twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టాలిన్‌ ఫార్ములా

    By Staff
    |

    Stalin
    సినిమా: స్టాలిన్‌
    విడుదల తేదీ: 20 సెప్టెంబర్‌ 2006
    నటీనటులు: చిరంజీవి, త్రిష, శారద, ఖుష్బూ, ప్రకాశ్‌రాజ్‌,
    ప్రదీప్‌ రావత్‌, రవళి, ముఖేశ్‌ రుషి, బ్రహ్మాజి, సునీల్‌,
    హర్షవర్ధన్‌, శివారెడ్డి, బ్రహ్మానందం తదితరులు.
    కెమెరా: ఛోటా కె నాయుడు
    సంగీతం: మణిశర్మ
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ మురుగుదాస్‌
    నిర్మాణం: అంజనా ప్రొడక్షన్స్‌
    నిర్మాత: కె నాగబాబు

    మాయరోగమదేమో గానీ.. మనిషి మనిషికి కుదరదు అని ఓ సినీకవి వర్ణించారు. సమాజంలో మనిషి ప్రవర్తనా రీతులు ఎందుకు, ఎలా మారాయో నిజంగానే మనిషికీ మనిషికీ మధ్య అంతరాలు సవాలక్ష పెరిగిపోయాయి. స్వార్థచింతనే తప్ప సమాజశ్రేయస్సు కోసం పాటుపడే వారు అంతరించిపోతున్న జాతిగా భావించాల్సిన మెటీరియలిస్టిక్‌ ప్రపంచంలో మనం ఉన్నాం.

    ఇది కాదు మన బతుకు. మనకు మనమే సాయం చేసుకోకపోతే ఈ బతుకెందుకు అని ప్రశ్నించే మహోన్నత వ్యక్తే - స్టాలిన్‌. అతడొక సామాన్యుడు. సగటు మనిషి. కార్గిల్‌ యుద్ధంలో గాయపడి మిలట్రీ నుంచి కారణాంతరాల వల్ల బయటకు వచ్చి తనకు చేతనైనంతలో పరోపకారం చేస్తూ ఉండే స్టాలిన్‌ ఒక చిన్న సంఘటనతో చెలించి సమాజంలో మార్పు కోరుకుంటాడు. అందుకోసం ఒక చిన్న విత్తనం నాటుతాడు. తను సహాయం చేసిన వారిని థాంక్స్‌ బదులు - మీరు మరో ముగ్గురికి సాయం చేయండి, వారిని తలొక్కరూ మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పండి.. ఈ విధానాన్ని అందరూ ఆచరిస్తే అనతికాలంలోనే ప్రపంచమే మారిపోతుందని నిజాయితీగా కలలు గనే యువకుడు స్టాలిన్‌. అలా ప్రతిపాదించడం ద్వారా అతడు హీరోయిజమ్‌ని గానీ, సమాజాన్ని అర్జెంటుగా మార్చేయాలని గానీ కోరుకోడు. ఒకళ్లకొకరు సేవ చేసుకోవడం ద్వారా అందరికీ ఉపయోగమనే నిజాయితీగల, నిస్వార్థపూరితమైన ఆలోచన అతడికి. చివరికి ఆ చైన్‌ హెల్పింగ్‌ తననే ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. స్టాలిన్‌ చిత్రంలో అద్భుతమైన పాయింట్‌ ఇదే.

    ఈ చక్కని సందేశాత్మక, ఆలోచనాత్మక పాయింట్‌ని హైలెట్‌ చేస్తూనే మరోవంక హీరో ఇమేజ్‌ కోసం చాలా సాధారణ విలనీని పెట్టి, ఫ్యాక్షన్‌ తరహా దాడులు, కత్తులు వూపుతూ పెద్ద సంఖ్యలో టాటా సుమోల్లోనూ, లారీల్లోనూ స్టాలిన్‌ని చంపడానికి తిరిగే జనాన్ని పెట్టి, వారితో హీరో విజృంభించి ఫైట్లు చేయడం.. ఇదంతా మరో కథ. ఇలా రెండు కథల్ని పారలల్‌గా నడిపిస్తూ.. అటు మాస్‌ ఎలిమెంట్లు, ఇటు నావెల్‌ పాయింట్‌ మిక్స్‌ చేసి అల్లిన కథతో మెగాస్టార్‌ చిరంజీవి స్టాలిన్‌గా సెప్టెంబర్‌ 20న జనం ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో మెగాస్టార్‌ పోషించిన పాత్ర ఒకరకంగా ఠాగూర్‌ తరహాలో ఉదాత్తంగా, గంభీరంగా సాగుతుంది.

