»   » చాలాసేపు విసుగ్గా... ('సరదాగా కాసేపు' రివ్యూ)

చాలాసేపు విసుగ్గా... ('సరదాగా కాసేపు' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Saradaga Kasepu
Rating

-జోశ్యుల సూర్య ప్రకాష్
బ్యానర్: శ్రీ కీర్తి క్రియేషన్స్
తారాగణం: అల్లరి నరేష్, అవసరాల శ్రీనివాస్, మధురిమ, ఆహుతి ప్రసాద్,
ఎమ్.ఎస్.నారాయణ, సనా, కృష్ణభగవాన్, జీవా, తదితరులు.
మాటలు: పడాల శివ సుబ్రమణ్యం
కథ రేలంగి నరసింహారావు
కెమెరా: లోకి
సంగీతం: చక్రి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీ
నిర్మాత: ఎమ్.ఎల్.కుమార్ చౌదరి
విడుదల తేదీ: 17/09/2010

సరదాగా కాసేపు ఇటురండి...మిమ్మల్ని కాసేపు ఎంటర్టైన్ చేసేస్తాను అని వంశీ గారు పిలుస్తూంటే..ఏంటీ ఈ ఓపెన్ ఆఫర్ అని వర్షాలును సైతం లెక్కచేయకుండా ధియోటర్ లో దూరం..చివరకు ఏమైంది..ఇవివి సత్యనారాయణ భాషలో చెప్పాలంటే..దూల తీరింది. చిన్న పాయింట్ ని బేస్ చేసుకుని చుట్టూ కామిడీ అల్లే ఆయన గత కాలపు చాతుర్యం అంతా ఏ కాశీలో నైనా వదిలేసారో ఏమిటో అని అందరికీ డౌట్ తెప్పించింది. కథ,కథనం సమస్యగా వచ్చిన ఈ చిత్రం కధ ఎక్కడో మొదలయ్యి...కాస్సేప్పటికి మరెక్కడికో పోయి...ఆఖరుకు మరో కథను ముడేసుకుని, అర్ధాంతరంగా క్లైమాక్స్ ని చేరుకుంటుంది. ఆయన సరదాగా తీసిన కామెడీ మన ప్రాణానికి పెద్ద నసలా తయారై..ఎప్పుడు సినిమా అయిపోతుందా..పారిపోదామా అన్న ఫీలింగ్ తెప్పించింది. మరో ప్రక్క ఆయన ప్రతీ టీవీ ఛానల్ లో కనపడి పాటలు అద్బుతం...అందులోనూ నేను పాడాను అని చెప్తూంటే నిజమేకాబోసు..అంత పెద్దాయన అబద్దం ఎందుకు చెప్తాడు అనుకుంటాం..కాకపోతే ధియోటర్లో సీన్ రివర్స్..పాట రాగానే జనం బయిటకు పరుగోపరుగు. ఇక అల్లరి నరేష్, అవసరాల శ్రీనివాస్(అష్టాచెమ్మ ఫేమ్) కథలో దమ్ములేక ఖర్చయిపోయారని చెప్పటానికి చింతిస్తున్నాం.

