twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చలనం లేని 'సంచలనం'

    By Staff
    |

    Sanchalanam
    -సౌమిత్‌
    దేశంలో నేరం చేసిన వాళ్లు తప్పించుకోవడానికి కోర్టులు అన్నిరకాలుగా సహాయపడుతున్నాయని న్యాయవ్యవస్థలో ఎన్నో లొసుగుల వల్ల పోలీసులు సిన్సియర్‌గా డ్యూటీచేసి నేరస్థుల్ని పట్టుకున్నప్పటికీ వారికి సరైన శిక్ష పడటం లేదని, అదే నేరస్థుడిని స్పాట్‌లోనే శిక్షించే అధికారం (ఇన్‌స్టెంట్‌ జస్టిస్‌) కావాలని కోరుతూ రూపొందించబడ్డ చిత్రమే 'సంచలనం'. సెంట్రల్‌ అయిడియా మంచిదే కానీ దాన్ని సమర్ధవంతంగా కథగా రూపొందించడంలోను, తెరపై చూపెట్టడంలోనూ విఫలమయ్యారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.''కర్మభూమి, మన జన్మభూమి...తెలతెల వారంగ నిద్దట్ల దులిపేసి పైపైన మీతోలు కడిగేసి ప్లాస్టిక్‌ నవ్వుల్ని పెదవులకు అతికించి... ఏ పార్టీ హిస్టరీ ఏమందిరా ఏ గవర్నమెంటు వస్తే ఏమైందిరా'' అనేపాట ఒక్కటే ఈ చిత్రంలో చెప్పకోవాల్సింది.

    కథ విషయానికి వస్తే, ప్రకాష్‌రాజ్‌(స్టాలిన్‌) సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌. దేశాన్ని కన్నతల్లిగా భావిస్తుంటాడు. ఆశయాల కోసం తపత్రయపడే రోజా సమాజంలోని కుళ్లు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే కాపాడి, ఐ.ఎ.ఎస్‌ చదివించి అమె కోరికపై భార్యగా చేసుకుంటాడు. గూండా, అవినీతిపరుడైన జయప్రకాష్‌ రెడ్డిని ఎదుర్కొన్నందుకు డ్యూటీ నుంచి సస్పెండ్‌ కావడమే కాకుండా హత్యానేరం క్రింద అరెస్ట్‌ కూడా అవుతాడు. మరో సిన్సియర్‌ కానిస్టేబుల్‌ బ్రహ్మాజీ ఇచ్చిన సాక్ష్యం మేరకు నిర్ధోషిగా విడుదలయ్యే సమయానికి అవినీతిపరుడైన జయప్రకాష్‌రెడ్డి మంత్రిగా మారతాడు.

    కలెక్టర్‌గా సెలక్ట్‌ అయిన రోజా కలెక్టర్‌గా రావడం జయప్రకాష్‌రెడ్డి అన్యాయాన్ని ఎదిరించడం ఇలా కథ సాగుతూ, సిన్సియర్‌ కానిస్టేబుల్‌ బ్రహ్మాజీని చంపిన మరో పోలీసు అధికారి పృధ్వీని ప్రకాష్‌రాజ్‌ చంపడంతో క్లయిమాక్స్‌ చేరుతుంది. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకాష్‌రాజ్‌ని నిలదీసిన జయప్రకాష్‌రెడ్డి అకృత్యాలన్నింటినీ బయటపెట్టడం, ఆగ్రహించిన ముఖ్యమంత్రి జయప్రకాష్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బహష్కరిస్తూ రాజీనామా చేయాలని కోరుతూ నిరాహారదీక్ష చేయడం, ముఖ్యమంత్రిని చంపాలనుకున్న జయప్రకాస్‌రెడ్డిని హీరో తుదముట్టించడంతో కథ కంచికి వెళుతుంది.

    సరైన పట్టు లేకపోవడం వల్ల కొన్ని మంచిసీన్స్‌ కూడా తేలిపోయాయి. నటీనటుల పెర్ఫార్మెన్స్‌ పరంగా ప్రకాష్‌రాజ్‌కి అగ్రతాంబూలం అయినప్పటికీ అతను డైలాగ్స్‌ స్పీడ్‌గా చెప్పడం వల్ల స్పష్టత లోపించింది.జయప్రకాష్‌ రెడ్డికి పెట్టిన ''ఆ...ఆ...ఆ'' అనే మేనరిజం ప్రేక్షకుల్ని అలరించకపోగా సహనానికి పరీక్ష పెట్టింది. స్కోప్‌ సినిమాకి ఉండాల్సినంతా లావిష్‌నెస్‌ ఈ చిత్రానికి రాలేదు. నిర్మాత అసహాయత దీనికి కారణమేమో, ఏదో అవకాశం వచ్చినప్పుడు చుట్టేసినట్లుంది. సంగీతపరంగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోగా రీ- రికార్డింగ్‌ పరంగా మైనస్‌ అయింది.

    సినిమా పరిశ్రమలో నిర్మాతగా, దర్శకుడిగా, కార్మిక నాయకుడిగా ఎంతో ఘన చరిత్ర ఉన్న భరద్వాజ ఈ చిత్రాన్ని సంచలనం రేకెత్తించే స్థాయిలో తీయాలనుకొని పూర్తిగా ఫెయిలయ్యాడని చెప్పొచ్చు. దానికి కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు మాత్రం ఈ సినిమాకి ఎందుకు వచ్చాంరా బాబు అనుకోకుండా ఉండలేడు. ఇన్‌స్టెంట్‌ జస్టిస్‌ అనే నినాదంతో పోలీస్‌ వ్యవస్థలో చలనం తెప్పించాలనే తాపత్రయంలో బాక్సాఫీస్‌ ముంగిట బోర్లపడ్డ చిత్రంగా 'సంచలనం'ను చెప్పుకోవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X