    ఆయన నటన గురించి కొత్తగా చెప్పేదేముంటుంది? పాటల్లోనూ, ఫైట్స్‌లోనూ ఆయన ఫైర్‌ ఇప్పటికీ చెక్కుచెదరలేదని స్టాలిన్‌ ద్వారా మరోమారు రుజువుచేశారు మెగాస్టార్‌. ఆయన సరసన త్రిష ఒక కామియో పాత్ర పోషించింది.

    స్టాలిన్‌ చిత్రం టైటిల్స్‌ తర్వాత చాలా సాదాసీదా తెలుగు సినిమాలాగే ప్రారంభం అయింది. ఒకమ్మాయి తండ్రితో కలిసి వేరే వూరి నుంచి వచ్చి లాడ్జిలో దిగడం, అందులో పోలీస్‌ రైడింగ్‌ జరిగి ఆ అమ్మాయిని పోలీసులు పట్టుకుపోవడం, అక్కడి నుంచి ఓ కామెడీ విలన్‌ నర్సింగ్‌ వృత్తి అమ్మాయిలతో పాటు ఈ అమ్మాయిని పట్టుకెళ్లి ఇంకోరికి అమ్మేయడం.. అ సమయంలో అమ్మాయి బ్యాగ్‌లో స్టాలిన్‌ పేరు, అడ్రస్‌ చూసి నర్సింగ్‌ భయపడిపోయి.. స్టాలిన్‌ని కలుసుకోడానికి ఈ వూరు వచ్చారని ముందే ఎందుకు చెప్పలేదని ఓవరాక్షన్‌ చేసి.. అమ్మాయిని, తండ్రినీ ఆటో డబ్బులిచ్చి మరీ పంపేయడం.. జరుగుతుంది.

    నిజానికి అప్పటికి స్టాలిన్‌ ఇంకా పోరాటమే ప్రారంభించడు కానీ.. హీరో బిల్డప్‌ కోసమే ఈ సీన్‌ సృష్టించారు. అయితే, డబ్బిచ్చిన వారు వూరుకోరు కాబట్టి ఆ అమ్మాయి కోసం వారు (సుబ్బరాజు అండ్‌ పార్టీ) మూడు కార్లలో వచ్చి స్టాలిన్‌ ఇంటి నుంచే అమ్మాయిని తీసుకెళ్లిపోయే క్రమంలో స్టాలిన్‌ తల్లి శారద - మీకు దమ్ముంటే ఈ పిల్లని మా వీధి దాటించండి - అని ఛాలెంజ్‌ చేస్తుంది. వాళ్లు తీసుకెళ్తుంటే.. స్టాలిన్‌ వచ్చి వాళ్లని చితక్కొట్టేస్తాడు. ఫైట్‌.. తర్వాత హీరో తొలి పాట.