అఅమెరికా నుంచి వచ్చిన శ్రీను(అవసరాల శ్రీనివాస్)కి మణిమాల(మధురిమ)తో పెళ్ళిచూపులు. అయితే శ్రీనుకి ఓ తింగరి కోరిక ఉంటుంది. తానెవరో తెలియకుండా తను కట్టుకోబోయే అమ్మాయి ఇంట్లో ఓ పదిరోజులు ఉండి ఆమె ప్రవర్తనని దగ్గరనుంచి పరిశీలించి పెళ్ళిచేసుకోవాలని(అయితే ఒక్కటీ అలాంటి సీన్ మొహమాటానికి కూడా ఎక్కడా కనపడదు). ఈ కోరిక తీర్చుకోవటం ఓ విచిత్రమైన ఆలోచన చేస్తాడు. తన కారు డ్రైవర్ రంగబాబు(అల్లరి నరేష్) ని పెళ్ళి కొడుకులాగ, తానేమో డ్రైవర్ లాగ గెటప్స్ ఛేంజ్ చేసుకుని ఆ ఇంట్లో ప్రవేశిద్దామని. ఇక ఈ మనుష్యుల మార్పిడి విషయం తెలుసుకున్న శ్రీను తల్లి తండ్రులు...పెళ్ళి కూతురు కుటుంబానికి ఈ విషయం తెలియబరుస్తారు. అయితే ఈ లోగా మరో ట్విస్ట్. పెళ్ళి కూతురు ఇంటికి వెళ్ళకముందే శ్రీనుబుద్ది మారి...ఈ తింగరి ప్లాన్ ని వదిలేసి... ఎవరిలాగే వాళ్ళే ఉందామనుకుంటాడు. అయితే ఈ విషయం తెలియని మణిమాల ఇంట్లో వాళ్ళు అసలు పెళ్ళి కొడుకు శ్రీనుని డ్రైవర్ అనుకుని, డ్రైవర్ ..రంగబాబుని పెళ్ళి కొడుకు అనుకుని రివర్స్ లో ట్రీట్ చేస్తూంటారు. ఈ క్రమంలో డ్రైవర్ రంగబాబు..పెళ్ళి కూతురుతో ప్రేమలో పడతాడు. అది అర్దమైన శ్రీను ఈ ప్రేమని చెడకొట్టి...తాను అసలు పెళ్ళికొడుకుని అని చెప్దామనుకుంటాడు. ఇలా గందరగోళంగా మారిన ఈ సిట్యువేషన్ నుంచి వీళ్ళిద్దరూ ఎలా బయిటపడ్డారు..మణిమాల ఎవరిని పెళ్లి చేసుకుంది అనేది ఓపిక, ఆసక్తి ఉంటే చూడదగ్గ మిగతా కథ.

ఈ పై కథ చదివిన వారెవరికైనా గతంలో మోహన్ బాబు...వీడెవడండీ బాబు చిత్రం గుర్తుకు వస్తుంది(అంటే ఇలాంటి పాయింట్ తో ఏ చిత్రం అంతకుముందు రాలేదనికాదు..ప్రస్తుతానికి ఇది చాలు అని). అయితే అందులో ఉన్న కామిడీ పంచ్, ట్విస్టులు ఇందులో సీరియస్ గా చాలా సేపు బూతద్దం వేసుకుని వెతికినా కనపడవు.ముఖ్యంగా కాలం చెల్లిన ఈ కథలో సంఘర్షణ కొరవడి టెన్షన్ ఎలిమెంట్ మిస్సయింది. ఫోన్ లు అందుబాటులేని లెటర్స్ రోజుల్లో అల్లుకున్న కథ కావటం ఇబ్బందైంది. కథలో మెయిన్ మెలిక లో బలం లేకుండా పోయింది. పెళ్లికొడుకు శ్రీనివాస్ ఒక్కసారి తన ఇంటికి ఫోన్ చేసి తన అమ్మా,నాన్నను రప్పించి తానే పెళ్ళికొడుకుని అని చెప్పిస్తే అయిపోయే కథని క్లైమాక్స్ దాకా పొడిగించారు. శ్రీను వాస్ అనవసరంగా ఈ పెళ్ళికూతురు ఇంట్లో సఫర్ అవుతూంటాడు కానీ ఆ పని చేయడు. అలాగే ఫస్ట్ హాఫ్ లో ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిన తనని అంత చీప్ గా ఓ పనివాడిలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారనే డౌట్ శ్రీనివాస్ కి అస్సలు రాదు...ఆ కష్టాలను అనుభవిస్తూంటాడు. అలాగే అంత పనివాడిలా ట్రీట్ చేసే కుటుంబానికి అల్లుడు అవ్వాల్సిన అవసరం అమెరికా నుంచి వచ్చిన అతనికి అస్సలు లేదు. ఇదిలా ఉంటే సెకెండాఫ్ లో కథ లేక (కథ కదలక) కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ మధ్య పెద్ద కామిడీ ట్రాక్ పెట్టి...కథకి ముడేసే ప్రయత్నం చేసారు. అది అస్సలు పండలేదు సరికదా..కథకి అదే ప్రధాన అడ్డంకై నిలిచి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది.కామిడీ,పాటలు ఈ చిత్రానికి హైలెట్స్ అని గత కొద్ది రోజులుగా ప్రతీ టీవీ ఛానెల్ లోనూ అదే పనిగా దర్శకుడు వంశీ ఊదరకొడుతున్న ఈ చిత్రంలో ఆ రెండే పెద్ద మైనస్ లుగా నిలిచాయి.

