆమె చిన్నతనం నుండే తన తండ్రి (చంద్రమోహన్‌) వద్ద నాట్యం నేర్చుకుంటుంది. కానీ తలవని తలంపుగా ఆ ఊరి జమీందారు (రాహుల్‌ దేవ్‌) కళ్లు ఆమెపై పడటం, ఆమె ఆ ఊరి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత కొంత కాలానికి ఆ వూరికి శివకేశవరావు (ప్రభాస్‌) వస్తాడు. అక్కడ రాక్‌ అండ్‌ రోల్‌ డ్యాన్స్‌ పెడతాడు. పౌర్ణమి గదిలోనే నివాసం ఉంటాడు. అంతేగాక పౌర్ణమి చెల్లెలు చంద్రకళ (చార్మి)ని ఆకర్షిస్తాడు. నాట్యం అంటే ఇష్టం లేని ఆమెను ఆ దిశగా ప్రేరేపిస్తాడు. ఇంతకీ ఈ శివకేశవరావు ఎవరు? ఆమెకు పౌర్ణమి కుటుంబానికి సంబంధం ఏమిటి? పారిపోయిన పౌర్ణమి ఏమైంది? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం సినిమా చూడాల్సిందే.

    కథలో లొసుగులు, మలుపులు మరీ ఎక్కువగా వుండటం ఒకింత నిరాశ. ఊరు బాగు కోసం నాట్యం చేసే పౌర్ణమికి ఆ ఊరు వాళ్లు ఎందుకు సహకరించి రక్షించరు? పౌర్ణమి మరణ తర్వాత ఆమె తండ్రికి ఎందుకు తెలియదు? ఇలా ఎన్నో సందేహాలు ఈ కథ రేపినా ఫస్టాఫ్‌ పాత కాలంలోకి వెళ్లి కొత్తగా అనిపించి బోర్‌ కొట్టదు. ఇంటర్వెల్‌ తర్వాత ప్రభాస్‌ ఫ్లాష్‌బ్యాక్‌ చెప్తూ తెలుసుకో అవసరం లేని ఫాక్షన్‌ స్టోరీ చూపిస్తాడు. ఇది కథను కొద్దిగా కూడా ముందుకు సాగనివ్వదు. పౌర్ణమికి ఏం జరిగింది, ఆమె కథ తెలుసుకోవాలన్న ప్రేక్షకుడికి ఇది బోరే. అంతేగాక ఈ కథనం 'బాలు' సినిమా లైన్‌ను బలంగా గుర్తుకు తేవడం ఇబ్బందే. అలాగే చివరి క్లైమాక్స్‌ పాట చంద్రముఖిని గుర్తు చేసినా చాలా బాగుంది. స్క్రీన్‌ప్లే పరంగా కథకి రెండు లక్ష్యాలు పెట్టారు. పౌర్ణమి ఎవరని, ప్రభాస్‌ ఎవరని. కానీ రెండూ ప్రేక్షకుడు ఊహించేలా వెళ్లడం కథన సమస్య. చార్మి నోరు తెరిచి పళ్లతో లైట్‌ వేయడం, రాక్‌ అండ్‌ రోల్‌ డ్యాన్స్‌ దేవానంద్‌ గెటప్‌ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్‌ కోసం పెట్టుకున్న సింధు తిలాని పాత్ర కథలో కొద్దిగానైనా కలవకపోవడం ఇబ్బంది కరం. సెకండాఫ్‌లో వరుసగా వచ్చే లవ్‌ సీన్స్‌ మధ్య మరింత కామెడీ ఉంచి ఆ సీన్స్‌ని ట్రిమ్‌ చేసి ఉంటే ఇంకా బాగుండేది. మూడు పాటలు బాగున్నాయి. కొన్ని చోట్ల విజువల్స్‌ (త్రిష ఇంటర్‌డక్షన్‌ పాట)లో చాలా బాగుంది. మాటలు ఫరవా లేదు. కెమెరా, ఎడిటింగ్‌ బాగా కుదిరాయి. దర్శకత్వం గత చిత్రం స్థాయిలో లేదు.

    ఏదేమైనా ' ఏమైంది?' ఎంయస్‌ మ్యాజిక్‌ అని అందరికీ అనుమానం వచ్చినా అసభ్యతకు తావులేకపోవడంతో ఫ్యామిలీస్‌కి ఫరవాలేదనిపిస్తుంది.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X