twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్రియమైన చిత్రం

    By Staff
    |

    Priyamainaneeku
    చిత్రం: ప్రియమైన నీకు
    నటీనటులు: తరుణ్‌, స్నేహ, ప్రీతి, శివాజీ, వేణ్‌ మాధవ్‌
    సంగీతం: శివశంకర్‌
    నిర్మాత: ఆర్‌.బి.చౌదరి
    దర్శకత్వం: బాలశేఖరన్‌

    సక్స్‌స్‌ ఫుల్‌ చిత్రాల సంస్థ సూపర్‌గుడ్‌ తెలుగులో తీసిన తొలి స్ట్రయిట్‌ చిత్రమిది. రీ-మేక్‌ చిత్రాలను విజయవంతమైన చిత్రాలుగా తీర్చి దిద్దటంలో సఫలీకృతమైన ఈ సంస్థ స్ట్రయిట్‌గా ఎంపిక చేసుకున్న కథను సరైన రీతిలో ప్రజెంట్‌ చేయలేక పోయింది. ఈ చిత్రం ప్రథమార్థంలో అధిక శాతం హీరో, హీరోయిన్‌ డైరీ చదువుతున్న నేపథ్యంలో రూపొందింది. క్లాస్‌ ఆడియన్స్‌ ఈ పాయింట్‌ను అర్థం చేసుకున్నట్లు మాస్‌ ఆడియన్స్‌ అర్థం చేసుకోలేక పోవచ్చు. కొంచెం గందర గోళంగా ఉంది. అయితే ద్వితీయార్థాన్ని దర్శకుడు బాలశేఖరన్‌ చక్కగా డీల్‌ చేసినప్పటికీ ఈ తరహా సన్నివేశాల్ని గతంలో చూసి ఉండటంతో అంత ప్రభావాన్ని చూపించదు.

    తరుణ్‌ తలిదండ్రుల నిర్ణయానికి వ్యతిరేకంగా అక్క పెళ్ళిని జరిపించి అమె నిర్వహించే ఫ్లవర్‌ బొటిక్‌ షాప్‌ నిర్వహణని స్నేహితులతో కలసి చూస్తుంటాడు. ఓ రోజు తండ్రి తన పాత సామానుల దుకాణం చూడమని చెప్పి వెళ్ళటంతో అక్కడకు వెళ్ళిన తరుణ్‌కు పాత బీరువాలోంచి ఓ డైరీ కనబడుతుంది. అది తన అక్కవాళ్ళ ఎదురింట్లో ఉన్న స్నేహది కావటంతో స్నేహితులందరూ ఆసక్తిగా చదవటం మొదలు పెడతారు. కథ ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. తరుణ్‌ని గాఢంగా ప్రేమించిన స్నేహ ఆ విషయాన్ని అతనితో చెప్పలేక చెల్లెలు ప్రీతితో చెప్పి రాయబారం చేయమంటుంది.

    అక్క అదృష్టానికి సంతోషించాల్సిన ప్రీతి అలా చేయకుండా అతనికి తాను దగ్గరవటానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమెను స్నేహితురాలిగానే భావించిన తరుణ్‌ తిరస్కరిస్తాడు. దాంతో తన ప్రేమను కూడా తరుణ్‌ నిరాకరిస్తే భరించలేనని స్నేహ మౌనంగా టాన్స్‌ఫర్‌ అయిన తండ్రితో వైజాగ్‌ వెళ్ళిపోతూ తను రోజు రాసే డైరీని పాత బీరువాలో వదిలేస్తుంది. సామాను పట్టక వదిలేసిన బీరువా ద్వారా ఆ డైరీ తరుణ్‌ కంట పడిందన్న మాట. స్నేహ ప్రేమను తెలుసుకున్న తరుణ్‌ ఆమెను వెదుక్కుంటూ వైజాగ్‌ వెళ్ళటం. అక్కడ అనుకోకుండా పరిచయమైన శివాజీ ఫ్రెండ్‌గా మారటం వెంట వెంటనే జరిగి పోతాయి.

    ప్రేయసి కోసం తరుణ్‌ వెదుకుతుంటే అక్క ప్రేమను నిలబెట్ట టానికి ప్రీతి ఆరాట పడుతుంది. ఈ లోపు తండ్రి బలవంతంపై పెళ్ళికి ఒప్పుకుంటుంది స్నేహ. అయితే పెళ్ళి కొడుకు ఎవరో కాదు శివాజీయే. ఈ నిజాన్ని తెలిసి కూడా స్నేహితుని కోసం దాచి పెడతాడు తరుణ్‌. సినిమా అన్న తరువాత ముగింపు సుఖాంతంగా ఉండాలి కాబట్టి చివరకు నిజానిజాలు వెల్లడై శివాజీ ప్రీతిని చేసుకోవటం, ప్రేమికులిద్దరుఒకటి కావటంతో కథ కంచికి వెళుతుంది.

    కథలో ఎక్కడా పటుత్వం లేదు. పాయింట్‌ బాగానే ఉన్నప్పటికీ దర్శకుడు డీల్‌ చేయటంలో విఫలమయ్యాడు. సాధారణంగా ప్రేమ కథా చిత్రాలుకు సంగీతం ప్రాణంగా ఉండాలి. సూపర్‌ హిట్‌ అయిన ఏ ప్రేమ కథా చిత్రాల్ని తీసుకున్నా ఈ విషయం నిజమే అని రుజువు అవుతుంది. కానీ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయిన శివశంకర్‌ మంచి పాటల్ని అందించటంలో సఫలీకృతుడు కాలేక పోయాడు. అయితే రీ-రికార్డింగ్‌ విషయంలో ఓ.కె. నటీనటుల విషయానికి వస్తే హీరో, హీరోయిన్స్‌ తరుణ్‌, స్నేహ చక్కని నటనను ప్రదర్శించారు. ప్రీతి మాత్రం కొన్ని సన్నివేశాల్లో ఎబ్బెట్టుగా కనిపించింది. ప్రత్యేకంగా పేర్కొనాల్సింది వేణుమాధవ్‌ని. అతనున్న ప్రతి సన్నివేశం బాగా పండింది. కామెడీ పరంగా ఎంత బాగా నవ్వించాడో సెంటిమెంట్‌ సీన్స్‌లోనూ అంత ఇన్‌వాల్వ్‌ అయ్యేలా చేసేడు. శ్యాం.కె.నాయుడు కెమెరా పనితనం కంటికింపుగా ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X