    ఈ రొటీన్‌ తతంగం పూర్తయిన తర్వాత అసలు కథ అప్పుడు మొదలవుతుంది. హీరో చాలా ఉదాత్తమైన వ్యక్తి అని రుజువు చేసే సన్నివేశాలు ఆ తర్వాత వస్తాయి. వికలాంగులకు పరీక్షలు రాస్తూ సాయపడే స్టాలిన్‌ ఒకసారి ఒక అంధురాలికి పరీక్ష రాస్తుండగా, మరో వికలాంగురాలికీ అదే రోజు పరీక్ష రాయాల్సి వస్తుంది. ఆమె దారినపోయే చాలామందిని అర్థిస్తుంది కానీ ఎవ్వరూ ఆమెకు సాయపడలేకపోతారు. బాగా చదువరి అయి వుండి, రాసేవారు లేక, తనకు చేతుల్లేక మానసిక క్షోభకు గురయ్యే ఆ అమ్మాయి కాలేజీ బిల్డింగ్‌ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ సంఘటన గురించి తెలుసుకుని చలించిపోయిన స్టాలిన్‌ - ఒకరు మరో ముగ్గురికి సహాయం చేయాలన్న ఆలోచనను ప్రయోగాత్మకంగా కార్యరూపంలోకి తీసుకువస్తాడు. అక్కడి నుండి తన వల్ల సహాయం పొందినవారిందరినీ అదే పాటించమని చెబుతాడు. 20 రోజుల తర్వాత చూస్తే.. తన వల్ల సాయం పొందిన వారెవ్వరూ ఆ సలహాని పాటించరు. అయితే, దీనితో నిరాశ చెందని హీరో ఎవరు చేసినా చేయకపోయినా తన పంథా మార్చుకోనని చెబుతాడు. సరిగ్గా ఆ సమయంలో హీరో ఒక తాగుబోతు యువకుడు కార్‌లో వెళ్తూ అడుక్కునే అమ్మాయిని నెట్టేసి పోతాడు. స్టాలిన్‌ అది చూసి .. వాడ్ని ఫాలో చేసి.. కొడతాడు. వాడు ఇంకోడికి ఫోన్‌ చేస్తాడు. పది మంది వస్తారు. హీరో కొడతాడు. ఆ విషయం ప్రదీప్‌ రావత్‌కి చేరుతుంది. అతడు మరో పది మందిని స్టాలిన్‌ మీదకి పంపిస్తాడు. స్టాలిన్‌ వాళ్లనీ కొడతాడు. అక్కడి నుంచి ప్రదీప్‌ రావత్‌ మామగారైన ప్రకాశ్‌రాజ్‌ (రాష్ట్ర హోమ్‌మంత్రి) దృష్టిలో ఈ గొడవ పడి.. స్టాలిన్‌ని పిలిపిస్తాడు. అక్కడ కూడా స్టాలిన్‌ నేరుగా ప్రకాశ్‌రాజ్‌తో తలపడిన దగ్గర నుంచి కథ అటు వైపు డైవర్ట్‌ అయిపోతుంది. ప్రకాశ్‌రాజ్‌ కొడుకు చనిపోవడం, ఆ పగతో అతడు ముఖ్యమంత్రిని స్టాలిన్‌ చంపినట్టు చేసి.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు కుట్ర చేయడం, స్టాలిన్‌ సమక్షంలోనే ముఖ్యమంత్రిని పొడిచేస్తే.. స్టాలిన్‌ ఆయనను తీసుకుని వెళ్లిపోవడం వడివడిగా జరిగిపోతాయి. ఆ ప్రోసెస్‌లో స్టాలిన్‌కు కార్గిల్‌ యుద్ధంలో జరిగిన ఒక గాయం (గుండెలో బులెట్‌ ఉండిపోతుంది) అతడిని అసక్తుడిని చేస్తుంది. ఒక వంక వందలాది మంది స్టాలిన్‌ని చంపడానికి పరిగెత్తుకొస్తున్న తరుణంలో - స్టాలిన్‌ ఫార్ములా ద్వారా ఒకరి సాయం వల్ల ఆటో కొనుక్కున్న ఎల్‌.బి. శ్రీరామ్‌ - దేవుడిలా వచ్చి స్టాలిన్‌ని ఆసుపత్రిలో చేర్పిస్తాడు.

    స్టాలిన్‌ కోలుకోవాలని అన్ని వూళ్లలో పూజలు జరుగుతాయి. ముఖ్యమంత్రి స్టాలిన్‌ గొప్పవాడని పొగిడి అలాంటి మహోన్నత వ్యక్తి బతకాలని ఆకాంక్షిస్తాడు. ఆసుపత్రి దగ్గర రెండు లక్షల మంది జనం పోగై స్టాలిన్‌ కోసం ఎదురుచూస్తుంటారు. స్టాలిన్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ కావడంతో కోలుకుని - మొదటగా ఎల్‌బి శ్రీరామ్‌ని దగ్గరకి పిలిచి.. థాంక్స్‌ చెబుతాడు. మీరు నాకు థాంక్స్‌ చెబితే సరిపోదు.. మీరు కూడా మరో ముగ్గురికి సహాయం చేసి.. తిరిగి వాళ్లని మరో ముగ్గురికి సహాయం చేయమని అడగండి.. అని ఎల్‌బి శ్రీరామ్‌ చెప్పినప్పుడు స్టాలిన్‌ ఆశ్చర్యపోతాడు.

    స్థూలంగా ఇదీ కథ. ఇందులో హీరోయిన్‌ త్రిషది కామియో పాత్ర. ఒకరకంగా త్రిష ఈ చిత్రంలో కమేడియన్‌ పాత్రనే పోషించింది. హీరోతో పాటలు వూహించుకోడం, రెండు మూడు సన్నివేశాలు తప్ప త్రిషకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదు. కమేడియన్‌ సునీల్‌ చివరిలో స్టాలిన్‌కి ఆపరేషన్‌ చేయమని డాక్టర్‌ని కాలర్‌ పట్టుకుని ఆవేశంగా అడగటంలో ఒక మంచి క్యారెక్టర్‌ నటుడిగా పరిణతి చూపించారు. చాలాకాలం తర్వాత ఖుష్బూ తెలుగు తెరపై కనిపించారు. స్టాలిన్‌ అక్కగా ఖుష్బూ నటన సింప్లీ సుపర్బ్‌. స్టాలిన్‌ తల్లిగా శారదది సరదా అయిన పాత్ర. తలపండిన నెల్లూరు రాజకీయ నాయకుడిగా ప్రకాశ్‌రాజ్‌ నటన భేష్‌. క్లయిమాక్స్‌లో సునీల్‌ మెరుపులు మెరిపించగా, ఎల్బీ శ్రీరామ్‌ ఆటోడ్రైవర్‌గా చిన్న దయినా కీలకమైన పాత్ర పోషించారు.

    చైన్‌ హెల్పింగ్‌ అనే పాయింట్‌ హీరో ప్రతిపాదించిన తర్వాత దాని గురించి మళ్లీ హీరో ప్రత్యక్షంగా ఏమీ చేయకపోవడం వల్ల దాని ఇంపాక్ట్‌ తగ్గిందనిపిస్తుంది. స్టాలిన్‌ ఫార్ములా - అతిగా రుద్దితే రిస్క్‌ అనుకున్నారో ఏమో.. దాన్ని మొదలుపెట్టి వదిలేసి.. తర్వాత హీరో కథని మూసపోసిన తెలుగు సినిమాలా నడిపించడమే కొద్దిగా యిబ్బంది కలిగిస్తుంది. అయితే, చివరి అరగంటలో చిత్రంలోని అన్ని పాత్రల్నీ ఏకం చేసి.. కలిపిన తీరు మాత్రం అభినందనీయం. ఆఖరి అరగంట జరిగే సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుని కళ్లని తడిచేస్తాయి. గుండెని స్పృశిస్తాయి. స్టాలిన్‌ జనానికి కావల్సిన వ్యక్తిగా అంతా ముక్తకంఠంతో ఘోషించడంతో కథ ముగుస్తుంది.

    ఈ చిత్రంలో మాటలు, పాటలు సోసోగా సాగిపోతాయి. వినోదం పాళ్లు చిరంజీవి చిత్రాలతో పోలిస్తే తక్కువే అయినా చిత్రం ఎక్కడా బోర్‌ కొట్టించదు. ఒక మంచి సందేశాన్ని ఫార్ములా చట్రంలో ఇరికించి ప్రొజెక్ట్‌ చేసి స్టాలిన్‌ సృష్టికర్తలు సేఫ్‌గేమ్‌ ప్లే చేశారనిపిస్తుంది. కెమెరా ఛోటా కె నాయుడు, ఎడిటింగ్‌ ఆంటోని, ఆర్ట్‌ ఆనందసాయి తదితర నిపుణులు మంచి పనితనం ప్రదర్శించారు.

    మొత్తానికి స్టాలిన్‌ మాస్‌, క్లాస్‌ అన్న తేడాలు లేకుండా అందరినీ అలరిస్తాడు. ఆలోచింపజేస్తాడు కూడా.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X