ఇక వంశీ రెగ్యులర్ టచ్ ఈ చిత్రంలో డైలాగుల్లోనూ, అక్కడక్కడ స్లాఫ్ స్టిక్ కామిడీని పండించే ప్రయత్నంలో తప్ప ఎక్కడా కనపడదు. ఎంత ఫార్స్ కామిడీ అయినా దానికుండే ఉండే లాజిక్ లు దానికి అవసరమే విషయం వంశీకి తెలియింది కాదు...కానీ ఎక్కడో ఆ గోల్డెన్ టచ్ మిస్సై మిస్సైల్లా మనకు గుచ్చుకుంది. ఇక నటుల్లో అల్లరి నరేష్ చేత ఎక్కువ డైలాగులు చెప్పించి విసుగు తెప్పించారు. ఎంతో ఎక్సపెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్..ప్యాసివ్ గా మారిపోయి కథలో ఏం చేయకుండా దిక్కులు చూస్తుండిపోయాడు. హీరోయిన్ మధురిమ..అక్కడక్కడా అంగాంగ ప్రదర్శన చేసినా గత సినిమాల్లో లాగానే ఆమె కనీస నటన కూడా ప్రదర్శించలేకపోయింది. కృష్ణ భగవాన్ పంచ్ లు అక్కడక్కడా పేలినా ..కథకు సంభందం లేని ట్రాక్ కావడంతో విసుగు తెప్పించింది. టెక్నికల్ గా కెమెరా, ఎడిటింగ్ పెద్ద గొప్పగా లేవు. రీ రికార్డింగ్ చాలా చోట్ల డైలాగును మింగేసింది. ఇక అన్నీ మైనస్ లేనా ప్లస్ లు లేవా అంటే ఇన్ని మైనస్ లలో అవి అస్సలు కనపడే అవకాశం లేదు.

ఏదైమైనా ఈ సినిమా సరదాగా కాసేపు..మనల్ని చాలాసేపు విసిగిస్తుందనటంలో సందేహం లేదు. అప్పటికీ వంశీ సినిమా కామిడీ గ్యారెంటీ అని ముచ్చటపడితే వాళ్ళ అదృష్టం. ఇక ఈ సినిమాలో ఓ కమిడెయన్ ప్రారంభంనుంచీ చివరదాకా ఓ బ్యాగ్ చూపెడుతూ...దీని జిప్ తీసి చూపెడతా..జిప్ తీస్తా అని బెదిరిస్తూ తిరుగుతూంటారు. ఇంతకూ ఆ బ్యాగ్ లో ఏముంది అని ఫైనల్ గా రివిల్ చేస్తే అందులో శుభం కార్డు ఉంటుంది. ఇక నాకయితే ఆ కార్డు వాడిదగ్గర ఉందని ముందే తెలిస్తే ఎలోగోలా బ్రతిమాలి ఇంటర్వెల్ బదులు ఆ కార్డు వేయించుకుని బ్రతికిపోదును కదా అనిపించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu